Dinesh Karthik on Siraj: టెస్టుల్లో 300 వికెట్లు తీసే సామర్థ్యం అతడికే ఉంది.. భారత పేసర్‌పై దినేశ్ కార్తిక్ ప్రశంసలు
Dinesh Karthik on Siraj: టీమిండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై దినేశ్ కార్తిక్ ప్రశంసల వర్షం కురిపంచాడు. భవిష్యత్తులో భారత్ తరఫున టెస్టుల్లో 300 వికెట్లు తీసే సామర్థ్యం అతడికే ఉందని స్పష్టం చేశాడు.
Dinesh Karthik on Siraj: టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సాయంతో నాగ్‌పుర్, దిల్లీ రెండు టెస్టుల్లోనూ విజయ కేతనం ఎగురవేసింది. ఇండోర్ వేదికగా జరగనున్న మూడో టెస్టులోనూ ఇదే రకమైన ప్రదర్శనను ఊహిస్తున్నారు అభిమానులు. అయితే తొలి రెండు టెస్టుల్లో స్పిన్నర్లతో పాటు పేసర్లు మెరుగ్గా రాణించారు. మొదటి టెస్టులో మహమ్మద్ సిరాజ్ తన స్పెల్‌తో ఆకట్టుకోవడమే కాకుండా ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేశాడు. రెండో టెస్టులో షమీ నాలుగు వికెట్లతో రాణించాడు. దీంతో స్పిన్నర్లతో పాటు పేస్ బౌలర్లు కూడా ఆసీస్ బ్యాటర్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ విషయంపై భారత సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ స్పందించాడు.
ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ ఆసీస్ బ్యాటర్లకు ముప్పుగా మారతాడని దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌లో అతడు మెరుగ్గా రాణిస్తాడని, అంతేకాకుండా టెస్టు క్రికెట్‌లో తదుపరి 300 వికెట్లు తీసే బౌలర్ అతడేనని ప్రశంసల వర్షం కురిపించాడు.
"నేను కచ్చితంగా చెప్పగలుగుతాను. 2023 వన్డే ప్రపంచకప్‌లో అతడు(సిరాజ్) తప్పకుండా ఉంటాడు. ఆ స్థానానికి అతడు పూర్తి అర్హుడు. అతడు చాలా బాగా రాణిస్తున్నాడు. 2022 ఐపీఎల్ అతడికి చాలా విషయాలను నేర్పించింది. వైఫల్యాలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నాడు. దీని వల్ల మెరుగైన ఫలితాలను రాబడుతున్నాడు. అతడు గాయాలు పాలవ్వకుండా ఉంటే టెస్టు బౌలర్‌గా అతడు కనీసం 300 వికెట్లు తీయగలడు" అని దినేశ్ కార్తిక్ స్పష్టం చేశాడు.
"300 వికెట్లు తీసే సామర్థ్యం, నైపుణ్యం సిరాజ్‌కు ఉంది. అతడు అంతకాలం ఫిట్‌గా ఉండగలడా లేదా అనేదే తెలుసుకోవాల్సిన విషయం. టెస్టు క్రికెట్‌లో అతడు బలమైన బౌలర్. ఆ తర్వాత వన్డేలు, టీ20లు ఉన్నాయి. అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు." అని దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడినప్పుడు సిరాజ్‌తో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు కార్తిక్. రాబోయే ఐపీఎలీ సీజన్‌లోనూ అతడితో తిరిగి కలవడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. మార్చి 1 నుంచి 5 వరకు మూడో టెస్టు జరగనుంది. ఇండోర్ ఇందుకు వేదిక కానుంది. ఈ సిరీస్‌లో గెలిస్తే భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంటుంది.