Dinesh Karthik: ఆ విషయంలో ధోనీ కంటే గొప్పోడు కార్తీక్: కపిల్ దేవ్
దినేష్ కార్తీక్‌పై ఓ రేంజ్‌లో ప్రశంసలు కురిపించాడు లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్. తన ప్రదర్శనతో సెలక్టర్లకు తనను ఎంపిక చేయడం తప్ప మరో దారి లేకుండా చేశాడని కపిల్ అన్నాడు.
న్యూఢిల్లీ: ఇప్పుడు ఇండియన్ క్రికెట్‌లో మార్మోగిపోతున్న పేరు దినేష్ కార్తీక్. ఒక్క ఐపీఎల్ సీజన్ దాదాపు తెరమరుగైపోయిన అతన్ని మళ్లీ హీరోని చేసింది. ఆర్సీబీ తరఫున ఐపీఎల్ 2022లో కార్తీక్ ఆడిన తీరు అందరినీ ఆకర్షించింది. చివరికి నేషనల్ టీమ్ సెలక్టర్లు కూడా అతన్ని తిరిగి టీమిండియాకు ఎంపిక చేయాల్సి వచ్చింది. అంతేకాదు టీ20 వరల్డ్‌కప్ రేసులోనూ కార్తీక్ ఉండటం విశేషం.
అతని పర్ఫార్మెన్స్‌పై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించాడు. అతని ఆటతీరును పొగడటానికి మాటలు చాలవని కపిల్ అనడం విశేషం. "ఈసారి అతను ఎంత బాగా ఆడాడంటే.. సెలక్టర్లకు తనను విస్మరించే అవకాశం ఇవ్వలేదు. రిషబ్ పంత్ ఓ యువకుడు. ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. కార్తీక్‌కు అనుభవం ఉంది. అలాంటి ఆట కూడా ఉంది. అందుకే అతన్ని ఎంత పొగిడినా తక్కువే" అని కపిల్ అన్నాడు.
ఎప్పుడో 2004లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు దినేష్ కార్తీక్. ఈ 18 ఏళ్లలో అతను ఒకే విధమైన అంకితభావం చూపించాడని కపిల్ అన్నాడు. "ఎమ్మెస్ ధోనీ కంటే ముందు నుంచీ కార్తీక్ క్రికెట్ ఆడుతున్నాడు. ధోనీ రిటైరై రెండేళ్లయింది. కానీ కార్తీక్ మాత్రం ఇంకా ఆడుతూనే ఉన్నాడు. అతని మోటివేషన్ లెవల్, ఆట పట్ల ప్రేమ ఇన్నేళ్ల తర్వాత కూడా అలాగే ఉండటం అంత సులువు కాదు. ఇక నిలకడ గురించి మాట్లాడితే.. వీళ్లందరి కంటే కార్తీక్ ముందే ఉన్నాడు. అతడు ఎన్ని బాల్స్ ఆడాడు అన్నది కాదు. కానీ ఎప్పుడూ తనేంటో నిరూపించుకుంటాడు. ఐపీఎల్‌లోనూ అదే జరిగింది" అని కపిల్ అన్నాడు.
సంబంధిత కథనం