Virat Kohli On Dhoni: ధోనీకి ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు - కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Virat Kohli On Dhoni: కఠిన సమయాల్లో ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత తనకు అండగా నిలిచిన వ్యక్తి ధోనీ అని అన్నాడు విరాట్ కోహ్లి. ఆర్‌సీబీ పోడ్‌కాస్ట్‌లో ధోనీతో అనుబంధంపై కోహ్లి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.
Virat Kohli On Dhoni: ధోనీకి తాను ఎప్పుడూ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడని అన్నాడు విరాట్ కోహ్లి. సోమవారం ఆర్‌సీబీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు విరాట్ కోహ్లి. ధోనీతో ఉన్న అనుబంధంతో పాటు తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. ధోనీ గురించి మాట్లాడుతూ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత కఠిన పరిస్థితుల్లో తనకు ధోనీ ఎక్కువగా అండగా నిలిచాడని పేర్కొన్నాడు.
ధోనీతో మాట్లాడాలని ఎప్పుడూ ఫోన్ చేసినా అతడు 99 శాతం లిఫ్ట్ చేయడని కోహ్లి చెప్పాడు. ఎందుకంటే ధోనీ ఎక్కువగా ఫోన్ వాడడు. చాలా సార్లు ఫోన్‌లో మాట్లాడాలని ప్రయత్నించినా ఒకటి రెండు సార్లు మాత్రమే కుదిరింది. గతంలో కఠిన సమయంలో ఉన్నప్పుడు ధోనీ పంపించిన మెసేజ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను.
బలమైన వ్యక్తిత్వం ఉన్నవారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. అలాంటి వారిని ఎలా ఉన్నావంటూ ఎవరూ అడగాల్సిన అవసరం ఉండదంటూ ధోనీ మెసేజ్ చేశాడని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ధోనీ మానసికంగా చాలా ధృడంగా కనిపిస్తుంటారని, సమయస్ఫూర్తితో ఎలాంటి పరిస్థితులను చక్కదిద్దగలడని కోహ్లి తెలిపాడు. అందుకే ధోనీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.
అనుష్క శర్మ, ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు చైల్డ్‌హుడ్ కోచ్ తర్వాత తనను బాగా అర్థం చేసుకున్నది ధోనీ మాత్రమేనని కోహ్లి అన్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో తాను ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నట్లు కోహ్లి చెప్పాడు. వాటన్నింటిని దగ్గరగా చూసిన వ్యక్తి తన భార్య అనుష్క శర్మ మాత్రమేనని, అనుష్కనే తన బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని ధోనీ పేర్కొన్నాడు.