Deepak Chahar: ఇండియాకు ఆడతా అంటే నవ్వారు.. ఇప్పుడు హార్దిక్ పాండ్యా స్థాయి నాది: దీపక్ చహర్
Deepak Chahar: ఇండియాకు ఆడతా అంటే నవ్వారు.. ఇప్పుడు హార్దిక్ పాండ్యా స్థాయి నాది అంటున్నాడు ఆల్ రౌండర్ దీపక్ చహర్. మళ్లీ పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఇండియన్ టీమ్ లోకి రావాలని చూస్తున్న చహర్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Deepak Chahar: ఇండియన్ టీమ్ లో హార్దిక్ పాండ్యాకు ఎంత విలువ ఉందో అందరికీ తెలుసు. ఈ ఆల్ రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడం దాదాపు అసాధ్యం. ముఖ్యంగా అతడు తిరిగి టీమ్ లోకి వచ్చిన తర్వాత మరో లెవల్లో ఆడుతున్నాడు. అటు బ్యాట్ తో, ఇటు బాల్ తోపాటు టీ20ల్లో కెప్టెన్ గానూ సక్సెస్ అవుతున్నాడు. అలాంటి ప్లేయర్ ను మరొకరితో భర్తీ చేయడం అంత సులువు కాదు.
అయితే తాజాగా మరో ఆల్ రౌండర్ దీపక్ చహర్ తనను తాను హార్దిక్ తో పోల్చుకుంటున్నాడు. తాను గంటకు 140 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగలనని, బ్యాటింగ్ కూడా చేస్తానని అతడు అంటున్నాడు. గాయం నుంచి కోలుకొని మళ్లీ ఇండియన్ టీమ్ లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న చహర్.. తాజాగా స్పోర్ట్స్ తక్ తో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
హార్దిక్ కంటే నేనేం తక్కువ?
"ప్రాసెస్ చాలా సింపుల్. నేను ఇండియాకు ఆడని సమయంలోనూ అదే ప్రాసెస్ ఫాలో అవుతాను. అది ఇప్పటికీ మారలేదు. నేను నా స్టేట్ టీమ్ లో ఇబ్బంది పడుతున్నప్పుడు, నా టీమ్మేట్స్ తో నేను ఏదో ఒక రోజు ఇండియాకు ఆడతానని అన్నప్పుడు వాళ్లు నవ్వారు.
కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. నేను గంటకు 140 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగలను. బంతిని రెండువైపులా స్వింగ్ చేయగలను. బ్యాటర్లను ఔట్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది పడను. బ్యాటింగ్ కూడా చేయగలిగినప్పుడు ఇండియన్ టీమ్ లో స్థానానికి ఢోకా లేదు.
మళ్లీ మునుపటి ఫామ్ అందుకోవాలని చూస్తున్నాను. అలా చేయగలిగితే నేను మళ్లీ ఆటోమేటిగ్గా సెలక్ట్ అవుతాను. ఇప్పుడు కూడా నేను గంటకు 140 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తూ, స్వింగ్ చేస్తూ, బ్యాటింగ్ కూడా చేయాలని అనుకుంటున్నా" అని చహర్ అన్నాడు.
వెన్ను గాయం కారణంగా గతేడాది చహర్ టీ20 వరల్డ్ కప్ ఆడలేకపోయాడు. ఆ తర్వాత డిసెంబర్ లో బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్ లో ఆడే అవకాశం దక్కినా మరోసారి గాయపడి టీమ్ కు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్లో రాణించి మళ్లీ ఇండియన్ టీమ్ లోకి రావాలని చూస్తున్నాడు. అతని ఫిట్‌నెస్ కు అసలుసిసలు పరీక్ష ఎదురు కానుంది.
అయితే ఇండియన్ టీమ్ లో పోటీ ఎక్కువగానే ఉన్నా.. బ్యాటింగే తనకు అదనపు బలం అని చహర్ అంటున్నాడు. "పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు బెస్ట్ ప్లేయర్స్ మధ్య కూడా బెస్ట్ అనిపించుకోవాలి. నాకు బ్యాటింగ్ ప్లస్ పాయింట్. చిన్నతనం నుంచీ అది చేస్తున్నా.
నేనెప్పుడూ బ్యాటింగ్ పైనే ఫోకస్ చేస్తున్నా. గతేడాది నాకు అవకాశాలు వచ్చినప్పుడు నేను రన్స్ చేయగలిగాను. మ్యాచ్ లు గెలిపించే అవకాశం వచ్చినప్పుడు నేను నా అత్యుత్తమ ఆట ఆడటానికి ప్రయత్నిస్తాను. హార్దిక్ పాండ్యాను చూడండి. అతడు మూడు పనులను సమర్థంగా చేయగలడు. వేగంగా బౌలింగ్ చేస్తాడు. స్వింగ్ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు.
వచ్చే ఏడాది, రెండేళ్ల పాటు హార్దిక్ స్థానాన్నీ ఎవరూ భర్తీ చేయలేరు. అతడు ప్రపంచంలోనే నంబర్ 1 ఆల్ రౌండర్. అందుకే నేను మాత్రమే కాదు. ఆ పని చేయగలిగిన ఏ ప్లేయర్ కు అయినా టీమ్ లో చోటుకు ఢోకా ఉండదు" అని చహర్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం