IPL 2022 | ఢిల్లీకి షాక్.. రెండో ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్‌లో సోమవారం ఓ కొవిడ్ డ్రామా నడిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లోని ఓ ప్లేయర్ యాంటిజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా, తర్వాత తొలి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌లో నెగటివ్‌గా.. మళ్లీ రెండో టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలడం గమనార్హం.
ముంబై: టీమ్‌లో ఎవరూ కొవిడ్ బారిన పడలేదు అని ఊపిరి పీల్చుకునే లోపే ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ రెండో ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌లో కొవిడ్ పాజిటివ్‌గా తేలాడు. యాంటీజెన్ టెస్ట్‌లో అతనికి పాజిటివ్ అని రావడంతో టీమంతా పుణె వెళ్లకుండా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. తర్వాత తొలిసారి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నిర్వహించినప్పుడు మార్ష్‌తోపాటు మిగతా ప్లేయర్స్‌కు కూడా నెగటివ్ అని తేలింది.
అయితే రెండోసారి ఇదే టెస్ట్ నిర్వహించగా.. మిచెల్ మార్ష్‌కు పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు కనీసం పది రోజుల పాటు టీమ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. మిగతా టీమ్ సభ్యుల రిపోర్టులన్నీ నెగటివ్‌గానే వచ్చాయి. అంతకుముందే టీమ్ ఫిజియోతోపాటు టీమ్ డాక్టర్ కూడా కొవిడ్ బారిన పడ్డారు. మార్ష్ కొవిడ్ బారిన పడినా.. బుధవారం ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి పీటీఐతో చెప్పారు.
మార్ష్‌కు కొన్ని లక్షణాలు కనిపించడంతో వెంటనే యాంటీజెన్ టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది. గతవారం కొవిడ్ బారిన పడిన ఫిజియో ఫర్హార్ట్ ఆధ్వర్యంలో మార్ష్ రీహ్యాబిలిటేషన్‌లో ఉన్నాడు. అతని వల్లే మార్ష్‌కు కొవిడ్ సోకినట్లు ఇప్పుడు స్పష్టమైంది. ఈ ఇద్దరికి సన్నిహితంగా ఉన్న డాక్టర్ కూడా కొవిడ్ బారిన పడ్డారు. సోమవారం ఉదయమే ఢిల్లీ టీమ్ పుణె వెళ్లాల్సి ఉన్నా.. మార్ష్ కారణంగా టీమంతా ముంబైలోనే క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. అయితే మిగతా ప్లేయర్స్ అందరూ నెగటివ్‌గా తేలడంతో బుధవారం ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారంగానే జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న టీమ్స్ అన్నీ.. పుణెలో ఆడాల్సి వచ్చినప్పుడు అక్కడి కాన్రాడ్ హోటల్‌లో బీసీసీఐ ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో ఉంటున్నాయి. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి టీమ్‌లోని అందరికీ ప్రతి ఐదు రోజులకు ఒకసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇది మూడు రోజులకు ఒకసారి ఉండేది.
టాపిక్