IPL best Partnership | శివమ్ దూబే-ఊతప్ప అరుదైన రికార్డు
బెంగళూరుతో మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు శివమ్ దూబే-రాబిన్ ఊతప్ప అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్‌లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రెండో జోడీగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై చెన్నై 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం నాడు జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితంగా ఈ సీజన్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది సీఎస్‌కే. శివమ్ దూబే, రాబిన్ ఊతప్ప విద్వంసంతో చెన్నై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పూనకం వచ్చినట్లుగా ఇరువురు బ్యాటర్లు.. బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగి జట్టుకు భారీ విజయాన్ని అందించారు. ఇరువురు అర్ధ శతకాలతో మెరిసి ఆలస్యమైనా.. విజయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ మ్యాచ్‌లో జోడీ మరో అరుదైన ఫీట్‌ను అందుకుంది.
శివమ్ దూబే-రాబిన్ ఊతప్ప 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఐపీఎల్‌లో ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. మొదటి స్థానంలో పంజాబ్ కింగ్స్‌పై షేన్ వాట్సన్-డుప్లెసిస్ 181 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో స్థానంలో మురళీ విజయ్-మైక్ హస్సీ జోడీ 2011లో 159 పరుగులతో మూడో స్థానంలో ఉంది.
అంతేకాకుండా 11 నుంచి 20 ఓవర్ల మధ్యలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చెన్నై మూడో స్థానంలో ఉంది. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సీఎస్‌కే 11-20 ఓవర్ల మధ్యలో 156 పరుగులు చేసింది. తొలి స్థానంలో ఆర్సీబీ(2016) 172 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా పంజాబ్ (2014) 162 పరుగులతో రెండో స్థానంలో ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టపోయి 216 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శివమ్ దూబే(95), రాబిన్ ఊతప్ప(88) విశ్వరూపమే చూపించారు. వరుస సిక్సర్లతో చెలరేగి ఆడటంతో బెంగళూరు బౌలర్లు చేతులెత్తేశారు. ఒకానొక స్థితిలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలో కూడా అర్థం కాని స్థితిలో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అనుకున్నాడంటే.. ఊచకోత ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 9 వికెట్లు నష్టపోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివర్లో షాబాజ్ అహ్మద్, సుయాశ్ ప్రభు దేశాయ్, దినేశ్ కార్తీక్ ధాటిగా ఆడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో చెన్నై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్లలో మహీశ్ తీక్షణ 4 వికెట్లతో విజృంభించగా.. కెప్టెన్ జడేజా మూడు వికెట్లు తీశాడు.
సంబంధిత కథనం
టాపిక్