Aakash Chopra on Hardik: తిలక్‌ను వద్దని హార్దిక్ భారీ షాట్లు ఆడాడు.. సింగిల్ తీస్తే ఏం పోయేది: ఆకాశ్ సీరియస్
Aakash Chopra on Hardik: తిలక్‌ను వద్దని హార్దిక్ భారీ షాట్లు ఆడాడు.. సింగిల్ తీస్తే ఏం పోయేది అంటూ హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్రంగా మండిపడ్డాడు.
Aakash Chopra on Hardik: వెస్టిండీస్ పై కీలకమైన మూడో టీ20లో గెలిచి ప్రస్తుతానికి సిరీస్ కాపాడుకుంది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ లో టీమ్ సాధించిన విజయం కంటే.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యవహరించిన తీరు అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. ఇండియన్ టీమ్ లోకి వచ్చీ రాగానే అద్భుతంగా ఆడుతున్న తిలక్ వర్మకు హాఫ్ సెంచరీ చేసుకునే అవకాశం ఇవ్వకుండా హార్దిక్ సిక్స్ కొట్టిన తీరుపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా మండిపడ్డాడు.
ఇక్కడేమీ నెట్ రన్‌రేట్ అవసరం లేదు కదా.. సింగిల్ తీసి తిలక్ కు అవకాశం ఇస్తే ఏం పోయేది అంటూ పాండ్యాపై ఆకాశ్ విరుచుకుపడ్డాడు. హార్దిక్ చాలా స్వార్థంగా వ్యవహరించాడని, సిగ్గులేని కెప్టెన్ అంటూ ఈ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆకాశ్ చోప్రాలాంటి మాజీ క్రికెటర్ కూడా హార్దిక్ ను తప్పుబట్టడం గమనార్హం.
"హార్దిక్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఇదే ఆసక్తికరమైనది. పైగా వచ్చీరాగానే నాటౌట్ గా ఉండటం ముఖ్యమని తిలక్ కు చెప్పాడు. కానీ హార్దికే భారీ షాట్లు ఆడాడు. ఇక్కడ నెట్ రన్‌రేట్ అవసరం లేదు. ఎలా గెలిచినా పెద్దగా పోయేదేమీ లేదు. తిలక్ ను వద్దని చెప్పి తానే భారీ షాట్లు ఆడాడు. 13 బంతుల్లో 2 పరుగులు కావాలి. అతడు సింగిల్ తీసి తిలక్ కు అవకాశం ఇస్తే అతడు సిక్స్ తో ముగించేవాడేమో" అని తన యూట్యూబ్ ఛానెల్లో ఆకాశ్ అన్నాడు.
జట్టులో ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఎవరూ పట్టించుకోరని హార్దిక్ కెప్టెన్ అయిన కొత్తలో అన్నాడు. అదే విషయం తరచూ చెబుతుంటాడు. వ్యక్తిగత మైలురాళ్లు ముఖ్యం కాదనీ అతడు అంటుంటాడు. అందులో భాగంగానే హార్దిక్ ఇలా చేశాడేమో అని కూడా ఆకాశ్ అన్నాడు.
"ప్లేయర్స్ వ్యక్తిగత మైలురాళ్లు, అజేయంగా ఉండటం, హాఫ్ సెంచరీ చేసుకోవడంలాంటివి పట్టించుకోకూడదనే ఓ జట్టు సంస్కృతిని వాళ్లు నిర్మించాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ నాటౌట్ గా ఉండటం కూడా పెద్దగా అవసరం లేని విషయం. ఒకవేళ ఔటైనా కూడా ఆ రెండు పరుగులు చేయడానికి మరో 12 బంతులు ఉన్నాయి. తిలక్ ను ఫిఫ్టీ చేయకుండా అడ్డుకున్నాడు. అతనికి అవకాశం ఇవ్వలేదు. ఇదే నా అభిప్రాయం. పాత కాలం మనిషిని అని నన్ను అనుకున్నా సరే" అని ఆకాశ్ స్పష్టం చేశాడు.
ఆడిన తొలి మూడు అంతర్జాతీయ టీ20ల్లోనూ ప్రతి మ్యాచ్ లో 30కిపైగా పరుగులు చేసి అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు తిలక్ వర్మ. అయితే వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేసే అవకాశం అతనికి ఉన్నా.. హార్దిక్ వ్యవహరించిన తీరు మాత్రం అభిమానులకు మింగుడు పడటం లేదు.
సంబంధిత కథనం