Ind vs WI 3rd T20 Highlights: సూర్య స్పెషల్, తిలక్ హ్యాట్రిక్ మెరుపులు.. మూడో టీ20లో విండీస్ చిత్తు
Ind vs WI 3rd T20 Highlights: సూర్య స్పెషల్ ఇన్నింగ్స్.. తిలక్ వర్మ హ్యాట్రిక్ మెరుపులు మూడో టీ20లో టీమిండియాను గెలిపించాయి. ఈ ఇద్దరూ చెలరేగడంతో ఇండియా ఏడు వికెట్లతో విజయం సాధించింది.
Ind vs WI 3rd T20 Highlights: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సూర్యకుమార్ మరోసారి తనదైన స్టైల్లో మెరుపులు మెరిపించడంతో మూడో టీ20లో వెస్టిండీస్ ను ఇండియా చిత్తుగా ఓడించింది. తిలక్ వర్మ తన డ్రీమ్ రన్ కొనసాగిస్తూ వరుసగా మూడో మ్యాచ్ లోనూ చెలరేగాడు. దీంతో 160 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
సూర్యకుమార్ కేవలం 44 బంతుల్లోనే 83 పరుగులు చేసి ఔటవగా.. తిలక్ చివరి వరకూ క్రీజులో ఉండి 37 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఓపెనర్లు యశస్వి (1), గిల్ (6) దారుణంగా విఫలమైన సమయంలో ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 87 పరుగులు జోడించి టీమ్ ను గెలిపించారు. ముఖ్యంగా సూర్య చాలా రోజుల తర్వాత తనదైన రీతిలో మెరుపులు మెరిపించాడు.
10 ఫోర్లు, 4 సిక్సర్లతో మోత మోగించాడు. వచ్చీ రాగానే తొలి రెండు బంతులను ఫోర్, సిక్స్ కొట్టి సూర్య తన ఉద్దేశమేంటో చాటి చెప్పాడు. అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అదే జోరు కొనసాగించాడు. గ్రౌండ్ నలుమూలలా బౌండరీలు బాదాడు. టీ20ల్లో నాలుగో సెంచరీ చేయడం ఖాయం అనుకుంటున్న సమయంలో 13వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే అప్పటికే వెస్టిండీస్ కు చేయాల్సిన నష్టం చేసేశాడు.
తిలక్.. హ్యాట్రిక్
మరోవైపు హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ తన డ్రీమ్ రన్ కొనసాగిస్తున్నాడు. తొలి రెండు టీ20ల్లో టీమ్ లో అత్యధిక స్కోరర్ గా నిలిచిన అతడు.. మూడో టీ20లోనూ అదే జోష్ లో పరుగులు చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతగా ఆడుతూ సూర్యకు మంచి సహకారం అందించాడు. చివరికి 37 బంతుల్లో 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఆగిపోయాడు.
అయితే తిలక్ ను హాఫ్ సెంచరీ చేయనీయని కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హార్దిక్ స్వార్థంగా వ్యవహరించాడని, తిలక్ కు ఫిఫ్టీ చేసే అవకాశం ఇచ్చి ఉండాల్సిందని ఫ్యాన్స్ అంటున్నారు. హార్దిక్ 15 బంతుల్లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది.
బ్రాండ్ కింగ్ 42, కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 40 రన్స్ చేశారు. ఈ మ్యాచ్ కు రవి బిష్ణోయ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ 3 వికెట్లో విండీస్ ను కట్టడి చేశాడు. అక్షర్, ముకేశ్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో సిరీస్ లో విండీస్ ఆధిక్యాన్ని 2-1కి టీమిండియా తగ్గించింది. తర్వాతి రెండు టీ20లను గెలిస్తేనే ఇండియా సిరీస్ విజయం సాధిస్తుంది.
సంబంధిత కథనం