Brazil hero Richarlison: బ్రెజిల్‌ను గెలిపించిన ఈ హీరో ఒకప్పుడు ఐస్‌క్రీమ్‌లు అమ్మాడన్న విషయం తెలుసా?
Brazil hero Richarlison: బ్రెజిల్‌ను గెలిపించిన ఈ హీరో ఒకప్పుడు ఐస్‌క్రీమ్‌లు అమ్మాడన్న విషయం తెలుసా? సెర్బియాతో మ్యాచ్‌లో రిచర్లీసన్ రెండు గోల్స్‌తో బ్రెజిల్‌ను గెలిపించాడు.
Brazil hero Richarlison: రిచర్లీసన్.. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. ఐదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్‌ను తొలి మ్యాచ్‌లో 2-0తో గెలిపించిన ఘనత ఈ 25 ఏళ్ల ప్లేయర్ సొంతం. ఈ రెండు గోల్స్ చేసింది అతడే మరి. అందులో రెండో గోల్ అయితే ఇప్పటి వరకూ టోర్నమెంట్‌కే హైలైట్. అది బైసికిల్ కిక్ మరి.
మ్యాచ్ 73వ నిమిషంలో అతడీ గోల్ చేశాడు. ఈ ఏడాది బ్రెజిల్ తరఫున 7 మ్యాచ్‌లు ఆడిన రిచర్లీసన్ ఏకంగా 9 గోల్స్ చేశాడు. ఫీల్డ్ అతని స్పీడు చూసి చాలా మంది క్రిస్టియానో రొనాల్డోతో పోలుస్తున్నారు. అయితే ఇప్పుడీ స్థాయికి చేరిన రిచర్లీసన్ నోట్లో సిల్వర్‌స్పూన్‌తో ఏమీ పుట్టలేదు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఐస్‌క్రీమ్‌లూ అమ్మాడన్న విషయం మీకు తెలుసా?
తలకు గన్ గురి పెట్టినా..
రిచర్లీసన్ తండ్రి ఓ మేస్త్రీ. తల్లి ఐస్ క్యాండీలు అమ్ముతుండేది. ఆమెతోపాటు అతడు కూడా వెళ్లి అవి అమ్మేవాడు. డ్రగ్స్‌కు మారు పేరుగా నిలిచే బ్రెజిల్‌లోని నోవా వెనేసియా అనే ఏరియాలో పుట్టి పెరిగాడు. ఐదుగురు సంతానంలో అందరి కంటే పెద్దవాడు. తినడానికి తిండి లేక ఖాళీ కడుపుతో పడుకున్న రోజులు ఎన్నో. తన స్నేహితులు డ్రగ్స్ అమ్ముతూ సులువుగా డబ్బు సంపాదిస్తున్నా.. అది తప్పని తెలిసి దానికి దూరంగా ఉన్నానని రిచర్లీసన్ చెబుతాడు.
ఒకసారి డ్రగ్స్ వ్యాపారం చేసే వ్యక్తి ఒకరు అతని తలకు తుపాకీ గురి పెట్టాడట. తన నుంచి డ్రగ్స్ దొంగిలించిన వాళ్లలో తననూ ఒకడిగా భావించి అతడలా చేసినట్లు రిచర్లీసన్ చెప్పాడు. "ఆ సమయంలో చాలా భయపడ్డాను. ట్రిగ్గర్ నొక్కితే నా పనైపోయేది. కానీ మరోసాని ఇక్కడ కనిపిస్తే చంపేస్తా అని బెదిరించి వదిలేశాడు. నేను, నా స్నేహితులు అలా బతికిపోయాం" అని చెప్పుకొచ్చాడు.
అప్పటికి అతని వయసు 14 ఏళ్లు మాత్రమే. అయితే తమ కుటుంబ పరిస్థితి లేకపోయినా తాను ఏడేళ్ల వయసున్నప్పుడు తన తండ్రి తనకు పది ఫుట్‌బాల్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడని, అదే తన జీవితాన్ని మార్చేసిందని రిచర్లీసన్ గుర్తు చేసుకున్నాడు. త్వరలోనే ఫుట్‌బాల్ స్కిల్స్ పెంచుకున్న అతడు.. స్థానికంగా ఉండే ఓ వ్యాపారవేత్త దృష్టిలో పడ్డాడు. అతడు తనకు బూట్లు కొనిచ్చాడని, ఆ తర్వాత సెకండ్ డివిజన్ క్లబ్‌కు తీసుకెళ్లాడని రిచర్లీసన్ తెలిపాడు.
అమెరికా మినీరో అనే ఆ క్లబ్‌లో అతని దశ తిరిగి పోయింది. అక్కడి నుంచి రిచర్లీసన్ వెనుదిరిగి చూడలేదు. ఆ మధ్య ఎవర్టన్ క్లబ్ అతన్ని 6 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. ఎవర్టన్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఒప్పందం ఇది కావడం విశేషం. ఫీల్డ్‌లోనే కాదు బయట కూడా జాతి వివక్ష, పోలీసుల హత్యలు, తమ ప్రాంతంలో విద్యుత్ సమస్యలపైనా మాట్లాడి రిచర్లీసన్ పాపులర్ అయ్యాడు.