Argentina Knock out chances: సౌదీపై ఓటమి.. ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా నాకౌట్‌కు వెళ్లే ఛాన్స్‌ ఉందా?-argentina knock out chances after losing to saudi arabia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Argentina Knock Out Chances After Losing To Saudi Arabia

Argentina Knock out chances: సౌదీపై ఓటమి.. ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా నాకౌట్‌కు వెళ్లే ఛాన్స్‌ ఉందా?

Hari Prasad S HT Telugu
Nov 23, 2022 02:45 PM IST

Argentina Knock out chances: సౌదీపై ఓటమితో ఫిఫా వరల్డ్‌కప్‌ 2022ను మొదలుపెట్టిన అర్జెంటీనాకు నాకౌట్‌కు వెళ్లే ఛాన్స్‌ ఉందా? రౌండ్‌ ఆఫ్‌ 16కు వెళ్లాలంటే ఆ టీమ్ ఏం చేయాలి?

లియోనెల్ మెస్సీ
లియోనెల్ మెస్సీ (REUTERS)

Argentina Knock out chances: ఒక్క ఓటమి ఓ టీమ్‌ వరల్డ్‌కప్‌ ఆశలను తలకిందులు చేయొచ్చు. అందులోనూ తన కంటే బలహీనమైన టీమ్‌ చేతిలో ఓటమి ఓ పెద్ద టీమ్‌ను త్వరగా ఇంటిదారి పట్టించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మాజీ ఛాంపియన్ అర్జెంటీనా పరిస్థితి అలాగే ఉంది. తొలి మ్యాచ్‌లో సౌదీపై హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా చివరికి 1-2తో ఓటమి ఆ టీమ్‌కు మింగుడు పడటం లేదు.

ట్రెండింగ్ వార్తలు

బహుశా తన చివరి వరల్డ్‌కప్‌లో ఆడుతున్న మెస్సీ ఈసారైనా ట్రోఫీని ముద్దాడాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. కానీ తొలి మ్యాచ్‌లోనే ఓడి తర్వాత వరల్డ్‌కప్‌ గెలిచిన సందర్భాలు చరిత్రలో ఒకే ఒక్కసారి మాత్రమే. 2010లో స్పెయిన్‌ ఇలాగే గెలిచింది. ఇక ఇప్పుడు అర్జెంటీనా గ్రూప్‌ సి నుంచి కనీసం రౌండ్‌ ఆఫ్‌ 16 స్టేజ్‌కు చేరాలన్నా కూడా చెమటోడ్చాల్సిందే.

అయితే ఆ టీమ్‌ అదృష్టం కొద్దీ.. ఆ తర్వాత గ్రూప్‌ సిలో జరిగిన పోలాండ్‌, మెక్సికో మ్యాచ్‌ గోల్‌ లేకుండానే డ్రాగా ముగిసింది. దీంతో ఆ టీమ్స్‌ ఒక్కో పాయింట్ పంచుకున్నాయి. ప్రస్తుతం గ్రూప్‌ సిలో మూడు పాయింట్లతో సౌదీ అరేబియా టాప్‌లో ఉంది. ఆ తర్వాత మెక్సికో, పోలాండ్ ఉన్నాయి. అర్జెంటీనా పాయింట్లు లేకుండా చివరిస్థానంలో ఉంది.

అర్జెంటీనా ప్రీక్వార్టర్స్‌కు వెళ్తుందా?

అర్జెంటీనా ఇతర టీమ్స్‌పై ఆధార పడకుండా ప్రీక్వార్టర్స్‌ చేరాలంటే ఆడాల్సిన రెండు మ్యాచ్‌లలోనూ కచ్చితంగా గెలవాలి. అలా గెలిస్తే ఆ టీమ్‌ ఖాతాలో ఆరు పాయింట్లు ఉంటాయి. అంటే తన తర్వాతి మ్యాచ్‌లలో మెక్సికో, పోలాండ్‌లను అర్జెంటీనా ఓడించాల్సి ఉంటుంది. ఇక సౌదీ అరేబియాను అటు మెక్సికో, ఇటు పోలాండ్‌ ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ రెండు టీమ్స్‌ నాలుగు పాయింట్లతో ఉండగా.. అర్జెంటీనా ఆరు పాయింట్లతో టాప్‌లో నిలిచి క్వాలిఫై అవుతుంది.

ఒకవేళ అర్జెంటీనా ఒక మ్యాచ్‌ గెలిచి, మరో మ్యాచ్ డ్రా చేసుకున్నా.. నాలుగు పాయింట్లతో ప్రీక్వార్టర్స్‌కు వెళ్లొచ్చు. అయితే అప్పుడు మిగతా టీమ్స్‌ను దాటి ముందుకు వెళ్లడానికి సరిపడా గోల్స్‌ అర్జెంటీనా దగ్గర ఉండాలి. అర్జెంటీనా తన తర్వాతి మ్యాచ్‌లో మెక్సికోతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు జరగనుంది. ఆడాల్సిన రెండు మ్యాచ్‌లలో ఒక్కటి ఓడినా అర్జెంటీనాకు ప్రీక్వార్టర్స్‌ అవకాశాలు కష్టమవుతాయి.

WhatsApp channel