FIFA World Cup 2022 Arg vs KSA: మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనాకు షాక్‌.. సౌదీ అరేబియా చేతిలో చిత్తు-fifa world cup 2022 arg vs ksa as saudi arabia beats argentina in group c opening match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup 2022 Arg Vs Ksa: మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనాకు షాక్‌.. సౌదీ అరేబియా చేతిలో చిత్తు

FIFA World Cup 2022 Arg vs KSA: మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనాకు షాక్‌.. సౌదీ అరేబియా చేతిలో చిత్తు

Hari Prasad S HT Telugu
Nov 22, 2022 05:52 PM IST

FIFA World Cup 2022 Arg vs KSA: మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనాకు గట్టి షాక్‌ తగిలింది. గ్రూప్‌ సిలో తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో చిత్తుగా ఓడింది. ఫస్ట్‌ హాఫ్‌లో లీడ్‌లో ఉన్నా.. సెకండాఫ్‌లో చేతులెత్తేసి మ్యాచ్‌ను చేజార్చుకుంది.

ఓటమి నిర్వేదంలో లియోనెల్ మెస్సీ
ఓటమి నిర్వేదంలో లియోనెల్ మెస్సీ (AP)

FIFA World Cup 2022 Arg vs KSA: ఫిఫా వరల్డ్‌కప్‌ మూడో రోజు పెను సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్‌, 2022లో ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్న అర్జెంటీనాకు గట్టి షాక్‌ తగిలింది. తొలి మ్యాచ్‌లోనే ఆ టీమ్‌ సౌదీ అరేబియా చేతుల్లో 1-2 తేడాతో ఓటమి పాలైంది. ఫస్ట్‌ హాఫ్‌ 10వ నిమిషంలోనే వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని మెస్సీ గోల్‌గా మలచి 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లినా.. సెకండాఫ్‌లో అర్జెంటీనా ప్లేయర్స్‌ చేతులెత్తేశారు.

అద్భుతంగా పుంజుకున్న సౌదీ ప్లేయర్స్‌ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి.. చివరి వరకూ ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. సెకండాఫ్‌ ప్రారంభమైన మూడు నిమిషాలకే అంటే 48వ నిమిషంలో సౌదీ తొలి గోల్‌ చేసింది. ఆ టీమ్‌ ప్లేయర్‌ సలే అల్‌ హెహ్రీ గోల్‌ చేశాడు. తర్వాత ఐదు నిమిషాల్లోనే అంటే 53వ నిమిషంలో సలేమ్‌ అల్‌ దౌసారి మరో గోల్‌ చేయడంతో సౌదీ 2-1 లీడ్‌లోకి దూసుకెళ్లింది.

ఇక అక్కడి నుంచి స్కోరును సమం చేయడానికి అర్జెంటీనా ఎంతో ప్రయత్నించింది. అయినా ఫలితం లేకపోయింది. ఆ టీమ్‌ను సౌదీ ప్లేయర్స్‌తోపాటు గోల్‌కీపర్‌ కూడా అద్భుతంగా నిలువరించారు. గ్రూప్‌ సిలో మెక్సికో, పోలాండ్‌ టీమ్స్‌తో అర్జెంటీనా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీంతో ఆ టీమ్‌ నాకౌట్‌ స్టేజ్‌కు చేరుకోవడం ఇప్పుడు కత్తి మీద సాముగా మారనుంది.

ఈసారైనా తన వరల్డ్‌కప్‌ కల నెరవేర్చుకుందామనుకుంటున్న మెస్సీకి ఇది మింగుడు పడనిదే. గతంలో తొలి మ్యాచ్‌లోనే ఓడి వరల్డ్‌కప్‌ గెలిచిన సందర్భం ఒకే ఒక్కసారి మాత్రమే ఉంది. ఆ లెక్కన అర్జెంటీనా ముందడుగు వేయాలంటే అద్భుతమే జరగాలి. ఈ మ్యాచ్‌లోనే గోల్‌తో నాలుగు వరల్డ్‌కప్‌లలో గోల్స్‌ చేసిన తొలి అర్జెంటీనా ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన మెస్సీకి ఈ ఓటమి మాత్రం చేదు గుళిక కానుంది.

Whats_app_banner