BCCI on Rishabh Pant Accident: రిషబ్ పంత్ ప్రమాదం, గాయాలు, చికిత్సపై బీసీసీఐ రియాక్షన్ ఇదీ
BCCI on Rishabh Pant Accident: రిషబ్ పంత్ ప్రమాదం,అతనికి అయిన గాయాలు, అందించాల్సిన చికిత్సపై బీసీసీఐ అధికారికంగా ఒక ప్రకటన జారీ చేసింది. శుక్రవారం (డిసెంబర్ 30) తెల్లవారుఝామున పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
BCCI on Rishabh Pant Accident: ఇండియన్ క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. కారు ప్రమాదంలో పంత్‌కు అయిన గాయాలు, చికిత్సపై అందులో వివరించింది. శుక్రవారం తెల్లవారుఝామున ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేలో పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
నిద్ర మత్తులో కారును నడిపిస్తూ పంత్ ఈ ప్రమాదానికి గురయ్యాడు. డివైడర్‌ను ఢీకొట్టిన వెంటనే కారు అగ్నికి ఆహుతి కాగా.. సమయానికి అందులో నుంచి పంత్ బయటపడ్డాడు. ఆ వెంటనే మొదట రూర్కీ, తర్వాత డెహ్రాడూన్ హాస్పిటల్స్‌లో పంత్‌కు చికిత్స అందిస్తున్నారు. దీనిపై బీసీసీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
"శుక్రవారం తెల్లవారుఝామున ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. మొదట అతన్ని సక్షం హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందించారు" అని ఆ ప్రకటనలో బీసీసీఐ తెలిపింది. యూఏఈలో ధోనీతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పంత్.. తన కుటుంబాన్ని సర్‌ప్రైజ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్లను కలవడానికి వెళ్తున్నాడు.
"ఈ ప్రమాదంలో రిషబ్‌కు నుదుటిపై రెండు పదునైన గాయాలు అయ్యాయి. కుడి మోకాలులో చీలిక ఏర్పడింది. అంతేకాదు కుడి చేతి మణికట్టు, మడమ, వెనుక వైపు కూడా గాయాలు ఉన్నాయి. రిషబ్ పరిస్థితి నిలకడగానే ఉంది. డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అక్కడ అతనికి ఎంఆర్‌ఐ స్కాన్‌లు నిర్వహించి గాయాల అసలు తీవ్రత గురించి తెలుసుకోనున్నారు" అని ఆ ప్రకటనలో బీసీసీఐ వెల్లడించింది.
ప్రమాదానికి గురవగానే కారులో మంటలు చెలరేగడంతో అందులో నుంచి బయటపడటానికి పంత్ తీవ్రంగా ప్రయత్నించాడని, అప్పుడే ఎక్కువ గాయాలు అయినట్లు బీసీసీఐ తెలిపింది. పంత్‌కు అత్యుత్తమ చికిత్స అందించేందుకు బీసీసీఐ కృషి చేస్తుందని కూడా స్పష్టం చేసింది. రిషబ్ కుటుంబంతోనూ మాట్లాడుతున్నామని, అతనికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పింది.
సంబంధిత కథనం
టాపిక్