BCCI central contracts: సూర్యకుమార్‌, శుభ్‌మన్‌ గిల్‌లకు ప్రమోషన్‌.. రహానే, ఇషాంత్‌ ఔట్‌!-bcci central contracts to announce soon as senior players rahane and ishanth may be dropped from the list ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Bcci Central Contracts To Announce Soon As Senior Players Rahane And Ishanth May Be Dropped From The List

BCCI central contracts: సూర్యకుమార్‌, శుభ్‌మన్‌ గిల్‌లకు ప్రమోషన్‌.. రహానే, ఇషాంత్‌ ఔట్‌!

Hari Prasad S HT Telugu
Dec 12, 2022 06:20 PM IST

BCCI central contracts: సూర్యకుమార్‌, శుభ్‌మన్‌ గిల్‌లకు సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌లో ప్రమోషన్‌ దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో అజింక్య రహానే, ఇషాంత్‌ శర్మ తమ కాంట్రాక్ట్‌లు కోల్పోనున్నారు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోనున్న మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోనున్న మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే

BCCI central contracts: బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ త్వరలోనే సమావేశం కాబోతోంది. ఈ సందర్భంగా ప్రతి ఏటా అనౌన్స్‌ చేసే సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌ లిస్ట్‌ను ప్రకటించనున్నారు. అయితే తాజాగా వస్తున్న రిపోర్ట్స్‌ ప్రకారం.. ఈ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ నుంచి సీనియర్‌ ప్లేయర్స్‌ అజింక్య రహానే, ఇషాంత్‌ శర్మలను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో యువ ప్లేయర్స్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌లకు ప్రమోషన్‌ ఇవ్వనున్నారు.

ఇక భవిష్యత్తు టీ20 కెప్టెన్‌గా అభివర్ణిస్తున్న హార్దిక్‌ పాండ్యా కూడా ఈ లేటెస్ట్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌లో గ్రూప్‌ సి నుంచి గ్రూప్‌ బికి వెళ్లే అవకాశం ఉంది. డిసెంబర్‌ 21న ఈ అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ జరగనుంది. ఇందులో సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌తోపాటు మరో 11 అంశాలను చర్చించనున్నారు. అయితే ఇందులో టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా వైఫల్యంపై సమీక్ష మాత్రం లేకపోవడం గమనార్హం.

సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లలో మార్పులు

ప్రతి ఏటా టీమిండియా క్రికెటర్లలో కొందరు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇందులో ప్లేయర్స్‌ను నాలుగు గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపులో ఉన్న ప్లేయర్‌కు ఒక్కో మొత్తం ఇస్తారు. అత్యున్నతమైన ఏ+ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్‌ ఒక్కొక్కరికి రూ.7 కోట్లు, ఎ లో ఉన్న వారికి ఏటా రూ.5 కోట్లు, బిలో ఉన్న వారికి ఏటా రూ.3 కోట్లు, సిలో ఉన్న వారికి ఏటా రూ.కోటి ఇస్తారు.

ఇప్పుడున్న లిస్ట్‌లో మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. చాలా రోజులుగా టీమ్‌కు దూరంగా ఉన్న సీనియర్‌ ప్లేయర్స్‌ అజింక్య రహానే, ఇషాంత్‌ శర్మలను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ నుంచి తొలగించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. వీళ్లతోపాటు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాను కూడా తొలగించనున్నారు. సాధారణంగా గ్రూప్‌ ఎ+, ఎలలో అన్ని ఫార్మాట్లు, లేదంటే టెస్టులతోపాటు వైట్‌బాల్‌ క్రికెట్‌లో కనీసం ఒక ఫార్మాట్‌లో రెగ్యులర్‌గా ఉండే ప్లేయర్స్‌ ఉంటారు.

ఇక గ్రూప్‌ బిలో కనీసం రెండు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్స్‌, గ్రూప్‌ సిలో ఒక ఫార్మాట్‌లో మాత్రమే కనిపించే ప్లేయర్స్ ఉంటూ వస్తున్నారు. ఇక నిర్దిష్ట సంఖ్యలో ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడి ఉండాలన్న నిబంధన కూడా ఉంది. ఇక ప్లేయర్స్‌ ప్రమోషన్లలో ఐసీసీ ర్యాంకింగ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కన తాజా లిస్ట్‌లో సూర్యకుమార్‌, శుభ్‌మన్‌ గిల్‌లాంటి వాళ్లు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది.

WhatsApp channel