Ravi Shastri on Shubman Gill: శుభ్‌మన్ గిల్ పదేళ్లపాటు ఇండియాకు ఆడతాడు: రవిశాస్త్రి
Ravi Shastri on Shubman Gill: శుభ్‌మన్ గిల్ పదేళ్లపాటు ఇండియాకు ఆడతాడని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఈ యంగ్ ఓపెనర్‌పై శాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
Ravi Shastri on Shubman Gill: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను ఆకాశానికెత్తాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. అతడు చాలా కాలం పాటు ఇండియాకు ఆడతాడని అభిప్రాయపడ్డాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎంతో సక్సెస్ చూసినా.. ఇప్పటికీ అతడు వినయంగానే ఉంటాడని, అదే అతని గొప్పదనమని అన్నాడు. 2022లో తనకు వన్డేల్లో వచ్చిన అవకాశాలను గిల్ సద్వినియోగం చేసుకున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
ఈ ఏడాది 11 వన్డేలు ఆడిన అతడు 4 హాఫ్ సెంచరీలతో 625 రన్స్ చేశాడు. ధావన్‌తో కలిసి ఓపెనర్‌గా వస్తున్న గిల్.. సక్సెసవుతున్నాడు. 2023 వరల్డ్‌కప్ కోసం గిల్ తన ఓపెనింగ్ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన గిల్.. రెండో వన్డేలోనూ 45 రన్స్ చేశాడు. అయితే బంగ్లాదేశ్ టూర్‌కు రోహిత్, విరాట్‌లాంటి సీనియర్లు తిరిగి వస్తుండటంతో గిల్‌కు వన్డే టీమ్‌లో చోటు దక్కలేదు.
అతని సక్సెస్‌పై ప్రైమ్ వీడియో విశ్లేషణలో రవిశాస్త్రి మాట్లాడాడు. "గిల్ బాల్‌ను టైమింగ్ చేయడంపైనే ఎక్కువగా దృష్టి సారించాడు. కొన్నిసార్లు ఫామ్ కోల్పోయినప్పుడు బాల్‌ను గట్టిగా బాదడానికి ప్రయత్నిస్తారు. కానీ అతడు మాత్రం పూర్తి నియంత్రణలో ఉన్నాడు. మంచి ఫుట్‌వర్క్ ఉంది. అతడు ఆడుతుంటే చూడటం బాగుంటుంది. అతడో నాణ్యమైన ప్లేయర్. ఇండియాకు పదేళ్లపాటు ఆడతాడు. చేస్తున్న పనిపై పూర్తి శ్రద్ధ చూపిస్తాడు. కఠినమైన శిక్షణ పొందుతాడు. ఈ గేమ్‌ను ఇష్టపడతాడు. ఎంత సక్సెస్ సాధించినా ఎప్పుడూ వినయంగానే ఉంటాడు" అని రవిశాస్త్రి చెప్పాడు.
గిల్‌కు టీ20ల్లో అవకాశం ఇవ్వకపోవడంపైనా రవిశాస్త్రి స్పందించాడు. "శుభ్‌మన్ స్ట్రైక్ రేట్ చాలా మెరుగైంది. ఇక సగటు కూడా 70కిపైగా ఉంది. పురోగతి సాధిస్తున్న ప్లేయర్‌ను మనం చూస్తున్నాం. సూర్యకుమార్ బాగానే ఆడుతున్నా.. గిల్‌ను మరచిపోవద్దు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఎలా ఆడాలో అతడు తెలుసుకున్నాడు. అయితే టీమిండియా అతనికి ఇప్పట్లో టీ20ల్లో అవకాశం ఇవ్వకపోవచ్చు" అని రవిశాస్త్రి చెప్పాడు.