Asian Games Day 10: భారత్‍కు మరో 9 పతకాలు: చరిత్ర సృష్టించిన అన్నూ రాణి
Asian Games Day 10: ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. క్రీడల్లో పదో రోజు ఇండియాకు మరో 9 పతకాలు వచ్చాయి.
Asian Games Day 10: ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో పతకాల వేట కొనసాగిస్తున్నారు. 19వ ఏషియన్ గేమ్స్‌లో పదో రోజు (అక్టోబర్ 3) భారత్‍కు 9 పతకాలు వచ్చాయి. ఇందులో రెండు స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఈ ఏషియన్ గేమ్స్‌లో ఇండియా ఇప్పటి వరకు మొత్తంగా 69 పతకాలు (15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు) సాధించింది. 10వ రోజు జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించింది భారత అథ్లెట్ అన్నూ రాణి. ఏషియన్ 10వ రోజు భారత్‍కు వచ్చిన పతకాల వివరాలివే..
ఏషియన్ గేమ్స్‌లో 10వ రోజు భారత్ సాధించిన పతకాలు
- చరిత్ర సృష్టించిన అన్నూరాణి: మహిళల జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ అన్నూ రాణి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 62.92 మీటర్లు ఈటెను విసిరి బంగారం పట్టింది. ఏషియన్ గేమ్స్ జావెలిన్ త్రో మహిళల విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి అథ్లెట్‍గా అన్నూ రాణి చరిత్ర సృష్టించింది.
- పారుల్‍కు గోల్డ్: 5000 మీటర్ల మహిళల పరుగులో భారత అథ్లెట్ పారుల్ చౌదరీ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 15 నిమిషాల 14.75 సెకన్లలో లక్ష్యాన్ని చేరి గోల్డ్ మెడల్ సాధించింది.
- పురుషుల 800 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ మహమ్మద్ అఫ్సల్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
- పురుషుల డెకథ్లాన్‍లో ఇండియా అథ్లెట్ తేజస్విన్ శంకర్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఏషియన్ గేమ్స్ పురుషుల డెకథ్లాన్‍లో భారత్‍కు 1974 తర్వాత తొలిసారి మెడల్ వచ్చింది.
- 92 కేజీల పురుషుల బాక్సింగ్‍లో భారత బాక్సర్ నరేందర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.
- పురుషుల ట్రిపుల్ జంప్‍లో భారత అథ్లెట్ ప్రవీణ్ చిత్రవేల్ కాంస్య పతకం గెలిచాడు.
- మహిళల 400 మీటర్ల హర్డుల్స్ విభాగంలో భారత అథ్లెట్ విద్యా రామరాజ్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
- మహిళల 54కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి కాంస్య పతకం సాధించారు.
- పురుషుల కనోయింగ్ 1000 మీటర్ల విభాగంలో అర్జున్ సింగ్, సునీల్ సింగ్ జోడీగా భారత్‍కు కాంస్య పతకం సాధించింది.
19వ ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు 69 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. చైనా 297 మెడల్స్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. అక్టోబర్ 8వ తేదీ వరకు ఈ ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి.
ఇక, పురుషుల క్రికెట్‍లో నేడు (అక్టోబర్) టీమిండియా క్వార్టర్ ఫైనల్‍లో నేపాల్‍పై 23 పరుగుల తేడాతో గెలిచి.. సెమీ ఫైనల్ చేరింది.