Asian Games 2023: ఇండియన్ హాకీ టీమ్ గోల్స్ వర్షం.. సింగపూర్‌ను చిత్తుగా కొట్టేశారు
Asian Games 2023: ఇండియన్ హాకీ టీమ్ గోల్స్ వర్షం కురిపించింది. సింగపూర్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఏకంగా 16-1తో గెలిచి ఏషియన్ గేమ్స్ పూల్ ఎలో టాప్ లోకి దూసుకెళ్లింది.
Asian Games 2023: ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఏషియన్ గేమ్స్ లో దూకుడుగా ఆడుతోంది. సింగపూర్ తో మంగళవారం (సెప్టెంబర్ 26) జరిగిన పూల్ ఎ మ్యాచ్ లో ఏకంగా 16-1 గోల్స్ తేడాతో విజయం సాధించడం విశేషం. హాంగ్జౌలోని గోంగ్షు కెనాల్ స్పోర్ట్స్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ విజయంతో ఇండియా టాప్ లోకి దూసుకెళ్లింది.
ఇండియా తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ 4, మణ్‌దీప్ సింగ్ 3, అభిషేక్, వరుణ్ కుమార్ చెరో రెండు, లలిత్ ఉపాధ్యాయ్, గుర్జంత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, మణ్‌ప్రీత్ సింగ్, షంషేర్ సింగ్ తలా ఒక గోల్ చేయడం విశేషం. సింగపూర్ తరఫున ముహ్మద్ జాకీ బిన్ జుల్కర్‌నైన్ 53వ నిమిషంలో ఒక గోల్ చేశాడు. 12వ నిమిషంలో మణ్‌దీప్ సింగ్ చేసిన గోల్ తో ఇండియా గోల్స్ వర్షం మొదలైంది.
ఆ తర్వాత 16వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్, 22వ నిమిషంలో గుర్జంత్ సింగ్, 23వ నిమిషంలో వివేక్ సాగర్ ప్రసాద్, 24వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ గోల్స్ చేశారు. అంటే ఇండియా మూడు నిమిషాల్లో మూడు గోల్స్ చేయడం గమనార్హం. మరోసారి కూడా 37, 38, 39, 40 నిమిషాల్లో వరుసగా నాలుగు గోల్స్ నమోదయ్యాయి. ఇక ఆ తర్వాత 42, 51, 51, 55, 56 నిమిషాల్లో చివరి నాలుగు గోల్స్ చేశారు.
ఇప్పటికే ఏషియన్ గేమ్స్ మెన్స్ హాకీ పూల్ ఎ ఛాంపియన్‌షిప్ ను మూడుసార్లు గెలిచిన ఇండియా మెన్స్ హాకీ టీమ్ ఈ విజయంతో టాప్ లోకి దూసుకెళ్లింది. పూల్ ఎ, పూల్ బి నుంచి రెండేసి జట్లు సెమీఫైనల్స్ చేరుతాయి. తొలి మ్యాచ్ లో ఉజ్బెకిస్థాన్ పై కూడా ఇండియా ఏకంగా 16-0 గోల్స్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే
తొలి మ్యాచ్ మిస్సయిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ సింగపూర్ తో మ్యాచ్ కు తిరిగి జట్టులోకి వచ్చాడు. ఏకంగా నాలుగు గోల్స్ తో చెలరేగాడు. తొలి క్వార్టర్ లో 1-0తో ముగించిన ఇండియా.. తర్వాత మూడు క్వార్టర్లలో రెచ్చిపోయింది. ఇండియా గోల్స్ ధాటికి సింగపూర్ ఉక్కిరిబిక్కిరి అయింది. ఇక ఇండియా తన తర్వాతి మ్యాచ్ లో ఏషియన్ గేమ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్ తో గురువారం (సెప్టెంబర్ 28) తలపడనుంది.