Asian Games 2023 Football: ఏషియన్ గేమ్స్ ఫుట్‌బాల్.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన ఇండియా
Asian Games 2023 Football: ఏషియన్ గేమ్స్ ఫుట్‌బాల్ లో ఇండియా బోణీ చేసింది. బంగ్లాదేశ్ ను 1-0తో చిత్తు చేసి నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Asian Games 2023 Football: ఏషియన్ గేమ్స్ 2023 ఫుట్‌బాల్‌లో ఇండియా తొలి విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో ఆతిథ్య చైనా చేతిలో ఘోరంగా ఓడిన ఇండియన్ టీమ్.. గురువారం (సెప్టెంబర్ 21) బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో మాత్రం గెలిచింది. 1-0తో గెలిచి నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గోల్ ను కెప్టెన్ సునీల్ ఛెత్రీ చేయడం విశేషం.
ఏషియన్ గేమ్స్ తొలి మ్యాచ్ లో చైనా చేతుల్లో ఇండియా ఏకంగా 1-5 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ పై కచ్చితంగా గెలిస్తేనే నాకౌట్ ఆశలు సజీవంగా ఉండే పరిస్థితి నెలకింది. కీలకమైన ఈ మ్యాచ్ లో కెప్టెన్ సునీల్ ఛెత్రీ పెనాల్టీని గోల్ గా మలచి ఇండియాకు విజయం సాధించి పెట్టాడు. మ్యాచ్ లో మరో 7 నిమిషాలు మిగిలి ఉండగా.. అతడు ఈ గోల్ చేశాడు.
ఈ మ్యాచ్ ను ఇండియా దూకుడుగా ప్రారంభించింది. ఇండియన్ ప్లేయర్ బ్రైస్ మిరండా ఫీల్డ్ లో చురుగ్గా కదిలాడు. పదేపదే బంగ్లా గోల్ పోస్ట్ పై దాడి చేశారు. అయితే తర్వాత పుంజుకున్న బంగ్లాదేశ్ కూడా ఎదురు దాడికి దిగగా.. ఇండియన్ డిఫెండర్లు వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. 30వ నిమిషం తర్వాత ఇండియన్ ప్లేయర్స్ ప్రత్యర్థి పోస్టుపై పదేపదే దాడి చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఇక ఫస్ట్ హాఫ్ స్టాపేజ్ టైమ్ లోనే ఇండియా గోల్ చేయడానికి చేసిన మూడు ప్రయత్నాలను బంగ్లాదేశ్ టీమ్ అడ్డుకుంది. సునీల్ ఛెత్రీ, రాహుల్ కేపీ, అంజుకందన్ గోల్స్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఫస్ట్ హాఫ్ 0-0తో ముగిసింది. సెకండాఫ్ లోనూ ఇండియన్ టీమ్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. 83వ నిమిషం వరకు కూడా మ్యాచ్ లో గోల్ నమోదు కాలేదు.
అయితే 83వ నిమిషంలో ఇండియాకు పెనాల్టీ లభించింది. ఈసారి కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఏమాత్రం పొరపాటు చేయకుండా ఆ పెనాల్టీని గోల్ గా మలచడంతో ఇండియాకు 1-0 ఆధిక్యం లభించింది. ఈ విజయంతో ఇండియాకు 3 పాయింట్లు లభించాయి. ఇండియా తన తర్వాతి మ్యాచ్ లో సెప్టెంబర్ 24న మయన్మార్ తో తలపడనుంది.