Aakash Chopra on Shubman Gill: వరల్డ్ కప్‌లో ఓపెనర్ ఎవరు అన్న చర్చకు గిల్ తెరదించాడు: ఆకాశ్ చోప్రా
Aakash Chopra on Shubman Gill: వరల్డ్ కప్‌లో ఓపెనర్ ఎవరు అన్న చర్చకు గిల్ తెరదించాడని అన్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో గిల్ డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.
Aakash Chopra on Shubman Gill: గతేడాది బంగ్లాదేశ్ తో జరిగిన చివరి వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు. అయినా తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్ లో ఇషాన్ ను కాదని శుభ్‌మన్ గిల్ నే ఓపెనింగ్ కు పంపించారు. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ ను ఎలా పక్కన పెడతారు? కావాలంటే గిల్ ను మూడో స్థానంలో ఆడించవచ్చు కదా అన్న సలహాలూ ఇచ్చారు.
కానీ గిల్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయాడు. శ్రీలంకతో సిరీస్ లో ఓ హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన అతడు.. న్యూజిలాండ్ పై ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్ తో వన్డేల్లో ఎవరు ఓపెనర్ గా రావాలన్న చర్చకు అతడు తెర దించినట్లే అని అన్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.
"ఎవరు ఓపెన్ చేయాలన్న చర్చకు గిల్ తెరదించాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ తర్వాత కొన్ని చర్చలు జరిగాయి. అంతకుముందు శిఖర్ ధావన్ పేరునూ ప్రస్తావించారు. కేఎల్ రాహుల్ సరైన స్థానంలోనే బ్యాటింగ్ చేస్తున్నాడా అనీ ప్రశ్నించారు. కానీ ఇప్పుడు గిల్ మాత్రమే ఓపెన్ చేయాలన్న విషయం స్పష్టమైంది" అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
"వన్డే క్రికెట్ ను గిల్ టాప్ లోనే ఆడతాడు. గత రెండు నెలల్లో ఇండియాకు ఇద్దరు డబుల్ సెంచూరియన్లు దొరికారు. బంగ్లాదేశ్ తో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు న్యూజిలాండ్ పై గిల్ చేశాడు. గిల్ చాలా అద్భుతంగా ఆడాడు" అని చోప్రా అభిప్రాయపడ్డాడు.
"ఈ మ్యాచ్ మొదట్లో రోహిత్ బాగా ఆడాడు. గిల్ అతనికి సహకారం ఇస్తూ కనిపించాడు. రోహిత్, విరాట్, ఇషాన్ ఔటైనప్పటికీ గిల్ మాత్రం మరోవైపు చెలరేగుతూనే ఉన్నాడు. వన్డే ఫార్మాట్ గిల్ కు బాగా సూటవుతుంది. అతడు బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 రన్స్ చేసిన ఇండియన్ బ్యాటర్ అతడు. టీమ్ చేసిన 350లో ఓ యువకుడు 200 రన్స్ చేయడం నిజంగా అభినందించాల్సిన విషయం. ఓ వీడియో గేమ్ లాగా చివర్లో అతడు సిక్సర్లు బాదాడు" అని చోప్రా అన్నాడు.
సంబంధిత కథనం