Akash Chopra Furious: ఇండియన్ క్రికెట్ ఇంతే.. మారదు.. ఇషాన్‌ను పక్కనపెట్టడంపై ఆకాశ్ చోప్రా
Akash Chopra Furious: ఇండియన్ క్రికెట్ ఇంతే.. మారదు అంటూ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సీరియస్ అయ్యాడు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను శ్రీలంకతో తొలి వన్డేకు పక్కనపెట్టడంపై అతడు ఇలా స్పందించాడు.
Akash Chopra Furious: శ్రీలంకతో జరగబోయే తొలి వన్డేకు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను కాదని శుభ్‌మన్ గిల్‌ను తీసుకుంటున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ బాధ్యతలు కేఎల్ రాహుల్ చూసుకుంటున్నాడు. అయితే ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ పేస్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌ను పక్కన పెట్టడమేంటి? గిల్ కావాలని అనుకుంటే రాహుల్ స్థానంలో తీసుకోవచ్చు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక ఇప్పుడు మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా తన ట్విటర్ ద్వారా ఇషాన్‌ను పక్కన పెట్టాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఇండియన్ క్రికెట్‌లోనే ఇలాంటివి జరుగుతాయని అతని అనడం గమనార్హం. "డబుల్ సెంచరీ చేసిన తర్వాతి మ్యాచ్‌కే బెంచ్‌కు పరిమితం చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇండియన్ క్రికెట్ ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌నే తర్వాతి మ్యాచ్‌కు పక్కన పెట్టింది. ఇప్పుడు ఇషాన్ కిషన్.. అప్పుడు కరుణ్ నాయర్" అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో అప్పటికే రెండు వన్డేలు ఓడి సిరీస్ కోల్పోయిన సమయంలో మూడో వన్డే ఆడే అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ ఏకంగా డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ కూడా ఇదే. అయినా అతన్ని కాదని శ్రీలంకతో వన్డేలో శుభ్‌మన్ గిల్‌ను తీసుకున్నారు.
అయితే గిల్ ఉన్న ఫామ్‌లో అతనికి అవకాశం ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పరుగుల కోసం తంటాలు పడుతున్న కేఎల్ రాహుల్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించి మరీ తుది జట్టులోకి తీసుకున్నారు. దీనిపై మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌ను పక్కన పెట్టి, ఫామ్‌లోని లేని వాళ్లను తీసుకోవడం వల్లే కొన్ని రోజులుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇండియన్ టీమ్ సరిగా ఆడటం లేదని విమర్శించాడు.
సంబంధిత కథనం