రమణ మహర్షి ఎవరు? ఆయన జీవిత చరిత్ర ఏమిటి?
రమణ మహర్షి జీవిత చరిత్ర గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. మోక్ష మార్గం వైపు ఎలా పయనించాలో తెలియజేశారు.
ఆధ్యాత్మిక సాధకులు, తత్త్వ వేత్త, సహజ, రాజయోగ అభ్యాసములు పొందినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవించిన కాలానికి దగ్గరగా ఉండటం మన అదృష్టమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మోక్ష మార్గం వైపు అడుగులు వేసి, ముక్తిని పొందడానికి కలియుగం ఉత్తమమైనదిగా సాధన ద్వారా మౌనం ద్వారా నేను అనే అహంకారాన్ని తీసేయడం ద్వారా మోక్ష మార్గాన్ని ఎలా పొందవచ్చో తెలియజేసిన ఆధ్యాత్మిక మూర్తి రమణ మహర్షి అని చిలకమర్తి తెలియజేశారు. మధురైకి దగ్గరలోని తిరుచుళి గ్రామంలో 1879 డిసెంబర్ 30న ఒక సాధారణ కుటుంబంలో రమణ మహర్షి జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు వెంకటేశ్వరన్ అనే పేరు పెట్టారని చిలకమర్తి తెలిపారు.
సుమారు 12 ఏళ్ల వయస్సులో ఒక బంధువు వల్ల అరుణాచల క్షేత్రం గురించి ఆయన తెలుసుకున్నారు. అరుణాచలమన్న పేరు ఆయన మనసుకు ఎంతో చేరువైంది. ఆ వెంటనే 'పెరియపురాణం' చదివారు. దాంతో ఆయన జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయని చిలకమర్తి తెలిపారు. ఏకాంతంగా ఉండగా మరణభయంతో తన శరీరం నుండి ప్రాణ లక్షణాలు పోయినట్లనిపించింది. శరీరం నుండి జీవిపైకి లేచినట్లనిపించింది. తాను మృతి చెందాననే సందేహం కలిగింది.
'ఈ శరీరమే నేనా? శరీరం దాటి వేరుగా ఉన్న జీవుడు నేనా? ఇదంతా నా మానసికానుభవమా? సత్యరూపంగా కనిపిస్తున్నదే!' అని ఆశ్చర్యపడ్డారు. తనని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన ఆ అనుభూతి కొన్ని క్షణాలు మాత్రమే ఉంది. అలా కొంతకాలానికి ఆయన అరుణాచలం చేరుకున్నారని.. తీవ్ర తపోనిష్ఠలో సమయాన్ని గడిపారని ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి తెలియజేశారు.
ఆశుకవి కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని తొలిసారి స్వామివద్దకు వచ్చినప్పుడు, తపస్సంటే ఏమిటని ప్రశ్నించారు. "నేను అనే భావం ఎక్కడినుంచి వస్తోందో అన్వేషిస్తే మనస్సు దానిలో లీనమైపోతుంది. అదే తపస్సు. ఒక మంత్రం జపించేటప్పుడు ఆ మంత్రపు ధ్వని ఎక్కడినుంచి పుడుతోందో ఆ బుద్ధిని మార్చినట్లైతే మనస్సు దానిలో లీనమై పోతుంది. అదే తపస్సు అని బదులిచ్చారాయన . ఆ జవాబుతో తృప్తి చెందిన గణపతి ముని అప్పటి నుంచి 'భగవాన్ రమణమహర్షి' అనే నామంతో భక్తులు ఆయన్ని పిలవాలని పిలుపునిచ్చారని.. అలా, వెంకటేశ్వరన్.. భగవాన్ శ్రీ రమణ మహర్షిగా ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధి చెందారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
'నిన్ను నీవు తెలుసుకో' అనేదే రమణుల సందేశం. ఆయన దివ్యసందేశం వినడానికి దేశవిదేశాలనుంచి భక్తులు వచ్చేవారు. రమణుల అద్వైతబోధ నేటికీ ఎందరినో ఆకర్షిస్తూనే ఉందని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు. శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, మరియు స్వామి వివేకానంద వంటి మహనీయుల జీవితచరిత్రలను నేటితరం తెలుసుకోవాలని చిలకమర్తి తెలిపారు.
టాపిక్