Pradakshina: ప్రదక్షిణ అంటే ఏమిటి? అవి ఎన్ని రకాలు? వాటి ప్రాధాన్యత ఏమిటి? ఎలా చేయాలి?-what is pradakshina how many types are they what is their priority how to do it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Pradakshina: ప్రదక్షిణ అంటే ఏమిటి? అవి ఎన్ని రకాలు? వాటి ప్రాధాన్యత ఏమిటి? ఎలా చేయాలి?

Pradakshina: ప్రదక్షిణ అంటే ఏమిటి? అవి ఎన్ని రకాలు? వాటి ప్రాధాన్యత ఏమిటి? ఎలా చేయాలి?

HT Telugu Desk HT Telugu
Sep 29, 2024 10:00 AM IST

Pradakshina: సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ప్రదక్షిణలు చేస్తారు. అసలు ప్రదక్షిణ అంటే ఏంటి? అవి ఎన్ని రకాలు? వాటి ప్రాధాన్యత ఏంటి? ఎలా చేయాలి అనే దాని గురించి అధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

యాదాద్రి దేవాలయం
యాదాద్రి దేవాలయం (Image Source Twitter)

Pradakshina: దైవం విశ్వశక్తికి ప్రతీక. ఆ శక్తి చుట్టూ తదేక ధ్యానంతో తిరిగినప్పుడు అందులోని శక్తి కొంత మనకు సంక్రమిస్తుంది. అలా ప్రదక్షిణ చేసేవారి కుడి భాగం ఆశక్తి కేంద్రం వైపు ఉండాలని, అప్పుడే ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రం చెబుతోందని పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.

‘ప్ర’ అంటే తిరగడం అనీ, ‘దక్షిణం’ అంటే దక్షిణం వైపు అనగా కుడివైపు అని ఆయన ప్రదక్షిణను విశ్లేషించారు. జీవితం అంటే జననం నుంచి మరణం వరకూ ఒక ఆవృత్తం. అంటే ఒక ప్రదక్షిణ. ఇందులో జన్మజన్మల్లో సంపాదించిన కర్మఫలితాన్నే మనం అనుభవిస్తాం అని ప్రభాకర చక్రవర్తిశర్మ వివరించారు. ప్రదక్షిణ చేసేటప్పుడు మనం దేవునిపైనే దృష్టిని నిలిపినప్పుడు మన కర్మఫలాన్ని తగ్గించుకోవచ్చన్నారు. కర్మక్షయమే ప్రదక్షిణ లక్ష్యమని ఆధ్యాత్మికవేత్త ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు. ప్రదక్షిణ పలు రకాలు.

1. ఆలయంలో చేసే ప్రదక్షిణ: ధ్వజస్తంభం వద్ద నుంచి ప్రారంభించి ఆలయంలో దైవం మన కుడివైపు ఉండేలా దేవుని స్మరిస్తూ తిరిగి ధ్వజస్తంభం వద్దకు చేరుకునే వరకు తిరిగితే ఒక ప్రదక్షిణ అవుతుందని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు. సాధారణంగా మూడు ప్రదక్షిణలు చేస్తారని, కొన్ని కోర్కెలు తీరేందుకు ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలో నిర్ణయించుకుని, అన్ని ప్రదక్షిణలు చేయాలి.

అలా ఐదు, పదకొండు, 108 ఇలా ప్రదక్షిణ మొక్కులు ఉంటాయన్నారు. ప్రదక్షిణలు హడావుడిగా చేయరాదని, ప్రశాంతంగా చేయాలి. ప్రదక్షిణలో పరుగులు తీయరాదన్నారు. ఆలయంలో చేసే ప్రదక్షిణ లెక్కించుకోడానికి ఒక చోట పోకచెక్కలు ఉంచుకొని ఒకో ప్రదక్షిణ అయ్యాక ఒక పోకచెక్క పక్కకు వేయాలన్నారు. అంతే తప్ప కాగితంపై చుక్కలు పెట్టడం, నంబర్లు వేయడం చేయకూడదు.

ఒక్కో దైవానికి ఒక మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఆలయాల్లో ఆత్మప్రదక్షిణలు చేయరాదని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శివాలయాల్లో పూర్తి స్థాయిలో ప్రదక్షిణలు చేయరాదని శాస్త్రాల్లో ఉందని ఆయన అన్నారు. శివాలయాల్లో ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం వరకు మాత్రమే వెళ్ళి తిరిగి ధ్వజస్తంభం వద్దకు చేరుకుంటే ఒక ప్రదక్షిణ అవుతుందని ఆయన తెలిపారు. దీనికి ఒక కారణం ఉంది. సోమసూత్రం నుంచి స్వామికి అభిషేకం చేసిన జలాలు వస్తుంటాయని, వాటిని దాటి వెళ్ళడం పాపమని, అందువల్ల సోమసూత్రం వరకూ మాత్రమే ప్రదక్షిణ పథంగా వెళ్ళాలని ప్రభాకర చక్రవర్తి శర్మ సూచించారు.

2. పాద ప్రదక్షిణ : ఆలయ ప్రదక్షిణా పథంలో అడుగులో అడుగువేసుకుంటూ చేసే ప్రదక్షిణ పాద ప్రదిక్షణ అని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కొందరు ఈ ప్రదక్షిణలో మూలకు చేరినప్పుడు స్వామికి సాష్టాంగ ప్రణామాలు కూడా చేస్తుంటారు.

3. అంగప్రదక్షిణ : అవయవాలు భూమికి తగులుతూ, చేతులు రెండూ జోడిరచిన నమస్కార ముద్ర విడివడకుండా ఆలయ ప్రదక్షిణ పథంలో దొర్లుతూ చేసే ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ అని బ్రహ్మశ్రీ ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

4. గిరి ప్రదక్షిణ : దేవుడు కొలువైన పర్వతం చుట్టూ చేసే ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అని ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అరుణాచలం, సింహాచలం, అన్నవరం క్షేత్రాల్లో చేసే గిరి ప్రదక్షిణలు దీనికి ఉదాహరణలని ఆయన వివరించారు.

5. భూప్రదక్షిణ : సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమించడాన్ని భూ ప్రదక్షిణ అంటామని, భూమిపై ఒక క్షేత్రం నుంచి ప్రారంభించి భూమిపైగల ప్రాంతాలను చూసి తిరిగి ఆ క్షేత్రానికి చేరుకుంటే దానిని భూ ప్రదక్షిణ అని చెప్పవచ్చని ప్రభాకరచక్రవర్తిశర్మ తెలిపారు.

6. గో ప్రదక్షిణ : ముక్కోటి దేవతలు కొలువైఉన్న గోమాత, గోవత్సం రెండిటి చుట్టూ చేసే ప్రదక్షిణ గో ప్రదక్షిణ అని బ్రహ్మశ్రీ ప్రభాకర చక్రవర్తి శర్మ అని వివరించారు. ప్రసవిస్తున్న గోవు చుట్టూ చేసే ప్రదక్షిణ కోటిరెట్లు ఫలప్రదం అని ఆయన తెలిపారు.

7. వృక్ష ప్రదక్షిణ : అశ్వత్థ వృక్షం (రావిచెట్టు) చుట్టూ చేసే ప్రదక్షిణ వృక్ష ప్రదక్షిణ అని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఇది ఆరోగ్య ప్రదాయిని కూడా అని ఆయన అన్నారు. ఈ వృక్ష ప్రదక్షిణ చేసేటప్పుడు ‘మూలతో బ్రహ్మరూపాయ మధ్యస్థే విష్ణురూపిణే అగ్రశ్చ శివరూపాయ వృక్షరాజ నమోస్తుతే’ అని చెప్పుకోవాలన్నారు. స్త్రీల అనారోగ్య సమస్యలు తీరేందుకు, సంతానం కోసం కూడా ఈ వృక్ష ప్రదక్షిణ చేస్తారన్నారు.

8. ఆత్మప్రదక్షిణ: ఇళ్ళలో పూజాదికాలు నిర్వహించినప్పుడు తన చుట్టూ తాను కుడివైపు తిరగడాన్ని ఆత్మప్రదక్షిణ అంటారని ఆధ్యాత్మికవేత్త ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ విధంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ‘యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే, పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ, త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అనే మంత్రం చదువుకోవాలన్నారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

టాపిక్