Kuja dosham: కుజదోషం అంటే ఏమిటి? కుజదోష పరిహార శాంతులేమిటి?-what is kudadosha what are the remedies for kujadosa ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kuja Dosham: కుజదోషం అంటే ఏమిటి? కుజదోష పరిహార శాంతులేమిటి?

Kuja dosham: కుజదోషం అంటే ఏమిటి? కుజదోష పరిహార శాంతులేమిటి?

HT Telugu Desk HT Telugu
May 23, 2024 09:14 AM IST

Kuja dosham: కుజ దోషం అంటే ఏంటి? ఈ దోషం తొలగిపోయేందుకు అనుసరించాల్సిన శాంతి పరిహారాల గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

కుజ దోషం అంటే ఏంటి?
కుజ దోషం అంటే ఏంటి?

Kuja dosham: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతక చక్రములో జన్మ లగ్నాది కుజుడు గనుక 1,2,4,7,8,12 వంటి స్థానాలలో ఉంటే దానిని కుజదోషమంటారు. ఈ కుజదోషం ఉన్న స్థానాలను బట్టి ఆ కుజదోషం తీవ్రతను బట్టి కుజదోషం ఉన్నవారి జీవితాలలో కుటుంబపరమైన సమస్యలు అర్థికపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టును.

కుజ దోషం ఉన్న కొంతమంది జాతకులు ఆవేశపూరిత నిర్ణయాల వలన, మూర్ఖత్వం వలన వారి జీవితమును కాకుండా ఇతరుల జీవితాలను కూడా ఇబ్బందికి గురి చేసేదరు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఇటువంటి కుజదోషములన్నీ జాతకములో పరిశీలించుకుని సరి అయిన సమయంలో సరి అయిన పరిష్కారములు ఆచరించడం వలన దోష నివృత్తి కలిగి శుభఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.

కుజ దోష పరిహారాలు

మోపిదేవి, బిక్కవోలు, నాగులపాడు, పెదకూరపాడు, నవులూరు పుట్ట మొదలగు సుబ్రహ్మణ్య క్షేత్రములు దర్శించి కందులు దానము చేయవలెను. కనీసము 7 మంగళవారములు ఉదయం 6 నుంచి ఉదయం 7 లోపుగా దగ్గరలోని సుబ్రహ్మణ్య క్షేత్రములను దర్శించి 7 మార్లు సుబ్రహ్మణ్య అష్టకము పఠించి 70 ప్రదక్షిణలు చేసి 70 సార్లు కుజ శ్లోకమును ధ్యానము చేసి చివరి 7వ మంగళవారము కందులు దానము చేయవలెను.

తమిళనాడులో అనేక సుబ్రహ్మణ్య క్షేత్రములు కలవు. అవకాశము ఉన్నవారు క్షేత్ర దర్శనముతో దోష నివృత్తి చేసుకొనగలరు. కృత్తిక నక్షత్రం రోజుగాని, షష్టి తిథి యందుగాని వైదీశ్వరన్‌ కొయల్‌ దర్శించి అభిషేక అర్చనాదులు జరిపించుకోవాలి. మంగళవారం రోజున ఎర్రని కుక్కలకు పాలు, రొట్టెలు పెట్టవలెను.

మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పూజలు జరుపుకొనవలెను. ఎర్రని ఫలములు, ఎర్రని వస్త్రాలు దానము చేయవలెను. పేదలకు కంది పప్పు వంటకాలు దానం చేయాలి. పగడమును ఎడమచేతి ఉంగరపు వేలుకి వెండితో ధరించవలెను. 7 మంగళవారములు ఏకభుక్తము చేసినచో మంచిది. అనగా ఉదయం భోజనము చేసి సాయంత్రము భోజనము చేయరాదు.

సుబ్రహ్మణ్య స్వామికి 70 ప్రదక్షిణలు చేయగలరు. ముఖ్యముగా స్త్రీలు పగడమాలను ధరించి, ఎరుపు రంగు కలిగిన వస్త్రములు ధరించి ఎరుపు గాజులు, కుంకుమ ధరించవలెను. నవగ్రహాలలోని కుజ విగ్రహము వద్ద ఎర్రరంగు 7 వత్తులతో దీపారాధన చేసి ఎర్రని పుష్పము, ఎర్రని వస్త్రాలు అలంకరించవలెను. 7 మంగళవారములు 1.25 కేజీలు ధాన్యము, కందులు ఎర్రని వస్త్రములో పోసి దక్షణ తాంబూలాదులతో దానము ఇవ్వవలెను. కుజగ్రహమునకు జపము ఒక మారు చేయించి కందులు దానము చేయవలెను.

కుజ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 70 మార్లు చొప్పున పారాయణం చేయవలెను. కుజ గాయత్రీ మంత్రమును 7 మంగళవారములు 70 మార్లు పారాయణ చేయవలెను. కుజ మంత్రమును 40 రోజులలో 7000 మార్లు జపము చేయవలెను లేదా ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయగలరు. తీరికలేనివారు కుజ శ్లోకమును మార్లు గాని, కుజ మంత్రమును 70 మార్లుగాని పారాయణ చేయవలెను. సుబ్రహ్మణ్య షష్టి పర్వదినమున సుబ్రహ్మణ్య అష్టకం 7 మార్లు పారాయణ చేయవలెను చిలకమర్తి తెలిపారు.

తమిళనాడులోని కుజ క్షేత్రము

రాముల వారు సీతమ్మ వారు తమ దోష నివృత్తి కొరకు మునీశ్వరులు నవగ్రహాలపై ఆధారపడినారు. కుజ దోషము కలవారు వైదీశ్వరము క్షేత్రములో కుజుడిని దర్శించి దోష నివృత్తి చేసుకుంటారని చిలకమర్తి తెలిపారు. వైదీశ్వరం చెరువులో స్నానమాచరించి వత్తులతో పూజ జరుపవలెను. నాడీ జ్యోతిష్యమునకు పుట్టినిల్లు ఈ వైదీశ్వరం. వైదీశ్వరన్‌ కోయల్‌ సిరాగజ్‌కు 6 కి.మీ. దూరములో ఉన్నది. ఇచ్చట స్వామివారు దక్షిణ వైపు తిరిగి మాలిని, సుశీలినీ అను భార్యలతో పరివేష్టుతుడై ఉన్నారు. ఈయన వాహనం మేషం (గొర్రె).

ఈ క్షేత్రమున అధిష్టించిన దేవి దేవతామూర్తులు వైద్యనాథుడు, భార్య తయ్యాల్‌ నాయకీ. శంభతి, జడయు, మురగన్‌, సూర్య మొదలైనవారు. వైద్య శాస్త్రమునకు అందని, నయముగాని రోగములు ఇచ్చట వైద్యనాథుడు (పరమేశ్వరుడు) కృషాదృష్టితో పూర్తిగా తగ్గిపోవుచున్నవని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner