Lord ganesha: వినాయకుడి జీవితం నుంచి ఈ పాఠాలను మీ చిన్నారులకు నేర్పించండి-teach your kids for life lessons from lord ganesha ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Ganesha: వినాయకుడి జీవితం నుంచి ఈ పాఠాలను మీ చిన్నారులకు నేర్పించండి

Lord ganesha: వినాయకుడి జీవితం నుంచి ఈ పాఠాలను మీ చిన్నారులకు నేర్పించండి

Gunti Soundarya HT Telugu
Aug 31, 2024 05:00 PM IST

Lord ganesha: వినాయకుడి జీవితం నుంచి అనేక పాఠాలను నేర్చుకోవచ్చు. బొజ్జ గణపయ్య జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో వారికి కథల రూపంలో తెలియజేయవచ్చు. ఇది వారికి ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటాయి. చిన్నారులే కాదు పెద్ద వాళ్ళు కూడా వినాయకుడి జీవితం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవి.

వినాయకుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే
వినాయకుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే (pixabay)

Lord ganesha: పిల్లలకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. వినాయక చవితి పండుగ వస్తే పిల్లలందరూ తమకు తోచిన విధంగా డబ్బులు వసూలు చేసి వినాయకుడి బొమ్మ కొనుగోలు చేస్తారు. వీధుల్లో ఏర్పాటు చేసే వినాయకుడి మండపాల వద్ద సందడి మొత్తం పిల్లలదే కనిపిస్తుంది.

పిల్లలు చిన్నతనం నుంచి వినాయకుడికి సంబంధించిన కథలు వింటూ పెరుగుతారు. వినాయకుడికి సంబంధించిన కథలు ఎప్పుడో ఒకప్పుడు పుస్తకాల్లోనూ చదవడం, వినడం చేస్తూనే ఉంటారు. ఏనుగు తల, పెద్ద చెవులు, బాన పొట్ట చూసి పిల్లలకు చాలా ఇష్టపడతారు. అయితే మీరు మీ పిల్లలకు వినాయక చవితి సందర్భంగా గణపతిని చూసి ఏం నేర్చుకోవాలో కూడా చెప్పండి. వినాయకుడి జీవితాన్ని చూసి ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలో వివరించండి. మీ పిల్లలకు తల్లిదండ్రులు, పెద్దల పట్ల విధేయతలు కలిగి ఉండేలా కొన్ని విషయాలు చెప్తూ వారిని తీర్చిదిద్దవచ్చు.

విఘ్నాలు తొలగించే వినాయకుడు

పౌరాణిక కథ ప్రకారం గణేశుడు, కుమారస్వామి మధ్య ఒక చిన్న పందెం జరిగింది. ఎవరైతే ప్రపంచం మొత్తాన్ని చుట్టి పుణ్య నదులలో స్నానం చేసి త్వరగా కైలాసానికి తిరిగి వస్తారో వాళ్ళు తొలి దేవుడిగా పూజలు అందుకుంటారని శివుడు షరతు విధిస్తారు. కార్తీకేయుడు లోకాన్ని చుట్టి వచ్చేందుకు వెళతాడు. కానీ వినాయకుడు మాత్రం తెలివిగా తన తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీరే నా ప్రపంచం అంటూ వారికి నమస్కరించాడు. అలా వినాయకుడి నుంచి తల్లిదండ్రులను గౌరవించాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలి.

ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు

భారీకాయుడైన వినాయకుడి వాహనం ఎంతో చిన్నదైన ఎలుక. అంతటి బరువు ఉండే వినాయకుడిని ఎలా మోస్తుందా అనుకుంటారు. ప్రపంచంలో చిన్న జీవులను అంచనా వేస్తారు. కానీ జీవి ఎంత చిన్నది అనేది ముఖ్యం కాదు దాని చర్యలు ఎంత ఉన్నాయి అనేది చూడాలి అంటారు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి ముఖ్యమే. వినాయకుడి సకల జీవరాశులు సమానమే. అందుకు ఎలుకే నిదర్శనం. చిన్నది అయినప్పటికీ ఎంతో బరువు ఉండే వినాయకుడికి వాహనంగా ఉంటుంది. వినాయక చవితి సమయంలో విగ్రహం పక్కన మూషికం లేకుండా ఉండదు.

రూపం కాదు ఆత్మవిశ్వాసం ఉండాలి

పూర్వం చాలా మంది రాక్షసులు వినాయకుడి భౌతిక రూపాన్ని ఎగతాళి చేశారు. ఏనుగు మొహంతో ఉన్నాడని హేళనగా మాట్లాడేవాళ్ళు. కానీ బాల గణేశుడు తన సహనాన్ని కోల్పోలేదు. వారితో గట్టిగా పోరాడాడు. ఇతరుల మాటలకు ప్రభావితం అయి ఆవేశ పడకూడదు. ఎన్నడూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు అనే విషయం చెప్పాలి. ఎదుటి వారి మాటలకు బలహీనపడితే అది మనలోని విచక్షణను తుంచేస్తుంది. అందుకే అన్నింటా ఆవేశం తగదు అంటారు. అందరూ మిమ్మల్ని తక్కువ అంచనా వేసినప్పుడు బాధ కలుగుతుంది. కానీ మిమ్మల్ని మీరు విశ్వసించుకుంటే మీ సామర్థ్యం ఏమిటో ప్రపంచమే తెలుసుకుంటుందని అంటారు.

బలం కాదు జ్ఞానం ముఖ్యం

శక్తికి అనేక రూపాలు ఉన్నాయి. బలం కాదు బుద్ధి బలం ముఖ్యం అంటారు. బలం అంటే మీరు కత్తితో బయటకు వెళ్ళి పోరాడటం కాదు. మీలోని జ్ఞానంతో ప్రపంచాన్ని కూడా జయించవచ్చు. మీ జ్ఞానం మిమ్మల్ని చెడు పరిస్థితుల నుంచి బయటకు తెస్తుంది. జ్ఞానం అనే శక్తిని మీరు గుర్తించాలి. వినాయకుడు దేనికి ఆవేశపడకుండా జ్ఞానం అనే ఆయుధంతో అందరి మెప్పు పొందాడు. అందుకు నిదర్శనం ముల్లోకాలు చుట్టి రమ్మంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిగా మారాడు. అందుకే ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ఎటువంటి ఆటంకాలు కలగకూడదని కోరుకుంటూ తొలి పూజ వినాయకుడికి చేస్తారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.