Maragasira pournami: మార్గశిర పౌర్ణమి రోజున ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం
మాసాలలో మార్గశిర మాసము చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. చంద్రుడు మృగశిరా నక్షత్రానికి దగ్గరగా ఉండటం చేత ఈ మాసమునకు మార్గశిర మాసము అని పేరు వచ్చినది
మాసానాం మార్గశిరోహం అని శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా భగవద్గీతలో చెప్పడం చేత ఈ మాసమునకు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఏర్పడినది అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మార్గశిర మాసము విష్ణుమూర్తి ఆరాధనలకు, లక్ష్మీదేవి పూజలకు ప్రతీక. అలాంటి ఈ మాసంలో ఈ సంవత్సరం 8-12-2022 మార్గశిర పౌర్ణమి గురువారం రావడం ఈరోజు మార్గశిర లక్ష్మీ వ్రతం, మహా విష్ణువు యొక్క ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మార్గశిర పౌర్ణమి పురాణాల ప్రకారం దత్త జయంతి. దత్తాత్రేయుడు మృగశిరా నక్షత్రంలో మార్గశిర పౌర్ణమి నాడు అత్రి మహర్షికి మరియు అనసూయాదేవికి జన్మించినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్లు మహాభారతం తెలిపినది. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారానికి ప్రతీకగా మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయుని ఆరాధిస్తే జీవితంలో ఎలాంటి కష్టములు ఉండవని పురాణాలు తెలిపాయి.
తన భక్తుడైనటువంటి కార్త వీరార్జునునికి దత్తాత్రేయుడు తన మహిమను స్వయముగా తెలుపుతారు. కృత యుగము నుండి ప్రతీ యుగమునందు మార్గశిర మాసంలో దత్తాత్రేయుని పూజించడం మనకు పురాణాలలో చాలా చోట్ల కనబడుతుంది అని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు విష్ణు మూర్తి ఆలయాలను దర్శించడం, లక్ష్మీదేవిని పూజించడం అలాగే దత్తాత్రేయుని సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకోవడం వల్ల పాపాలు నశిస్తాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మార్గశిర పౌర్ణమి రోజు విష్ణు సహస్ర నామం చదవడం వినడం వలన, భగవద్గీత చదవడం వినడం వలన మహా విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.
టాపిక్