Narasimha Jayanti 2023 | మహా విష్ణువు మరో అవతారం ఉగ్ర నరసింహం.. పురాణ కథనం చదవండి!
Narasimha Jayanti 2023: వైశాఖ మాస శుక్ల పక్ష చతుర్ధశి నాడే మహావిష్ణువు నరసింహ స్వామిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. అది ఈ ఏడాది మే4న వచ్చింది. విశేషాలు , పురాణ కథలు ఇక్కడ తెలుసుకోండి.
Narasimha Jayanti 2023: మహావిష్ణువు నాల్గవ అవతారమే నరసింహ అవతారం. ఈ అవతారం అర్ధభాగం సింహం, మరో అర్ధభాగం మనిషి రూపాన్ని పోలి ఉంటుంది. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి నాడు విష్ణువు నరసింహుడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రకారంగా, 2023లో నరసింహ జయంతి మే4 గురువారం రోజున వచ్చింది.
చెడుపై మంచి సాధించిన విజయానికి, కష్టాలపై భక్తి సాధించిన విజయానికి ప్రతీకగా నరసింహ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున నరసింహ స్వామిని పూజించడం వల్ల భక్తులకు రక్షణ, శ్రేయస్సు, అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
ఈ పవిత్రమైన రోజున, శుక్ల పక్ష చతుర్దశి తిథి సమయాలు, నరసింహస్వామి పూజా సమయాలు, పురాణ కథనాల గురించి వివరణ ఇక్కడ చదవండి.
నరసింహస్వామి పూజా సమయాలు
పంచాంగం ప్రకారం, మే 4న నృసింహ జయంతి.
చతుర్దశి తిథి మే 3, బుధవారం రాత్రి 11:49 గంటలకు ప్రారంభమై, మే 4, గురువారం రాత్రి 11:44 వరకు అమలులో ఉంటుంది.
నరసింహ జయంతి శయన కాల పూజకు శుభ సమయం సాయంత్రం 04:18 నుండి 06:58 వరకు ఉంటుంది.
మధ్యాహ్న సంకల్ప సమయం మే 4న ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 01:38 వరకు.
నరసింహ పారణ సమయం మే 5న ఉదయం 05:37 నుండి ప్రారంభమవుతుంది.
నరసింహ అవతారం వెనక పురాణ కథ
హిందూ పురాణాల ప్రకారం, నరసింహ జయంతి కథ రాక్షస రాజు హిరణ్యకశిపుతో ముడిపడి ఉంది, రాక్షస రాజు హిరణ్యకశిపుడు ఏ దేవుడు, ఏ మనిషి, ఏ జంతువుతో తనకు మరణం ఉండకూడదని బ్రహ్మ దేవుడి నుంచి వరం పొందుతాడు. అత్యంత శక్తివంతంగా, నిరంకుశంగా మారతాడు. క్రూరంగా, అహంకారపూరితంగా వ్యవహరిస్తాడు. ఇక తనను ఎవరూ ఏమీ చేయలేరని తాను అమరుడు, అజేయుడు అని నమ్ముతాడు. తననే దేవుడిగా కొలవమని ప్రజలను ఆజ్ఞాపిస్తాడు. అయినప్పటికీ హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు తండ్రిని పూజించకుండా మహా విష్ణువును పూజిస్తాడు, విష్ణువే నిజమైన దేవుడు అని, అందరూ ఆ దేవదేవుడినే పూజించాలని చెబుతాడు.
ఇది నచ్చని హిరణ్యకశిపుడు తన కన్నకొడుకునే హతమార్చాలని చూస్తాడు. కానీ, ఏమి చేయలేకపోతాడు, మహా విష్ణువు రక్షణనే తనని కాపాడుతుందని ప్రహ్లాదుడు చెబుతాడు. దీంతో హిరణ్యకశిపుడు తనను ఏ దేవుడు ఏం చేయలేడనే వరం పొందిన కారణంగా నేరుగా మహావిష్ణువుతోనే తలపడాలని నిర్ణయించుకుంటాడు. మహావిష్ణువును అంతం చేస్తానని ప్రహ్లాదుడితో శపథం చేస్తాడు. విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పాల్సిందిగా ప్రహ్లాదుడ్ని అడుగుతాడు. దీంతో ప్రహ్లాదుడు విష్ణువు సర్వాంతర్యామి, అంతటా ఉంటాడని బదులిస్తాడు.
అయితే తనకు సమీపంలో ఉన్న స్తంభంలో ఉన్నాడా? అని హిరణ్యకశిపుడు అడగగా.. ఉన్నాడు అని ప్రహ్లాదుడు బదులిస్తాడు.
ఆగ్రహ జ్వాలలతో హిరణ్య కశిపుడు ఆ స్తంభాన్ని బద్దలు కొట్టగా ఆ స్తంభం నుంచి మహా విష్ణువు.. మనిషి, దేవుడు, ఏ జీవి కానీ నరసింహ అవతారంగా ఉద్భవిస్తాడు. హిరణ్యకశిపుడి పొట్టను చీల్చి రాక్షస సంహారం గావిస్తాడు.
టాపిక్