Ugadi Rasi Phalalu 2024: మిథున రాశి వారి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు-mithuna rasi 2024 to 2025 telugu sri krodhi nama samvatsara ugadi rasi phalalu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi Rasi Phalalu 2024: మిథున రాశి వారి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు

Ugadi Rasi Phalalu 2024: మిథున రాశి వారి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు

HT Telugu Desk HT Telugu
Mar 28, 2024 10:31 AM IST

మిథున రాశి జాతకులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది 2024-25 రాశి ఫలాలను పంచాంగకర్త, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మిథున రాశి వారికి ఏయే రంగాల్లో ఎలా ఉండబోతోంది? మాస వారీ జాతక ఫలాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ సమగ్రంగా తెలుసుకోండి.

మిథున రాశి వారి జాతకం 2024-25 ఉగాది రాశి ఫలాలు
మిథున రాశి వారి జాతకం 2024-25 ఉగాది రాశి ఫలాలు

శ్రీ క్రోధి నామ సంవత్సరం నందు మిథునరాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాల ఉన్నాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

బృహస్పతి వ్యయస్థానమునందు సంచరించుట చేత, శని భాగ్య స్థానమునందు సంచరించుట చేత, రాహువు దశమస్థానము యందు సంచరించుట చేత మరియు కేతువు చతుర్ధ స్థానమునందు సంచరించుటచేత మిథన రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి.

ఖర్చులు, ఒత్తిళ్లు, కలతలు

మిథునరాశి వారికి దశమంలో రాహువు, వ్యయములో గురుని ప్రభావంచేత ఖర్చులు అధికమగును. అనుకోని పనుల వలన అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టును. మిథున రాశి వారికి రాజకీయ ఒత్తిళ్ళు అధికమగును. చతుర్ధ స్థానమందు కేతువు ప్రభావంచేత కుటుంబములో కలతలు ఏర్పడును. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలున్నాయి. దశమ స్థానములో రాహువు ప్రభావంచేత ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉన్నాయి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన.

వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడినవి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఆదాయం కన్నా వ్యయం అధికముగా కనబడుతున్నది. ఖర్చుల విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచన. సినీరంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. సినీ, మీడియా రంగంలో చేసే ప్రయత్నాలు, పెట్టుబడులు అనుకూలించును. రైతాంగానికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి.

స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలించును. మీ యొక్క సౌఖ్యాల కోసం, ఆనందాల కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. నూతన వస్తువులను కొనెదరు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మిథునరాశి వారు గృహ అవసరాల కోసం సామాన్లను, వాహనాలను అలాగే అలంకారప్రియ వస్తువులైనటువంటి బంగారం వంటి వాటి కోసం ధనమును ఖర్చు చేసెదరు. విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థం అనుకూల ఫలితాలు ఉన్నాయి.

మిథునరాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దక్షిణామూర్తిని పూజించాలి. దత్తాత్రేయుని పూజించాలి. గురువారం రోజు శనగలను నైవేద్యంగా పెట్టి పంచిపెట్టడం మంచిది. బుధవారం రోజు దక్షిణామూర్తి స్తోత్రం, విష్ణు సహస్ర నామం వంటివి పారాయణ చేయాలి. గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి, పూజించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మిథున రాశి ప్రేమ జీవితం 2024-25

మిథున రాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు ఈ సంవత్సరం అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి కోసం ధనాన్ని అధికముగా ఖర్చుచేస్తారు. అవివాహితులకు వివాహయోగం కలదు. మీ భాగస్వామితో ఆనందముగా గడిపెదరు.

మిథున రాశి ఆర్థిక జాతకం 2024-25

మిథున రాశి జాతకులకు ఆర్థికపరంగా అంత అనుకూలంగా లేదు. వ్యయస్థానములో గురుని ప్రభావం వలన ఖర్చులు, అప్పుల బాధలు అధికమగును. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని సూచన.

మిథున రాశి కెరీర్ 2024-25

మిథున రాశి వారికి కెరీర్ పరంగా ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఏర్పడు సూచన.

మిథున రాశి ఆరోగ్య ఫలితాలు 2024-25

మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం అనుకూలించును. అనారోగ్యంతో బాధపడేటటువంటి వారికి అరోగ్య విషయాల్లో ఖర్చులు అధికమగును. గత కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడెదరు.

ధరించాల్సిన నవరత్నం: మిథునరాశి వారు ధరించవలసిన నవరత్నం పచ్చ.

ప్రార్థించాల్సిన దైవం: మిథున రాశి వారు నిత్యం పూజించవలసినటువంటి దైవం శ్రీమన్నారాయణుడు.

మిథున రాశి ఉగాది 2024-25 నెలవారీ రాశి ఫలాలు

ఏప్రిల్‌: ఈ మాసం మీకు మధ్యస్తముగా ఉన్నది. ధనవృద్ధి ఉంటుంది. మిత్రులతో శుభ కార్యక్రమ వేడుకల్లో పాల్గొంటారు. రాజకీయ వృద్ధి. పాత సమస్యలు కొన్ని తీరుతాయి.

మే: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. నూతన గృహలబ్ధి. సంతానమునకు శుభ సమయం. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వపరంగా ఉద్యోగులకు కలుసుకొనుట జరుగుతుంది.

జూన్‌: ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో అనందముగా గడుపుతారు. ప్రయాణంలో ఇబ్బందులు. బ్యాంకు ఉద్యోగులకు ప్రమోషన్లు. ధనపరమైన ఇబ్బందులు కలుగును. మీ ఆశయ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు.

జూలై: ఈ మాసం మిధున రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమ. గృహానికి సంబంధించిన వస్తువులు కొంటారు. వ్యాపారపరంగా లాభదాయకం. శుభ కార్యాలు సిద్ధిస్తాయి.

ఆగస్టు: ఈ మాసం అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగరంగాలలో అధిక శ్రమ, ఒత్తిళ్ళు. శని శుభుడు అగుట వలన ఒత్తిళ్ళు తగ్గును. శుభకార్య ప్రయత్నములు ముందుకు వెళ్ళును. దూర ప్రయాణములు చేస్తారు. అప్పులు చేస్తారు. అనారోగ్య సమస్యలు ఏర్పడును.

సెప్టెంబర్‌: ఈ మాసం మిథున రాశి వారికి మధ్యస్థముగా ఉన్నది. వ్యాపారంలో కొంత నష్టం. మనశ్శాంతి లేకపోవడం. వృథా ప్రయాణములు. అనవసరపు ఖర్చులు. స్త్రీ వల్ల అనుకోని సమస్యలు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

అక్టోబర్‌: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. కుటుంబసభ్యులతో భేదాభిప్రాయములు ఏర్పడును. అనుకున్న పనులయందు విజయం సాధిస్తారు. శత్రువులపై జయం. దైవ క్షేత్ర సందర్శనం. కళత్ర సౌఖ్యములు. వివాహాది శుభకార్యములు జరుగును.

నవంబర్‌: ఈ మాసం మిథున రాశి జాతకలకు అనుకూలంగా లేదు. ఆదాయమునకు మించిన వ్యయము ఉండును. విద్యాసారస్వత రంగములలో అభివృద్ధి. బంధువులతో ఆనందముగా గడుపుతారు. పుణ్యకార్యాలపై ఆసక్తి. కొన్ని పనులు ముందుకు సాగుతాయి.

డిసెంబర్‌: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు ఆలస్యముగా సాగుతాయి. పెద్దల ఆదరాభిమానాలు లభిస్తాయి. ప్రతికూల సమస్యలు కూడా మీరు అనుకూలంగా మార్చుకుంటారు. సంతానపరంగా శుభ ఫలితములు. వివాహాలు, శుభ కార్యక్రములు జరుగును.

జనవరి: ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు కలుగు సూచన. కుటుంబములో పట్టింపుల వల్ల ఇబ్బందులు, చికాకులు కలుగును. వ్యాపారపరంగా లాభదాయకం. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల లాభము.

ఫిబ్రవరి: ఈ మాసంలో మిథున రాశి జాతకులకు అనుకూల ఫలితాలున్నాయి. శత్రువులు కూడా మీ మాటకు విలువనిస్తారు. వివాహాది శుభరార్యాములలో బంధుమిత్ర సమేతంగా పాల్గొంటారు. భూ, గృహ, వ్యాపార, ఉద్యోగ రంగాలలో లాభము కలదు.

మార్చి: ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపార, వృత్తిపరంగా లాభములు. సంతానపరంగా శుభము. ధైర్యంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. వస్తు, వాహనములు కొనుగోలు చేస్తారు. పెద్దల సహకారంచే శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు.

సంబంధిత కథనం