Ugadi Rasi Phalalu 2024: మీన రాశి ఉగాది రాశి ఫలాలు.. కష్టాలు గట్టెక్కేందుకు ఇలా చేయండి-meena rasi ugadi rasi phalalu krodhi nama samvatsara telugu new year horoscope of piesces zodiac sign ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi Rasi Phalalu 2024: మీన రాశి ఉగాది రాశి ఫలాలు.. కష్టాలు గట్టెక్కేందుకు ఇలా చేయండి

Ugadi Rasi Phalalu 2024: మీన రాశి ఉగాది రాశి ఫలాలు.. కష్టాలు గట్టెక్కేందుకు ఇలా చేయండి

HT Telugu Desk HT Telugu
Mar 31, 2024 09:43 AM IST

Meena Rashi 2024 Ugadi Rasi Phalalu: మీన రాశి ఉగాది 2024 రాశి ఫలాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ఆరోగ్యం, ఆర్థికం, కెరీర్, ప్రేమ తదితర అంశాల్లో ఈ క్రోధి నామ సంవత్సరం మీన రాశి జాతకులకు ఎలా ఉండబోతోందో వివరించారు. అలాగే మాసవారీ ఫలితాలను కూడా ఇక్కడ చూడవచ్చు.

మీన రాశి జాతకులకు 2024-25 ఉగాది రాశి ఫలాలు
మీన రాశి జాతకులకు 2024-25 ఉగాది రాశి ఫలాలు

2024-25 శ్రీ కోధి నామ సంవత్సరం మీన రాశి వారి జాతకం అనుకూలంగా లేదని పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీన రాశి జాతకులు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 11 పాళ్లు, వ్యయం 5 పాళ్లు, రాజ్యపూజ్యం 2 పాళ్లు, అవమానం 4 పాళ్లు ఉంటుందని చిలకమర్తి వివరించారు.

మీనరాశి ఉగాది పంచాంగం 2024-25

శ్రీ క్రోధి నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి 3వ స్తానమునందు, శని వ్యయ స్థానమునందు సంచరిస్తున్నారు.

జన్మరాశియందు రాహువు, కళత్ర స్థానము నందు కేతువు సంచరించుటచేత శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం చేత, తృతీయ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత అంత అనుకూలంగా లేదు. ఈ రాశివారికి ఈ సంవత్సరం చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయని సూచిస్తున్నాను.

ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళు చికాకులు అధికమగును. ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు, అధిక ఖర్చులు వంటివి వేధించును. ఖర్చుల విషయంలో అచితూచి వ్యవహరించాలి.

వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చెడు సమయం. వ్యాపారంలో నష్టములు కలుగు సూచన. ధనపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించును. ఈ సంవత్సరం కోర్టు వ్యవహారములు చికాకు కలిగించును.

జన్మరాశి యందు రాహువు ప్రభావంచేత మీనరాశివారు ఆగ్రహావేశాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఈ సంవత్సరం అధికంగా వేధించును. రైతాంగానికి అంత అనుకూలంగా లేదు.

మీడియా, సినీరంగాల వారికి రాజకీయ ప్రభావాలు మరియు ఇతర ప్రభావాల వలన నష్టములు కలుగును. మీన రాశివారు అప్పు చేయవద్దు, అప్పు ఇవ్వవద్దని సూచిస్తున్నాను. ఆర్ధిక విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలని సూచన.

విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం. విద్యార్థులకు విద్యలో అటంకములు, ఇబ్బందులు కలుగు గ్రహస్థితి గోచరిస్తోంది. స్త్రీలు భగవత్‌ నామ స్మరణతో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. జన్మరాహువు ప్రభావం చేత మానసిక ఒత్తిళ్ళు, వేదనలు, అనారోగ్య సమస్యలు మరియు గొడవలు ఇబ్బంది పెట్టును.

మీన రాశి వారి ప్రేమ జీవితం 2024-25

మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం ప్రేమ వ్యవహారాలు అంత అనుకూలించవు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయములు కలుగును. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దని సూచన. వాదనల వలన ఇబ్బందులు ఏర్పడును. ప్రేమ విషయాల్లో అచితూచి వ్యవహరించండి.

మీనరాశి వారి ఆర్థిక విషయాలు 2024-25

మీన రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా అనుకూలంగా లేదు. అప్పుల బాధలు పెరుగును. ధన వ్యయము, ధననష్టము కలుగును. మీనరాశి వారు అప్పు చేయవద్దు. అప్పు ఇవ్వవద్దు అని సూచన. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

మీన రాశి జాతకుల కెరీర్ 2024-25

మీన రాశి వారికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా మధ్యస్థ స్టంగా ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగ సాధన విషయాలలో కష్ట ష్టపడవలసినటువంటి సమయం. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ప్రమోషన్లు వంటివి ఈ సంవత్సరం ఆశించినా ఫలితం ఉండదు.

మీన రాశి వారి ఆరోగ్యం 2024-25

మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు వేధించు సూచన. బీపీ షుగర్‌ వంటివి అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. ఆరోగ్యవిషయాల్లో ఖచ్చితమైన శ్రద్ధ మరియు జాగ్రత్తలు వహించాలని సూచన.

శుభ ఫలితాల కోసం చేయదగిన పరిహారాలు

మీనరాశివారు 2024-25 క్రోధి నామ సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఏలినాటి శని దోష నివారణ కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. ప్రతి శనివారం దశరథ ప్రోక్త శని స్తోత్రం, నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి. గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చరక్రవర్తి శర్మ తెలిపారు. అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యుని పూజించడం, అభిషేకం చేసుకోవడం మంచిది.

మీన రాశి వారు నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలని సూచన
మీన రాశి వారు నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలని సూచన (Pachaimalai murugan, CC BY-SA 4.0 , via Wikimedia Commons)

ధరించాల్సిన నవరత్నం: మీనరాశి వారు ధరించవలసిన నవరత్నం కనక పుష్యరాగం.

ప్రార్థించాల్సిన దైవం: మీన రాశి వారు పూజించవలసిన దైవం దత్తాత్రేయుడు మరియు దక్షిణామూర్తి.

మీన రాశి జాతకులకు మాసవారీ ఫలితములు 2024-25

ఏప్రిల్‌: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అపజయములు. ఉద్యోగ, వ్యాపారాలలో ఇబ్బందులు అధికమగును. మానసిక అందోళన పెరుగును. ద్రవ్య నష్టము. అనారోగ్య సూచనలు కనబడును. దూరప్రయాణములయందు జాగ్రత్త అవసరం.

మే: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విరోధుల నుండి రావలసిన ధనము అలస్యమగుట. దీర్ఘాలోచన. ఇంట అనారోగ్యములు కలుగు సూచన. ధనవ్యయం. వ్యాపార లావాదేవీల యందు తగు జాగ్రత్తలు పాటించుట మంచిది. అస్వస్థత. ప్రతికూల పరిస్థితులు.

జూన్‌: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అధిక శ్రమ. వృథాగా ప్రయాణములు. అనవసరపు గొడవలు. వ్యాపారపర బాధ్యత, ఒత్తిడి. కొన్న వస్తువులను పోగొట్టుకొనుట. కొంత ధైర్యము వహించి ముందుకు సాగుట మంచిది. స్థిరచరాస్తి విషయమై విభేదములు.

జూలై: ఈ మాసం మీన రాశి జాతకులకు మధ్యస్థం. వృత్తిపర లాభములు. వ్యాపారములో కొద్దిపాటి లాభములు. శ్రమ, ప్రత్యర్థుల ఒత్తిడి వల్ల కొన్ని అపవాదులు. ఆర్థిక పరిస్థితి బాగుండుటచే సమస్యలకు పరిష్కారం. అనారోగ్య సమస్యలు.

ఆగస్టు: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అపనిందలు. సోదరపుత్ర వైషమ్యాలు, అసౌఖ్యం. శ్రమ, ఒత్తిడి ఉంటాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులు పెరుగుట. పనులలో జాప్యము. మధ్యవర్తిత్వంతో మాటపడే అవకాశం. ప్రయాణములు వాయిదావేయుట మంచిది.

సెప్టెంబర్‌: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. స్త్రీ మూలక లాభములు ఉంటాయి. ఖర్చులు అధికముగా ఉండడంతో వ్యాపారపరంగా పెట్టుబడుల ఇబ్బంది ఎదుర్నోవాలి. కోర్టుపరమైన చిక్కులు తొలగే అవకాశమున్నది. అతికష్టం మీద కొన్ని పనులు ముందుకు సాగుతాయి.

అక్టోబర్‌: ఈ మాసం మీనరాశి జాతకులకు అనుకూలంగా లేదు. కుటుంబములో అనవసర సమస్యలు. నూతన వ్యక్తి వలన ఇబ్బందులు. స్థాన చలనము. నెల చివరలో అతికష్టముపై ధనలాభము. రుణ ప్రయత్నములు ఫలించును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం.

నవంబర్‌: ఈ మాసం మీకు అనుకూలముగా ఉన్నది. కొన్ని పనులు మాత్రమే ముందుకు సాగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగ యువకులకు కొంత కష్టకాలము. మీ కోరికలు నెరవేరు అవకాశమున్నది.

డిసెంబర్‌: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సంతాన జాప్యము. చర స్థిరాస్తి విషయములో అనుకోని సమస్యలు. భూమిపర వ్యవహారములలో కొన్ని ఇబ్బందులు. రాజకీయంగా ఊహించని సమస్యలు. మానసిక ఒత్తిడి అధికంగా ఉండును.

జనవరి: ఈ మాసం మీనరాశి జాతకులకు అనుకూలంగా లేదు. భాగస్వామ్య వ్యాపారంలో అభివృద్ధి కోసం పెట్టుబడులు పెడతారు. అనారోగ్య సూచనలు. సంతాన విషయంలో సమస్యలు అధికము. వ్యతిరేకులను ఎదుర్కొనగలుగుతారు.

ఫిబ్రవరి: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. రాజకీయపరలబ్ధి. ఉద్యోగస్తులు నూతన అవకాశములకై ప్రయత్నములు చేస్తారు. ధనము ఖర్చు పెరిగినప్పటికి అది శుభముగా ఉండగలదు. తీర్థయాత్రలు జరుగగలవు. భార్యాభర్తల మధ్య విభేదములు పెరిగే అవకాశమున్నది.

మార్చి: ఈ మాసం మీన రాశి వారికి అనుకూలం నుంచి మధ్యస్థం. ఆరోగ్యం కొంత మందగించవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించాలి. భూ, గృహ, వ్యాపార, కృషి రంగములలో కొంత వృద్ధి. నిరుద్యోగులకు అనుకూల సమయం.

- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner