మార్గశిర మాసం.. దత్తాత్రేయుడి అనుగ్రహానికి మార్గం
మార్గశిర మాసంలో గురువారాలు దత్తాత్రేయుని పూజించడం, శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయుని ఆరాధించడం మంచిదని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మార్గశిర మాసంలోనే దత్తాత్రేయుడి జయంతి రానుంది. మార్గశిర మాసంలో గురువారాలు, దత్తాత్రేయుని పూజించడం, శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయుని ఆరాధించడం మంచిదని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. జాతకంలో గురుబలం లేనివారికి, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి, అలాగే ఐదోతనం కావాలని కోరుకునే స్త్రీలకు మార్గశిర మాసం గురువారాలు చాలా విశేషమైన రోజులు. మార్గశిర లక్ష్మీవారాలలో లక్ష్మీదేవితో పాటు దత్తాత్రేయుని పూజించినటువంటి వారికి సమస్త కోరికలు సిద్ధిస్తాయిని చిలకమర్తి తెలిపారు.
సంతానం లేనివారు ఇతరులను ప్రార్థించి, వారి సంతానంలో ఒకరిని తమ సంతానంగా చేసుకోవడానికి ప్రార్ధించే సందర్భాలనూ, వారి ప్రార్థనలను మన్నించి సంతతి గల ఉదారులు తమ సంతానాన్ని వారికి దత్తం చేసి, వారి కుటుంబాన్ని నిలిపిన సందర్భాలనూ చూస్తున్నప్పుడు సంతాన విశిష్టత ఏమిటో తెలుస్తుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మనుష్యులను మనుష్యులకు దత్తం చేయడం సహజమే కానీ, సంతానాన్ని కోరి తపస్సు చేసిన ఒక మునికి సాక్షాత్తూ భగవంతుడే ప్రత్యక్షమై, తాను దత్తుడనౌతానని పలుకడాన్ని ఊహించగలమా? అసంభవమే. కానీ, అది సాధ్యమే అని నిరూపించినవాడు అత్రి మహాముని కాగా, అలా దత్తుడై భూలోకంలో అవతరించి మానవకోటిని తరింపచేసిన పరదైవం దత్తాత్రేయ స్వామి.
దత్తాత్రేయుడి కథ
పూర్వం అత్రి మహాముని తన భార్య అనసూయాదేవికి సంతానం కలుగకపోగా, సంతతి కోసం తీవ్రంగా తపస్సును ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. వరం కోరుకొమ్మన్నారు.
త్రిమూర్తులే తన ఎదుట ప్రత్యక్షమైన అమితానందంతో అత్రి మహర్షి త్రిమూర్తులారా! మీ ముగ్గురూ నాకు సంతానంగా లభించే విధంగా వరాన్ని ఇవ్వండి అని ప్రార్థించాడు. అప్పుడు అ త్రిమూర్తులకు పరమానందం కలిగింది. తమ ముగ్గురి అంశలతో ఒక పుత్రుడు తప్పక కలుగుతాడని వారు వరాన్ని ప్రసాదించారు.
అలా కొంతకాలానికి వారి అనుగ్రహంతో అనసూయాదేవికి జన్మించిన మహనీయమూర్తి దత్తాత్రేయుడు అని చిలకమర్తి తెలియచేసారు. త్రిమూర్తి తత్వాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని ఆవిర్భవించిన దత్తాత్రేయుని మహిమను వర్ణించని సనాతన సాహిత్యం కనబడదు.
వివిధ పురాణాలలో విస్సృతమై కొలిచే భక్తజనుల కొంగుబంగారైన స్వామిలీలలు అపారం. సంస్కృత స్తోత్ర వాజ్మయాన్ని పరిశీలించినప్పుడు దత్తాత్రేయ స్వరూప వర్ణనం మనోహరంగా కనబడుతుంది. స్వామి దిగంబరుడిగా, భస్మ సుగంధ లేపితాంగుడుగా, చక్ర త్రిశూల డదమరుక గదాహస్తుడుగా, పద్మాసనస్థుడుగా, సూర్యచంద్రనేత్రుడుగా, అభీష్ట సిద్ధి ప్రదాయకుడుగా దర్శనమిస్తాడని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దిగంబర భస్మ సుగంధలేపనం
చక్రం త్రిశూలం డమరుం గదాం చ
పద్మాసనస్థం రవి సోమనేత్రం
దత్తాత్రేయ ధ్యానమభీష్ట సిద్ధిదం
దత్తాత్రేయావతారం ఏం చెబుతోంది
అత్రి కుమారుడు కనుక అత్రేయుడయ్యాడు. దత్తుడైన ఆత్రేయుడు కనుక దత్తాత్రేయుడయ్యాడు. ఇలా భగవంతుని తత్త్వాలూ, లీలలూ అవాజ్మానసగోచరాలుగా అనిపిస్తాయి. స్వామి దిగంబరత్వం తననెవరూ కప్పి ఉంచలేరనే సత్యాన్ని చెబుతుంది. అంతేకాదు అంతటా వ్యాపించి సర్వాంతర్యామిగా ఉండే తనకు ఆచ్చాదనలు ఎందుకనే పరమార్ధం ద్యోతకమౌతుంది. భస్మాన్నీ చందనాదులనూ శరీరానికి పూసుకోవడాన్ని గమనిస్తే లోకంలోని పరమాణువులన్నీ తన శరీరాలే అనే యదార్థం ధ్వనిస్తుంది.
త్రిశూలమూ, గదా, చక్రమూ దుష్టశిక్షణ సామర్ధ్యాన్ని సూచిస్తాయి. డమరుకం మానవులకు వెలుగైన శబ్ద ప్రపంచమంతా తననుండే ఉద్భవిస్తోందని సూచించడానికి స్వామి ధరించాడని తెలుస్తుంది. పద్మంలో స్వామి కూర్చోవడం వెనుక మానవాళికి సమస్త వికాసాలూ తననుండే లభిస్తాయని చెబుతున్నట్లు అనిపిస్తుంది.
సూర్యచంద్రులు స్వామి నేత్రాలు కావటం వల్ల మానవ జీవన కాలంలో అత్యంత ముఖ్యమైన రాత్రింబవళ్ళు తన వల్లనే జరుగుతున్నాయనీ కాలమంతా తానే అనీ సూచించడం జరిగిందని గ్రహించవచ్చు అని చిలకమర్తి తెలిపారు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిగుణాలకు ప్రతిరూపులు. గుణాలన్నీ వారి నుండే పుడతాయి. వారిలోనే చివరికి అంతర్భవిస్తాయి. సత్త్వం సృష్టికీ, రజస్సు స్థితికీ తమస్సు ప్రళయానికి సంకేతాలు. ఇవి వరుసగా చక్ర భ్రమణ క్రమంలో మానవుని జీవితంలో సంభవిస్తుంటాయి.
పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి జీవి మళ్ళీ పుట్టక తప్పదు. జనన మరణాల చక్రంలో ఏదీ శాశ్వతం కాదు. పుట్టినప్పుడు కలిగే అనందం గిట్టినప్పుడు నశిస్తున్నందు వల్ల ఈ సాంసారిక చక్రంలో అన్నీ క్షణికాలే అనే సత్యం ప్రకటితం అవుతోంది. కనుక సృష్టి, స్థితి ప్రళయాలను శాసించే దత్తాత్రేయుని శరణు వేడడం అవసరమనే సత్యాన్ని దత్తాత్రేయావతారం గుర్తు చేస్తోంది. సృష్టి స్థితి ప్రళయాలే క్షణికాలైనప్పుడు మనిషి జీవితం నీటిబుడగ వలె అత్యంత క్షణికమే అనేది పరమార్ధం. క్షణికమైన జీవితాన్ని సాధనంగా చేసుకుని శాశ్వతమైన దత్తాత్రేయుణ్జి చేరుకోవడమే దత్తాత్రేయోపసనలోని సారాంశం.
అదంతా అశాశ్వతమే
లోకంలో మానవులు ఏ పదార్థాలను ఎంతో ప్రీతిగా పొందగోరుతారో ఆ పదార్థాలన్నీ భగవంతుని విషయంలో అశాశ్వతాలు. కనుక దత్తాత్రేయుడు భక్తులలో వైరాగ్య భావాన్ని కలిగించడం కోసం అవధూతగా ఉన్మత్తునిగా, స్రీలోలునిగా, కామకునిగా కనబడి, వారిలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు వివిధ రూపాలను ధరించాడు. నిరంతర కల్యాణమూర్తి అయిన స్వామికి పాపపుణ్యాలు ఉండనే ఉండవు. అవన్నీ కేవలం జీవులకే.
స్వామి ఎన్ని రూపాలు ధరించినా, ఆ రూపాలలో ఉన్న గుణదోషాలు స్వామికి అంటుకోవు. లోకాన్ని వంచిస్తున్నట్లు కనబడుతాయే గాని, అవన్నీ లోకాన్ని సత్యమార్గం వైపు ప్రయాణింపచేయడానికే అన్నది సరైన మాట. దత్తాత్రేయావతారంలోని మరొక విశేషం స్వామి ఎవరు తలచినా వెంటనే వారి ఎదుట ప్రత్యక్షం కావడం. భగవంతునికి చేసే స్తుతి ఉభయతారకమని పెద్దలమాట.
ఆ ఉభయులు ఐహికాముష్మికాలే. మనిషికి ఇహలోకంలో సౌఖ్యంగా జీవించడం ఎంత అవసరమో మరణానంతరం ఉత్తమ లోకాలకు చేరుకోవడం కూడా అంతే అవసరం. కనుక కేవలం నూరేళ్ళతో ముడివడిన మానవ జీవితం కాదు. మరణానంతరం జీవితం కూడా మనిషికి ముఖ్యం. అందుకే ఇహలోకంలోనే పరలోకానికి సంబంధించిన ఉత్తమ స్ధితి కోసం ప్రయత్నించాలి.
అలా ప్రయత్నిస్తున్నప్పుడు అడుగడుగునా తటస్థ పడేవాడూ, అదుకునేవాడు దత్తాత్రేయుడే. అందుకే ఆ స్వామిని దీనబంధువు అని అంటారు. మానవులు ఎన్ని సంపదలు ఉన్నా దీనులే. ఎందుకంటే అవి వారిని పుణ్యలోకాలకు చేర్చలేవు. ధనరాసుల మీద కూర్చున్నా అశాంతి వెంటాడుతూనే ఉంది. ఇంకా ఏదో సాధించవలసింది లభించలేదనే అసంతృప్తి శమించదు.
అప్పుడు గుర్తుకు వస్తాడు కృపాసింధువు. కారుణ్యానికి అతడు సముద్రమే. అది కూడా ఉప్పునీళ్ళ సాగరం కానే కాదు. అమృత జలధి. ఎంత త్రాగితే అంతటి తేజస్సునూ, ఓజస్సునూ ప్రసాదించే కడలి. త్రాగడానికి విసుగు రావలసిందే గానీ ఆ కారుణ్యామృతానికి అంతం లేదు. అందుకే లవణ సాగరాల తీరాలను ఆశ్రయించడం కన్న దత్తాత్రేయుని అండ కోరడం సకల శ్రేయస్కరమని చిలకమర్తి తెలిపారు.
మానవులూ చేసే మంచి పనులకూ, చెడు పనులకూ కారణాలుంటాయి. కారణాలలోని కారణాలను తెలుసుకోవాలంటే దత్తాత్రేయుని ఆశ్రయించక తప్పదు. భూతభవిష్యద్వర్తమానాలే అన్నింటికి కారణాలు. అవి కాలస్వరూపాలు. వాటిని తెలుసుకోవడానికి త్రికాలవేత్తలు కావాలి. దత్తాత్రేయుడు త్రికాలవేత్త. అతనిలో లీనం కాకపోతే ఈ త్రికాలాలలోని కారణాలు తెలియవు. లోకంలో మానవులు రక్షింపబడుతున్నారంటే అది భౌతిక సాధనాల వల్ల కానేకాదు. దైవరక్షణం వల్లనే.
ఒక్కొక్కసారి ఎన్ని సాధనాలున్నా మానవుడు కృతకృత్యుడు కాకపోవడాన్ని చూసినప్పుడు సర్వరక్షాకరుడు భగవంతుడే అనీ, ఆ భగవంతుడు దత్తాత్రేయుడే అనీ చెప్పక తప్పదు. స్వామి ఎవరికి లభిస్తాడు? అనే శంక అందరికీ కలుగుతుంది. శరణాగతులు, దీనులూ, ఆర్హులూ అయినవారు లోకంలో అసంఖ్యాకంగా ఉన్నారు. వారిని రక్షించడానికి అనుక్షణం సిద్ధంగా ఉంటాడు దత్తాత్రేయస్వామి. అందుకే స్వామిని శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణుడు అని పిలవడం సహజం. అది స్వామికి ఎలా సాధ్యం అంటే అతడు నారాయణడూ, విభువూ కనుక అనేది సమాధానం.
సర్వవ్యాపి
నారం అంటే నీరు. ఆ నీటికి ఆశ్రయమైనవాడు కనుక నారాయణుడు సర్వవ్యాపి. లోకమంతా నీరే వ్యాప్తమై ఉంది. సర్వవ్యాపకుడై ఉన్నాడు కనుక దత్తాత్రేయుడు విభువు. మానవులకు అడుగడుగునా అనర్థాలు ఎదురౌతుంటాయి. ఎన్ని సామర్థ్యాలు ఉన్నా ఎంత ధనం ఉన్నా ఒక్కొక్కసారి అవెందుకూ పనికిరావు. అలాంటి అనర్థాలు మంగళాన్ని దూరం చేస్తాయి. మంగళం లేకుండా మానవ జీవనం ఎలా సాధ్యం?
మంగళాలు కలుగుతూ ఉంటేనే అనర్థాలు దూరమౌతుంటాయి. కనుక అనుక్షణం మంగళాలు పుడుతూనే ఉండాలంటే దత్తాత్రేయుని రక్షణ కోరడం తప్ప వేరే మార్గం లేదు. క్లేశాలంటే కష్టాలు. భగవంతుడు నిర్దేశించిన మార్గాలను తెలుసుకోకపోతే ధర్మాన్ని ఆచరించడం అసాధ్యం. ధర్మతత్త్వం ఎంతో సూక్ష్మమైంది. ఎన్నో జాగ్రత్తలతో ముందుకు సాగితేనే ఒక ధర్మాచరణ సాధ్యం. అలాంటిది అసంఖ్యాకంగా ఎదురయ్యే ధర్మాలను చక్కగా తెలుసుకోవడానికి దత్తాత్రేయుని అవతారంలోని విశిష్టతను గ్రహించడం అవసరం.
అందుకే దత్తాత్రేయ స్మరణ ద్వారా మనుష్యులు అనుక్షణం పాపాల బురదల్ని కడిగివేసుకోవాలి. పుణ్యజలాలలో స్నానం చేయాలి. జ్ఞాన తేజస్సుతో వెలిగిపోవాలి. జీవితం చరితార్థం అవుతుంది. చిత్తంలో దత్తస్వరూపం ఉన్నంతకాలం మనిషి నిజంగా చరితార్థుడే కాగలడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.