శనైశ్చరుని జననం.. శని దేవుని ఈ కథ తెలుసుకోండి
వైశాఖ అమావాస్య రోజు శని జన్మించిన రోజు అని ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శని దేవుడి కథను వివరించారు.
వైశాఖ బహుళ అమావాస్య శనైశ్చరుని జన్మతిథి. శని పుట్టిన రోజు. వాడుక భాషలో శని జయంతి అంటుంటారు. అలా జయంతి అనకూడదు కానీ ఇలా అనకపోతే చాలా మందికి అర్థం కావడం లేదు. శని భగవంతుని జన్మతిథి నాడు ఆయన్ను పూజించడం ఎంతో మంచిది.
ఏలినాటి శని, అర్జాష్టమ శని, శని దోషాలు, శని వలన బాధ పదేవారికి ఇది ఒక చక్కని అవకాశం. శని భగవంతుని ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి బాధలు, భయాలు ఉండవు. శని భగవంతుని ప్రసన్నం చేసుకోవడం తేలికైన విషయమే. ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆయనకు ఇష్టమైనవి చేయాలి అని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శని దేవుడి కథ ఇదే
నవగ్రహాలకు రారాజు, సకల జీవులకు ప్రత్యక్షదైవం సూర్య భగవానుడు. ఆయన సతీమణి సంజ్ఞాదేవి. వారికిరువురు సంతానం. యముడు, యమునా. వారే యమధర్మరాజు, యమునా నది. సూర్యుని వేడికి తాళలేని సంజ్ఞాదేవి తన నీడ నుంచి తనలాంటి స్త్రీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర వుండమని కొంతకాలం పుట్టింటికి వెళ్ళి అక్కడ తండ్రైన విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట సూర్యుని గురించి తపస్సు చేయసాగెను.
అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయకి శని, తపతి అను పిల్లలు పుట్టటం వలన ఆమె యమధర్మరాజుని, యమునను చిన్నచూపు చూడటం మొదలుపెడుతుంది. తన ప్రేమానురాగాన్ని అంతా తన పిల్లలపై చూపించసాగుతుంది. ఆటలాడుకొను సమయంలో యముడు, శని మధ్య అభిప్రాయబేధాలొచ్చి యముడు శని కాలు విరిచాడు. దానికి ఛాయాదేవి కోపించి యముని శపించింది. యమునని నది కమ్మని శపించగా, యముడు కూడా తపతిని నది కమ్మని శపించాడు.
అంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్ని అంతా దివ్యదృషితో గ్రహించి వారికి కలిగిన శాపములకు చింతించి యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రత పొందగలదని, లోకానికి ఉపకారిగా వుండమని ఎవరైనా నీ నదిని స్పర్శించినా, స్నానం చేసినా వారికి సర్వపాపాలు హరిస్తాయని చెప్పాడు.
అలాగే యముడిని కూడా శాంతి వాక్యాలతో ఓదార్చాడు. యముడిని యమలోకానికి పట్టాభిషేకం చేయించాడు. ఆకాశంలో ఛాయను కాలుతో తన్నబోయిన యమధర్మరాజుని ఆమె ఆగ్రహంతో నీ కాలు మంటలలో కాలుతుంది అని శపించగా, ఆ కాలు మంటల్లో పడకుండా మంటపై యుండును అని, రెండో కాలు ఎల్లవేళలా నీటిలో వుండునని, ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు భగ్గున మండిపోతుందని, నా వరం వల్ల నీ కాలు నీటిలో వుంటే రెండో కాలికి ఎలాంటి ప్రమాదం ఉండదు అని తండ్రి చెప్పెను.
అందుకే యముడికి సమవర్తి అనే పేరుంది. (ధర్మాధర్మాలను, నీళ్లు, నిప్పును ఒకేలా చూస్తాడు కనుక). శనిని నవగ్రహాలలో ఒకనిగా చేసి జ్యేష్టాదేవికిచ్చి వివాహం జరిపించెను. అయితే త్రిమూర్తులు శనికి కొన్ని అధిపత్యాలు ఇచ్చారు. ఆయువుకి అధిపతిగా, జనులపై ఆతని ప్రభావం వుండేట్లుగా అన్న మాట. శివుడు అయితే శని, యమునిని ఒకటిగా చేసెను. అంటే యముడే శని, శనియే యముడులాగా!
శని జయంతి రోజున ఏ పూజలు చేయాలి?
గ్రహాలకు రాజైన సూర్యభగవానుని పుత్రుడు శని. ఆయన అనుగ్రహం మనము పొందాలి కదా, కాబట్టి ఆయనకు ఉపచారాలు చేయాలి. కనుక పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్న తరువాత కానీ, లేదా లేచి సంధ్యావందనాదులు చేసుకున్న తర్వాత కానీ నవగ్రహాలయానికి వెళ్ళండి.
అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనైశ్చరుడికి ప్రత్యేకంగా అర్చన చేసుకోండి. అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వండి. లేదంటే ఆ ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చుని (శనైశ్చరుడికి ఎదురుగుండా కూర్చో కూడదు కాబట్టి ఆయనకు అటు పక్క గాని ఇటు పక్కగాని కూర్చోండి) అనగా కోణంలో కూర్చోవాలి.
శ్లోకం చదవాలి
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం!
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం॥
వైశాఖ మాసం అమావాస్య నాడు హనుమంతుడు సూర్యుడ్ని పట్టుకోడానికి ఆకాశానికి ఎగిరాడు కాబట్టి హనుమంతుని స్తోత్రము చేయండి, కథ వినండి.
ఎప్పుడూ అమావాస్య నాడు తలంటు మాత్రం పోసుకోకూడదు. ఈ పూట అభ్యంగనం పనికిరాదు. కేవలం శిరస్నానం చేస్తే చాలు. స్నానం చేసిన తరువాత ఒక పెద్ద రాగి గిన్నె కానీ, ఇత్తడి గిన్నె కానీ, కంచు గిన్నె కానీ లేదా మట్టి మూకుడు కానీ పెట్టుకుని అందులో నిండా నీళ్లు తీసుకోండి, ఆ నీటిలో ఎర్రని పూలు, నల్లని పూలు, పసుపు పచ్చ పూలు వేయండి.
ఈ పువ్వులు, నీళ్లు కలిపి రెండు చేతులలో (దోసిలి) తీసుకుని మీ పితృ దేవతలకు మూడు సార్లు వాళ్ళను మనసారా తలచుకుని అర్హ్యం విడిచి పెట్టండి. (నీళ్ల విడిచిపెట్టెయ్యండి).
ఏదైనా వేరే పాత్రలో ఆ నీరు పోసెయ్యండి. అక్కడ అమ్మకి, నాన్నకి కాదు మీరు విడిచి పెట్టేది, మీ వంశాన్ని బాగు చేస్తున్న మహానుభావులైన పితృదేవతలకు, కాబట్టి అందరం ఆడ, మగ అనే తేడా లేకుండా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఈ తర్పణాలు మాత్రం విడిచి పెట్టాలి.
పిండ ప్రదానాలు మాత్రం తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు చెయ్యకూడదు తప్ప, తర్పణాలు అందరూ ఇవ్వాలి. తర్పణాలు విడిచి పెట్టాక యథాశక్తిగా ఇష్ట దేవతలను పూజించండి. సూర్యుడిని మాత్రం తప్పక పూజించండి. వీలుంటే నవగ్రహాలను తలచుకోండి. ప్రదక్షిణ మరియు పూజ చేయాలి.
శని మహత్మ్యం
శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద పడుతుంది., పొరుగు రాజు కాళ్ళు, చేతులు నరికివేస్తాడు.
చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, బ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుడిని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు, అనేక దేవతల, బుషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు ఉంటాయి.
కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు.
ఆ ముద్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీ దేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చవచెప్పినా, మాతృ గర్వంతో శనీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.
ఈ శ్లోకాలు జపించండి
స్వయంగా శని భగవానుడే ఉపదేశించిన మహాశక్తివంతమైన శని శాంతి స్తోత్రాలు. ఈ స్తోత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ స్తోత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ స్తోత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది. ఈ స్తోత్రాలను ప్రతిరోజూ పఠించడం వలన శని భగవానుడు ప్రీతిచెంది చల్లగా చూసి కాపాడతాడు.
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ష సమస్రజమ్
ఛాయామార్తాంద సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్శపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్జాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ కృష్ణదేహాయ వై నమః
శనైశ్చరాయ కరాయ శుద్ధబుద్ధి ప్రదాయనే య ఏభిర్నామభి:
స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్ మదీయం
తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి
నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు “క్రోడం నీలాంజన ప్రఖ్యం..” అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.
శన్యారిష్టే తు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే
ఈ రెండు స్తోత్రాలను స్మరించడంతో బాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
టాపిక్