Holi Purnima 2023 । హోలీ పూర్ణిమ ఎప్పుడు వస్తుంది? పండగ విశిష్టతను తెలుసుకోండి!
Holi Purnima 2023: ఫాల్గుణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ హోలీ. ఈ హోలీ పండుగను హోలీ పూర్ణిమ అని కూడా అంటారు. దీని వెనక ఉన్న కథ, ఇతర వివరాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు. మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
Holi Purnima 2023: చిలకమర్తి పంచాంగరీత్యా, దృక్ సిద్ధాంత పంచాంగ గణనము ఆధారంగా ఈ సంవత్సరము 2023 మార్చి 7న హెూలీ పౌర్ణమి ఏర్పడినదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఫాల్గుణ మాసము విష్ణు భగవానునికి ప్రీతికరము అని భాగవతము చెప్పింది. కృతయుగంలో మహావిష్ణువు నరశింహ అవతారములో హిరణ్యకశిపుడిని సంహరించి విజయము పొందినటువంటి రోజును హెూలీ పండుగగా చెప్పడమైనది. వసంత ఋతువు ప్రారంభానికి, వసంతోత్సవానికి గుర్తుగా హెూలీ పండుగను జరుపుతారు. పౌర్ణమి రోజు ఫాల్గుణి నక్షత్రము (పూర్వ ఫాల్గుణి / ఉత్తర ఫాల్గుణి ) ఉండుట చేత ఈ పౌర్ణమి హెూలీ పౌర్ణమి అయినది.
ఉత్తర భారతములో హెూలీ పండుగను చాలా ప్రత్యేకముగా జరుపుకుంటారు. విష్ణుమూర్తి ఆలయాల్లో వసంతోత్సవాలు ప్రత్యేకంగా హెూలీ పండుగ రోజు జరుపుతారు. ఫాల్గుణ మాసములో అతి ముఖ్యమైన పండుగ వసంతోత్సవము, హెూలీ పండుగ. ఇది కాముని పండుగ. హెూలీ పండుగ కామదహనము పేరుతో ప్రఖ్యాతి చెందినది. శివుడు మూడో కన్ను నుండి మన్మధుడు దహనము జరిగిన రోజు. దక్షిణ భారతదేశములో శివపార్వతులను, మహావిష్ణువును, కృష్ణుడు, లక్ష్మీదేవిని, మన్మధుడిని హెూలి పండుగ రోజు ప్రత్యేకంగా పూజిస్తారు. లోక కల్యాణం కోసం, శివపార్వతుల కళ్యాణం జరగడం కోసం ఘోరతపస్సులో ఉన్న శివుని మీదకు మన్మధుడు బాణం వదిలిన రోజు, శివ తపస్సు భగ్నమై మన్మధుడు దహనం జరిగిన రోజు. దేవతలు పార్వతీదేవి, శివుడికి జరిగిన వృత్తాంతము చెప్పి రతీదేవి సమేతంగా శివుడిని ప్రార్థించగా మన్మధున్ని శివుడు క్షమించి బతికించిన రోజు హెూలీ పౌర్ణమిగా రోజుగా పురాణాలు తెలియచేసాయి.
ఫాల్గుణ మాసం విశిష్టత
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం పూర్వ ఫాల్గుణి, ఉత్తర ఫాల్గుణి నక్షత్రాల వద్ద పౌర్ణమి చంద్రుడు ఉండుట చేత ఈ మాసమునకు ఫాల్గుణ మాసం అని పేరు వచ్చింది. భాగవతం ప్రకారం, ఫాల్గుణ మాసము శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించేటటువంటి వారు ఫాల్గుణ శుక్ల పాడ్యమి నుండి శుక్ల ద్వాదశి వరకు ఉన్న ఈ పన్నెండు రోజులు పయోవ్రతమును ఆచరిస్తారు. పయోవ్రతమనగా మహావిష్ణువును పన్నెండు రోజులు పంచామృతాలతో అభిషేకం చేసి, రోజూ ఉదయం, సాయంత్రము స్నానమాచరించి విష్ణుమూర్తిని పూజించాలి. విశేషంగా విష్ణుమూర్తిని పంచామృతాలతో అభిషేకం చేయడం పయోవ్రతములో విశేషము. ఇలా పన్నెండు రోజులు విష్ణుమూర్తిని అభిషేకం చేసి పూజించి పదకొండో రోజు ఉపవాసముండి, పన్నెండో రోజు విష్ణుమూర్తికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా నిష్టతో విష్ణుమూర్తిని పూజించిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుందని భాగవత పురాణము తెలియచేసినది.
ఫాల్గుణ మాసము దానధర్మాలు ఆచరించడానికి ఉత్తమమైన మాసమని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఫాల్గుణ మాసములో గోదానం, ధనదానం, వస్త్రదానం చేయడం వలన గోవిందునకు ప్రీతి కలిగిస్తాయిని శాస్త్ర వచనం. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజు ఆమ్లక ఏకాదశి వ్రతము నిర్వహించడం, ద్వాదశి నాడు రోజు నరసింహస్వామిని పూజించడం సాంప్రదాయము. ఫాల్గుణ అమావాస్య రోజు పితృ దేవతలకు తర్పణాలు వదిలి అన్నదానాలు చేయాలి.
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
మొబైల్: 9494981000.