శని భగవానుడి చలవతోనే చిక్కులన్నీ.. ఈ పరిహారాలతో అనుగ్రహం పొందండి-get lord shani blessings with these remedies ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శని భగవానుడి చలవతోనే చిక్కులన్నీ.. ఈ పరిహారాలతో అనుగ్రహం పొందండి

శని భగవానుడి చలవతోనే చిక్కులన్నీ.. ఈ పరిహారాలతో అనుగ్రహం పొందండి

HT Telugu Desk HT Telugu
May 27, 2023 03:00 AM IST

శనిమహాత్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి సహా శివుడు, అనేక దేవతలు, బుషుల మీద శనిప్రభావం కనిపిస్తుంది. కష్ట సమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో ఉంటూ జీవితం సాగించాల్సిన ఆవశ్యకతను శనిమహాత్మ్యం తెలియజేస్తుంది.

శని దేవుడి మహిమలు, అనుగ్రహానికి చేయాల్సిన పూజలు, పరిహారాలు ఇవే
శని దేవుడి మహిమలు, అనుగ్రహానికి చేయాల్సిన పూజలు, పరిహారాలు ఇవే

శని భగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుదై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోయాల్సి వస్తుంది. పొరుగు రాజు చేతిలో కాళ్ళు, చేతులు పోగొట్టుకుంటాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, బ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు.

శనిమహాత్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి సహా శివుడు, అనేక దేవతలు, బుషుల మీద శనిప్రభావం కనిపిస్తుంది. కష్ట సమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో ఉంటూ జీవితం సాగించాల్సిన ఆవశ్యకతను శనిమహాత్మ్యం తెలియజేస్తుంది.

సకల జీవులకు ప్రత్యక్షదైవం అయినట్టి సూర్య భగవానుడికి, అతని రెండో భార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నదో అని నిరూపించడానికి ఆయన జననం సూర్య గ్రహణములో జరిగింది.

జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ప్రతివారి జాతకంలో ఏల్నాటి శని, అర్జాష్టమ, అష్టమ శనులు వస్తూ ఉంటాయి. వాటి ప్రభావాన్ని చూపిస్తూ వుంటాయి. వారి కర్మానుసారం (వారి వారి జన్మలగ్నాలను బట్టి) ప్రతి వ్యక్తి ఎంతో కొంత శని వలన బాధలు పొందుతారు. అయితే పరిహారాలు సక్రమంగా చేసుకొని, క్రమ శిక్షణాయుతమైన జీవనం గడిపి, శని గాడు అని ఎవర్నీ దూషించకుండా ఉంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించవచ్చు.

చిక్కులు, ఇబ్బందులు శని వల్లే

మనిషికి అనుకోని చిక్కులు, ఇబ్బందులు, టెన్షన్స్‌ అన్నీ కూడా శని వల్ల జరుగుతా యి. అనారోగ్యా లు, పనులన్నీ వాయిదాలు, మానసిక అశాంతి వంటివన్నీ శని దేవుని ఘనతే అని చెప్పాలి. ప్రతి చోట ప్రతి వారితో ఏదో రూపంలో మోసపోవటం, నష్టపోవటం, మానసిక ఘర్షణ అన్నిటికీ సూత్రధారి.

అలానే కాకుండా ఈ ఏలినాటి శనిలో ముఖ్యంగా జన్మ శని, వ్యయ శని, ద్వితీయ శనిలో దాదాపుగా 2 1/2 సం చొప్పున 7 1/2 సం శని ఉండటం వలన ఖర్చులు, చిక్కులు, అవమానాలు, బంధుమిత్రులతో విద్వేషాలు, “నా” అన్న వారితో వైరాలు, మంచికెడితే చెడు ఎదురవ్వటం, అప్పులు, హాస్పిటల్‌ దర్శనాలు ఇలా అనేకరకమైన ఇబ్బందులు.

ఇంతేకాకుండా అర్జాష్టమ, అష్టమ శనులు నడిచేటపుడు కార్యాలయాల యందు అసంతృప్తి, మోకాలు నొప్పి, స్పాండిలైటిస్‌, నరాలు మొదలైన ఇబ్బందులు (దంతరోగాలు కూడా), ఇష్టం లేని ప్రదేశాలకి వృత్తిపరమైన మార్చులు, వైరాగ్యం, అనుకోని పరిచయాల వల్ల వూహించని పరిణామాలు ఎదురవుతాయి.

మనసు అంతా వెలితి ఏదో పోగొట్టుకున్న భావన. అంతా ఉన్నా అందరి మధ్య ఉన్నా మంచి హోదా ఉన్నా తెలీని ఆందోళన, అసంతృప్తి, వేదన! ఇలా ఎన్నింటికో శని దేవుడు కారకుడు. మరి ఆ శనిని సంతృప్తి పరచటానికి పరిష్కారాలు అవసరం! ఆ స్థానం బాగుండనపుడు కనీసం 'గురు” బలం అయినా అవసరం. రెండూ బాగోకపోతే ఇబ్బందులు మెండు. అయితే గోచారరీత్యా రెండు గ్రహాలకి పరిహారం అవసరం.

శని వలన ఇబ్బందులు అధికమయితే పరిహారాలు

“నీలం” ధరిస్తే శని వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అధిగమించవచ్చు అని అనుకోవటం సరి కాదు. 'నీలం” శని దేవుని రత్నమే అయినా అది శని దశలలో, శని నక్షత్రాలలో పుట్టిన, శని రాశులలో పుట్టినా, శని (గోచారరీత్యా) అష్టమ, అర్జాష్టమ, ఏలినాటి శని దశలు నడుస్తున్నా పెట్టుకోటం సరికాదు. పూర్తి జాతకం చూపించుకున్నాక, అవసరమైతే తప్పక ధరించాలి.

నల్ల ఆవుకు బెల్లంతో కలిపిన నువ్వుండలు తినిపించాలి. శనివారం, శని త్రయోదశి, మాసశివరాత్రి, మొదలైన రోజులలో (నవగ్రహాలలో వున్న) శనిదేవుని తైలాభిషేకం అత్యంత మేలు. శివునికి రుద్రాభిషేకం కూడా చేయాలి. ప్రతి శనివారం దేవాలయ సందర్శన చాలా మేలు (నవగ్రహ దేవాలయాలు) నూనె, నువ్వులు, మినుములు, నల్ల మేక, ఇనుము మొదలైనవి దానం ఇవ్వచ్చు.

ప్రతి శని త్రయోదశికి క్రమం తప్పకుండా శని స్తోత్రం, శని చాలిసా, శని అష్టాత్తర, సహస్రనామ స్తోత్రం పారాయణ చాలా మేలు. ఆ సమయంలో ప్రత్యక్ష దైవం సూర్య నారాయణునికి నమస్కారములు చాలా మేలు.

శని “కారకత్వాలుగా” ఆయుష్షు 'సేవకా వృత్తి వాత వ్యాధులు, పాదుకలు, చెడు సహవాసము, సేవలు చేయటం, నపుంసకత్వం, కూలీ, అరణ్యసంచారం, నీలం, మినుములు, అబద్ధం, దున్నపోతు, పాపం, ఎండిపోవడం, దంతబాధలు, మోకాళ్ళు, కఫవాతం, ఎముకలు, దుఃఖం, శిల్చం, వ్యసనం, ఇంకా చాలా చాలా వున్నాయి. ఏల్నాటి శని దోష నివారణకు శని వినుకొండ పట్టణంలో సతీసమేతంగా నిర్మాణమౌతున్న శ్రీ శనైశ్చరాలయానికి ఇనుమును అందించడం ద్వారా శీఘ్ర ఉపశమనం పొందవచ్చని శాశ్వత శనిదోష నివారణ దేవాలయ ప్రతిష్ట సమయానికి కలుగుతుందని... పితృదేవతలు సంతృప్తి చెందుతారని ఎంతోమంది దేవాలయ ఆగమ సిద్ధాంతులు తెలియచేశారు.

శనీశ్వరుడు ప్రసన్నుడవాలంటే:

అమావాస్య రోజున కాళీ మాత పూజ చేయాలి. విష్ణువును, కృష్ణుని రూపంలో ధ్యానిస్తూ 'ఓం నమో నారాయణాయ, 'హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..” అని జపించాలి. హనుమంతుడిని సర్వోత్కృష్టమైన (అనంతమైన) రూపంలో ధ్యానించాలి. శని, హనుమంతుని వీపుపై చేరి అతన్ని పట్టి పీడించాలని ప్రయత్నించినప్పుడు, తన బలం అంతా ఉపయోగించి, ఒక్క విదిలింపుతో శనిని విసిరి పారేసినప్పుడు సూర్య భగవానుడు హనుమంతుడిని మెచ్చుకుని, ‘నిన్ను పూజించిన వారికి శని బాధలు ఉండవు’ అని దీవించాడట.

శనిత్రయోదశి, శనిజయంతి (పుష్యమాసం, బహుళ అష్టమి), శనిఅమావస్య రోజులలో తిలాభిషేకం చేయాలి. బ్రాహ్మణునికి నల్ల నువ్వులు దానం చేయాలి. నల్ల గోవు(కపిల గోవు)కు బెల్లం, నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి. శనివారాలలో (శ్రావణ మాసంలో తప్పనిసరిగా) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండాలి. కాకులకు ఉదయం, మధ్యాహ్న వేళలలో అన్నం పెట్టాలి. వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. శని క్షేత్రాలు సందర్శించాలి.

ముఖద్వారం వద్ద దీపం వెలిగించాలి

ప్రతిరోజూ సూర్యాస్తమయం తరువాత ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. దశరథ మహారాజ కృత శని స్తోత్రమును పఠించాలి. శ్రావణ పూర్ణిమ నాడు, జ్యేష్టాదేవికి, శనీశ్వరుడికి కళ్యాణం జరిపించాలి.

మూల మంత్రం, పునర్చరణ, హవనం, దానములతో పాటుగా 19000 సార్లు శనిజపం చేయటం మంచిది. శ్రావణమాసలో, శనివారాలలో శనైశ్వరవ్రతం, హోమం చేయటం చాలా మంచిది. శనైశ్వర దీక్ష శ్రావణ శుద్ద విదియ నుండి శ్రావణ బహుళ షష్టి వరకు పూనాలి. రామ నామం, హనుమాన్‌ చాలీసా, దుర్గా స్తుతులను జపించాలి. హనుమంతుడు, దుర్గా దేవి, వినాయకులను ప్రార్ధించటం ఎంతో మంచిది. పెరుగన్నం దేవునికి నైవేద్యంగా పెట్టిన తరువాత కాకులకు పెట్టాలి. అనాథ బాలలకు అన్నదానం చేయాలి. పై వాటిలో ఏది పాటించినా శని ప్రసన్నుడవుతాడు.

శనివారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు” శనికి ప్రీతికరమయిన సంఖ్య. ప్రతి శనివారం శని భగవానుడిని ప్రార్ధిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. శనిభగవానుడు స్తోత్రప్రియుడు, కరుణామయుడు. కావున శనీశ్వరుడిని భక్తి ప్రపత్తులతో పూజించిన వారికి గ్రహదోషాలు తొలగిపోతాయి. అంతేగాకుండా శని భగవానునికి అత్యంత ప్రీతికరమైన శనివారం రోజున శనిత్రయోదశి రోజున ఏకాదశ రుద్రాభిషేకం, మహన్యాస, లఘున్యాస తైలాభిషేకం వంటి విశేష పూజలు చేయించే వారికి గ్రహదోషాలు దరిచేరవు.

మందేశ్వర స్వామి దేవస్థానం దర్శించండి

అతిపురాతన పుణ్యదేవాలయమైన శ్రీ మందేశ్వర (శనీశ్వర) స్వామి దేవస్థానంలో “శనిత్రయోదశి” పర్వదినాన విశేష పూజలు చేయించేవారికి ఈతిబాధలు తొలగిపోయి పునీతులౌతారని పండితులు చెబుతారు.

శనికి సమర్పించవలసిన ద్రవ్యాలు

నల్ల వస్త్రం, నూనెదీపం, అగరవత్తులు, నువ్వులనూనె, స్వీట్లు, పండ్లు, దండ, జిల్లేడు ఆకులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, గుర్రపునాడా, చిన్న దిష్టిబొమ్మ. ఇవి సమర్చించలేనివారు పావు లేదా అరలీటరు నూనెతో తైలాభిషేకం చేయొచ్చు.

శని ఆలయాలు

ఆంధ్రప్రదేశ్‌‌లోని మందపల్లి, మహారాష్ట్రలో శని శింగనాపూర్‌, తమిళనాడులో తిరునళ్ళార్‌ శని క్షేత్రములు. అయితే పూర్తి వాస్తుతో అతిశక్తివంతమైన 7వ శతాబ్దం నాటి క్షేత్రం పాండిచ్చేరిలోని తిరువళ్ళార్‌లో ఉంది. శని ప్రభావం వల్ల నల మహారాజు వస్త్రాలను పక్షి ఎగురవేసుకుపోయే దృశ్యాలు ఈ క్షేత్రంలో కన్పిస్తాయి. నలమహారాజు శని విముక్తి చేసే చిత్రాలు అక్కడ కన్పిస్తాయి.

భక్తులు నూనెతో స్నానం చేసి ఆ తర్వాత అక్కడి చెరువులో స్నానం చేస్తే చాలు ఎంత మాత్రం జిడ్డు కనిపించదు. లక్షలాదిమంది స్నానం చేసే ఆ చెరువులో జిడ్డు కనిపించకపోవడమే అక్కడి విశేషం. ఈ పవిత్ర క్షేత్రంలో బంగారు కాకిపై శనీశ్వర దేవునికి ఊరేగింపును చేస్తారు. ఈ స్వామి వారి భార్యల పేర్లు నీలాదేవి, మంగాదేవి. ఈ స్వామి పడమర దిక్కుగా ఉంటాడు. శింగణాపూర్‌, మందవల్లి, విజయవాడ, జాలా పాపగడ్, వైదీశ్వరన్‌ కోయిల్లలోని దేవాలయాలన్నీ శనీశ్వర దేవాలయాలలో ప్రఖ్యాతిగాంచినవి. శని త్రయోదశి పర్వదినాలలో మందవల్లిలోని శ్రీ మందేశ్వర స్వామి వారికి శని దోష పరిహారార్ధం తైలాఖిషేకాలు చేసుకుంటే శని దేవుని వలన కలిగే సమస్త దోషాలు తొలగుతాయని స్కంద పురాణంలో లిఖితమై ఉంది.

-చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner