Kakani kshetram: కాకాని క్షేత్ర దర్శనం వలన సంతానం కలుగుతుందా? ఈ క్షేత్ర వైభవం ఏంటి?
Kakani kshetram: గ్రహ బాధలు తొలగించి, సంతానాన్ని ప్రసాదించే క్షేత్రంగా వెలుగొందుతుంది కాకానీ క్షేత్రం. ఈ ఆలయం విశిష్టత గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
Kakani kshetram: గుంటూరు జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాలలో కాకాని చాలా విశేషమైనటువంటి క్షేత్రము. గ్రహ బాధలు తొలగించుకోవడానికి, కాలసర్ప దోషం, రాహు కేతు వంటి దోషాలు తొలగించుకోవడానికి, సంతానం కలగకుండా ఏర్పడిన దోషాలు తొలగించుకోవడానికి కాకాని క్షేత్రం చాలా దివ్యమైన క్షేత్రమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ క్షేత్ర దర్శనం వలన గ్రహ బాధలు, రాహు కేతు వంటి దోషాలు తొలగుతాయని చిలకమర్తి తెలిపారు. అక్కడ వేంచేసియున్న శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారు మహామహిమాన్వితులై యున్నారు. శ్రీ మల్లేశ్వరుడు శ్రీశైల మల్లేశ్వరుని ప్రధానాంశగా భావించబడును. ఈ లింగం శ్రీశైల లింగాంశము కలిగియుండుటచే ద్వాదశ జ్యోతిర్లింగముల యందలి మహిమ యిందును నెలకొని దర్శినీయమైయున్నది. దీనిని గురించి ఉన్న ఒక ప్రాచీన గాథను చిలకమర్తి చక్కగా వివరించారు.
భరద్వాజ మహాముని కాకాని క్షేత్రమును సందర్శించి ఈశ్వరుని ఆరాధించుచూ క్రతువు సంకల్పించి దేవతలకు హవిర్భాగముల నాసంగుచుండ అచటకొక వాయస (కాకి) యేతేంచి వాటిని తినుచుండగా భరద్వాజుడా కాకిని వారింపబోగానయ్యది. భరద్వాజా! నేను కాసురుండను రాక్షసుండను. ఒక మహర్షి శాపము వలన నిట్లుంటిని. ఈ శాపము మీ అభిషేకోదక ప్రభావంబుచే తొాలగిపోగలదు అని తెల్చెను. అట్లు ఒనర్చిన వెంటనే ఆ కాకి నల్లని వర్ణము వీడి తెల్లని వర్ణము సంతరించుకొన్నది. ప్రతి దినము ఈ పక్షిరాజము మానస సరోవరము నుండి ఆకాశమార్గమున పక్షిత్రీర్ధమునకేగి మరల వెళ్ళునపుడు ఈ కాకానీశ్వరుని గూడ దర్శించుచుండును. ఈ కారణముచే ఈ మహాక్షేత్రమునకు కాకాని క్షేత్రమని నామము కల్గినది.
ఈ క్షేత్రమునకు అనేక ప్రాంతముల నుండి భక్తులు విచ్చేయుదురు. అభిషేకములు, అన్నప్రాసనలు, పుట్టు వెంట్రుకలు తీయించుట, పోగులు కుట్టుట, వివాహములు, వాహన పూజలు, పొంగలి నివేదన, ప్రభలు తిప్పుట ఇచ్చట ముఖ్యమైన మొక్కుబడులు. ఆంధ్రప్రదేశమునందు మరే క్షేత్రములోను కానరాని పొంగలి నివేదనలు ఇచ్చట ప్రత్యేకత.
ఆదివారము ఈ క్షేత్రము నందు ప్రధానమైన దినము. కార్తీక మాసం సమయంలో, శివరాత్రికి భక్తులు విశేషముగా స్వామివారిని దర్శించుట జరుగుచున్నది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్