Ayodhya ram lalla statue: అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రత్యేకతలు చూశారా?-do you observe ayodhya ram lalla statue special features ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ayodhya Ram Lalla Statue: అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రత్యేకతలు చూశారా?

Ayodhya ram lalla statue: అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రత్యేకతలు చూశారా?

Gunti Soundarya HT Telugu
Jan 20, 2024 05:00 PM IST

Ayodha ram lalla statue: అయోధ్యలోని ఐదేళ్ల వయసు ఉన్న బాల రాముడి దివ్య సౌందర్యం అందరినీ మంత్ర ముగ్ధులని చేస్తుంది. ఈ విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

బాల రాముడి విగ్రహ ప్రత్యేకతలు
బాల రాముడి విగ్రహ ప్రత్యేకతలు (x)

Ayodhya ram lalla statue: దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు శ్రీరామ నామ జపాన్ని పటిస్తున్నారు. మరో రెండు రోజుల్లో అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరగనుంది. దీని కోసం అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్య రామ మందిరం గర్భ గుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. కళ్ళకి గంతలు కట్టి ఉన్న బాల రాముడి విగ్రహం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చిద్విలాసంతో ఉన్న బాల రాముడి మోము ఎంతో సుందరంగా ఉంది. సాలగ్రామ రాతితో చేసిన ఈ విగ్రహం చూస్తే ఎవరైనా మంత్ర ముగ్ధులు కావాల్సిందే. అంతటి సౌందర్య రూపం చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. జనవరి 22 న ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరగనుంది. 23 వ తేదీ నుంచి భక్తులకి దర్శనం ఇస్తాడు. 51 అంగుళాల ఎత్తులో ఉన్న బాల రాముడి విగ్రహం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఈ విగ్రహం 200 కిలోల బరువు ఉంటుంది. కర్ణాటకకి చెందిన అరుణ్ యోగి దీన్ని రూపొందించారు.

రామ్ లల్లా విగ్రహ ప్రత్యేకతలు

శ్రీరాముని బాల్యరూపంలోని ఉన్న విగ్రహం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. చేతిలో బంగారు బాణం, బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా విశిష్టంగా ఉంది. రాముడి విగ్రహం చుట్టూ విష్ణు మూర్తి దశావతారాలు ఉన్నాయి. వాటితో పాటు విగ్రహం దిగువున ఒకవైపు హనుమంతుడు మరొక వైపు గరుడ దేవుడు ఉన్నాడు. తామర పువ్వు మీద రాముడి విగ్రహం నిలబడి ఉంటుంది. రాముడు విష్ణు మూర్తి ఏడో అవతారంగా చెప్తారు.

రామ్ లల్లా విగ్రహం అంచుల మీద విష్ణు మూర్తి పది అవతారాలు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహావతారం, వామన అవతారం, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి అవతారాలకి చెందిన చిన్న చిన్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు సూర్య భగవానుడు, శంఖం, స్వస్తిక్, సుదర్శన చక్రం, గద, ఓంకారం వంటివి రాముడి విగ్రహ కిరీటం వైపు కనిపిస్తాయి. దీని మీద చేసిన కళా ఖండాలు అద్భుతంగా ఔరా అనిపిస్తాయి. ఈ విగ్రహం తయారీకి ఒక రాయి మాత్రమే ఉపయోగించారు. ఏకశిలా విగ్రహంగా పేరొందింది. వెయ్యి సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. నీరు, ఇతర ఏవైనా వస్తువుల వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. వాటి వల్ల విగ్రహానికి ఎలాంటి హాని జరగదు.

బంగారు విల్లు, బాణం

అయోధ్యలోని అమావా రామాలయం నుంచి బాల రాముడికి బంగారు విల్లు, బాణం బహుమతిగా అందాయి. ఈ విషయాన్ని శ్రీరామ తీర్థ క్షేత్ర నిర్వాహకులు కూడా ధ్రువీకరించారు. సుమారు రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన బంగారు విల్లు, బాణం రామ్ లల్లా విగ్రహం చేతిలో పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళనాడుకి చెందిన ఇద్దరు కళాకారులు రూపొందించారు. ఈ విల్లు మీద వాల్మీకి రామాయణంలో రాసిన అనేక కీలక ఘట్టాలని సూక్ష్మ రూపంలో అత్యంత అద్భుతంగా చెక్కారు.