Ayodhya ram mandir: అయోధ్య వెళ్లకుండానే రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠను కన్నులారా ఇలా వీక్షించండి
Ayodhya ram mandir: అయోధ్య వెళ్లకుండానే రామ మందిరంలో జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ వేడుకని కన్నులారా వీక్షించే సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమం మొత్తం లైవ్ టెలికాస్ట్ కానుంది.
Ayodhya ram mandir: దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్న తరుణం అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ. జనవరి 22న అందరి కల సాకారం కాబోతుంది. ఇప్పటికే రామ్ లల్లా విగ్రహం రామ మందిరానికి చేరుకుంటుంది. ఏడు రోజుల క్రతువులలో భాగంగా మూడో రోజు రామ్ లల్లా విగ్రహాన్ని గర్భ గుడిలో పెట్టనున్నారు.
జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ దృశ్యాన్ని కన్నులారా చూడాలని ఎంతో మంది ఆశగా ఎదురుచూస్తారు కానీ అది అందరికీ సాధ్యం కాదు. అందుకే భక్తుల కోరిక నెరవేర్చడం కోసం రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక ప్రసారం చేయబోతున్నారు. మీరు అక్కడికి వెళ్లకపోయినా ఇంట్లోనే టీవీల ద్వారా రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కళ్ళారా చూసుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
లైవ్ టెలికాస్ట్ ఎక్కడంటే..
వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని రామ మందిర ట్రస్ట్ భక్తులకి విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇంటి నుంచే లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ ఈ సంతోషకరమైన వేడుకలో పాల్గొనవచ్చు. దూరదర్శన్ లో రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్క్రీనింగ్ ఉండనుంది. ప్రత్యక్ష ప్రసారం మొత్తాన్ని డీడీ న్యూస్, డీడీ నేషనల్ ఛానెల్స్ లో చూడవచ్చు. దీంతో పాటు యూట్యూబ్ లింకుని దూరదర్శన్ తరపున ఇతర బ్రాడ్ కాస్టర్లకి కూడా షేర్ చేయబోతున్నారు.
అయోధ్యలోని రామాలయ సముదాయంలో మొత్తం 40 కెమెరాలు దూరదర్శన్ ఏర్పాటు చేసింది. 4 కె హెచ్ డీలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చని అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో సరయూ ఘాట్, జటాయు విగ్రహంతో సహ అనేక ప్రదేశాల నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ కాన్సులేట్, రాయబార కార్యాలయాల్లో కూడా రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక ప్రసారం చేయనున్నారు. జనవరి 22 న జరిగే ఈ వేడుకకి సుమారు 8 వేల మంది అతిథులు హాజరు కాబోతున్నారు. ఈనెల 23 నుంచి ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరవనున్నారు.
ప్రాణ ప్రతిష్ఠ షెడ్యూల్ మిగతా మూడు రోజులు
జనవరి 18న రామ్ లల్లా విగ్రహానికి చేయాల్సిన క్రతువులు పాటిస్తారు. మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ్ పూజ, విఘ్న హర్త గణేష్ పూజ వంటి ఆచారాలు నిర్వహిస్తారు. జనవరి 19 న యజ్ఞ అగ్ని గుండం స్థాపన జరుగుతుంది. మరుసటి రోజు వివిధ నదుల నుంచి సేకరించిన నీటితో రామ మందిర గర్భగుడిని శుభ్రం చేసి శాంతి కార్యక్రమాలు చేపడతారు. జనవరి 21 న శ్రీ రామ చంద్రుడికి 125 కలశాలతో నీటిని తీసుకొచ్చి స్నానం చేయిస్తారు. జనవరి 22న అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మొదలవుతుంది.