Dhanusu Rasi 2024: ధనుస్సు రాశి ఫలాలు.. కొత్త సంవత్సరంలో వీరికి శత్రు బాధ అధికం
Dhanusu Rasi 2024: ధనుస్సు రాశి 2024 సంవత్సర రాశి ఫలాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. కొత్త సంవత్సరంలో వీరికి శత్రుబాధ అధికంగా ఉంటుందని వివరించారు.
2024వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు అధికముగా గోచరిస్తున్నట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ధనుస్సు రాశి వారికి 2024లో 3వ ఇంట శని అనుకూలంగా ఉన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అభివృద్ధి కలుగునని తెలిపారు.
జనవరి నుండి ఏప్రిల్ వరకు ధనస్సు రాశి వారికి పంచమంలో గురుని అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి ఢోకా ఉండదు.
మే 2024 నుండి డిసెంబర్ 2024 వరకు ఆరో స్థానమైనటువంటి శత్రు స్థానములో గురుని సంచారం వలన ధనూరాశి వారికి శత్రు పీడ, బాధలు అధికమగును. 2024 ధనూ రాశి జాతకులకు నరఘోష, నరదిష్టి వంటి బాధలు కలుగు సూచనలు అధికముగా ఉన్నాయి.
2024లో ధనూరాశి వారికి మీ శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించాలి. శత్రువుల వల్ల రాజకీయ ఒత్తిడి, ఇబ్బందులు కలుగును. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు 2024 ద్వితీయార్థంలో శత్రువుల వలన కొంత పీడ కలుగు సూచన. 2024 ధనూ రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ప్రథమార్థం అనుకూలంగాను, ద్వితీయార్థం కొంత ప్రతికూలముగాను ఉన్నాయి. ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో రాజకీయపరమైన ఒత్తిళ్ళు ఇబ్బంది కలిగించు సూచన.
2024 ధనస్సు రాశి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయని చిలకమర్తి తెలిపారు. ధనుస్సు రాశి స్త్రీలకు 2024 జనవరి నుండి మే వరకు అనుకూల వాతావరణం, అనుకూల ఫలితాలు కలుగును. జూన్ నుండి డిసెంబర్ మధ్య సమయం కుటుంబములో కొంత చికాకులతో కూడియున్నటువంటి వాతావరణం ఏర్పడును. విద్యార్థులకు 2024 కలసివచ్చు సంవత్సరం.
ధనస్సు రాశి 2024 ప్రేమ జీవితం
2024 సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలించును. వైవాహిక జీవితం అనందమయంగా ఉండును. జీవిత భాగస్వామితో అనందముగా ఆహ్హాదముగా గడిపెదరు. విలాసవంతంగా జీవితాన్ని గడపాలనే మీ ఆలోచన సఫలీకృతమగును. ద్వితీయార్థంలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పటికీ మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసెదరు.
జూన్ నుండి డిసెంబర్ మధ్య కాలమునందు ధనస్సు రాశి జాతకులకు జీవిత భాగస్వామితో కొన్ని విషయాలలో భేదాభిప్రాయములు అధికముగా కలుగు సూచనలు ఏర్పడుతున్నాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ధనుస్సు రాశి 2024 ఆర్థిక విషయాలు
2024 సంవత్సరం ధనూరాశి వారికి ఆర్థికపరంగా అనుకూలించును. ధనూ రాశి వారు గత కొంత కాలంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలుతో ఇబ్బంది పడ్డారో ఆ సమస్యల నుండి 2024లో బయటపడటం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అప్పులు, లోన్లు వంటివి ముగించాలి అనేటువంటి మీ ప్రయత్నాలు 2024లో సత్ఫలితాలను ఇచ్చును. ధనుస్సు రాశి వారికి 2024 సంవత్సరంలో షేర్లపరంగా ఇన్‌వెస్ట్‌మెంట్ పరంగా చేసేపనులు సఫలమవును. నూతన గృహములు, బంగారం వంటి వస్తువులు కొనడానికి 2024 సంవత్సరం కలసివచ్చేటటువంటి సంవత్సరం అని చిలకమర్తి తెలిపారు.
ధనస్సు రాశి 2024 కెరీర్
2024 సంవత్సరం ధనస్సు రాశి వారికి కెరీర్ పరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 2024 ప్రథమార్ధం జనవరి నుండి జూన్ వరకు ధనుస్సు రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఇదే సమయంలో ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు, వేతనాల పెరుగుదల వంటివి చేకూరును. 2024 ధనూరాశి వారికి ద్వితీయార్థం అనగా జూన్ 2024 నుండి డిసెంబర్ 2024 మధ్య సమయం కెరీర్ పరంగా అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఉద్యోగపరంగా రాజకీయ ఒత్తిళ్ళు, పని ఒత్తిళు ఇబ్బందిపెట్టును. వ్యాపారస్తులకు వ్యాపారంలో శత్రు పీడ ఏర్పడును. మొత్తంమీద ధనస్సు రాశి వారికి 2024 కెరీర్ పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ధనస్సు రాశి 2024 అరోగ్యం
2024 సంవత్సరం ధనస్సు రాశి వారికి ఆరోగ్యపరంగా కలసివచ్చేటటువంటి సంవత్సరం. అరోగ్యమునకు సంబంధించినటువంటి విషయాలలో ఈ సంవత్సరం శుభ ఫలితాలను పొందెదరు. ప్రథమార్థం ధనుస్సు రాశికి ఆరోగ్యపరంగా అనుకూలించును. ద్వితీయార్థంలో చిన్నపాటి అరోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు అధికముగా ఉన్నాయని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ద్వితీయార్థంలో ధనూరాశివారు ఆహార విషయాల్లో ఆహారపు అలవాట్లలో ఆహారపు నియమాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
ధనుస్సు రాశి 2024 పరిహారాలు
ధనూ రాశివారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయుని ఉపాసించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ధనూరాశివారు 2024 సంవత్సరంలో ప్రతి గురువారం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిదని చిలకమర్తి తెలిపారు.