ధనుర్మాస వైభవం: దివ్య ప్రార్థనల మాసం-dhanurmasa vibhavam rituals observances a complete guide ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ధనుర్మాస వైభవం: దివ్య ప్రార్థనల మాసం

ధనుర్మాస వైభవం: దివ్య ప్రార్థనల మాసం

HT Telugu Desk HT Telugu
Dec 28, 2023 03:29 PM IST

సూర్యుడు ధనూరాశిలో సంచరించినటువంటి మాసాన్ని ధనుర్మాసంగా చెబుతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును ప్రార్థించాలి
ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును ప్రార్థించాలి (pixahive)

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు. చైత్రమాసంలో మేషంలోకి ప్రవేశించిన సూర్యుడు, మార్గశిర మాసంలో ధనూరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా సూర్యుడు ధనూరాశిలో సంచరించినటువంటి మాసాన్ని ధనుర్మాసంగా చెప్పబడినట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శివ సాంప్రదాయాన్ని ఈశ్వర ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి శైవులకు కార్తీకమాసం ఎంత విత్రమైనదో మార్గశిర మాసం (ధనుర్మాసం) మహావిష్ణువును పూజించేటటువంటి వారికి అత్యంత ప్రీతికరమైనది. ఈ ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం వంటివి ఆచరించడం ఈ మాసం యొక్క ప్రాధాన్యతను చెబుతుందని చిలకమర్తి తెలిపారు.

ముక్తికి మార్గం మార్గశిరం. శ్రీమన్నారాయణుడి ఆరాధనతోపాటూ పలు పర్వదినాల సమాహారం మార్గశిర మాసం. మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్షీ పూజలు ఉందే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మాసానాం మార్గశీర్నాహం అంటారు కృష్ణభగవానుడు. మార్గశీర్షం అంటే మార్గాలలో శేష్టమైనదనీ, ఉపయోగకరమైనదనీ అర్థం. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితోపాటూ భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం.

దక్షిణాయనానికి చివరగా

దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం ప్రాతఃకాలంలా పవిత్రమైనది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్ధనకు అనువైన మాసం అని చిలకమర్తి తెలిపారు. ఆండాళ్‌ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని పెద్దలు తెలియచేశారు.

ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగిరోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది.

ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం ఉంటుంది. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనూ రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతిరోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడము అంటారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.

ధనుర్మాస వ్రతం:

మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని మొదలుపెడతారు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. ధనుస్సంక్రమణ రోజున నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. వైష్ణవ, సూర్యాలయాలను కూడా సందర్శించడం శుభప్రదం.

ఆధ్యాత్మికంగా మానసిక శక్తినిచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలూ, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని పురాణాలు చెబుతున్నాయని చిలకమర్తి తెలిపారు.

తిరుప్పావై

భక్తవత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది ధనుర్మాసం. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ, అమోఘ సత్ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్‌ ఆ శ్రీరంగ నాయకుని పరిణయమాడిందే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది.

సాక్షాత్‌ భూదేవి, అవతారమూర్తి అయిన ఆండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. తిరు అంటే మంగళకరమైన అని, పావై అంటే మేలుకొలుపు అనే అర్థం వస్తుంది. ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేనురోజులు దద్యోజనం సమర్పించాలి. పెళ్ళీడు అమ్మాయిలు తమ ఇళ్ళముందు ముగ్గులు, గొచ్బిళ్ళతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడు.

గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజూ ఒక కీర్తనతో ఆమె స్వామిని కీర్తించేది. విష్ణుచిత్తుడను బ్రాహ్మణుని ఏకైక పుత్రిక గోదాదేవి. మంచి సౌందర్యరాశి. ఆమె తోటలోని పూలను కోసి రకరకాలైన అందంగా పూలమాలలను కట్టి తను ధరించి అద్దమందు తన ప్రతిబింబమును చూచుకొని మురిసిపోవుచూ ఆ మాలలను పదిలంగా తండ్రికిచ్చేది. ఈ విషయము తెలియని అమహాభక్తుడు శేషశయనుడు శ్రీరంగనాధస్వామి వారికి సమర్పించగా అర్చకులు స్వామివారికి అలంకరించు సమయమందు ఆ మాలలో దాగి ఉన్న ఒక పొడవాటి వెంట్రుకను ఉన్నది గమనించారు. అది స్త్రీ వెంట్రుకని తెలుసుకున్నారు. ఆ మాలలను తెచ్చిన ఆ మహాభక్తుని నానాదుర్భాలాడారు.

అప్పుడు విష్ణుచిత్తుడు సరాసరి ఇంటికి వెళ్ళగా అక్కడ మాలలను అలంకరించుకుని స్వామివారితో మాట్లాడుతున్న తన కూతురిని చూసి అమితమైన ఆగ్రహముతో నిందించి పక్కనే ఉన్న కత్తితో చంపబోగా గోదాదేవి తన ప్రేమ వృత్తాంతమును తండ్రికి తెలియచేసింది.

తండ్రి తన కూతురు మాటలు విశ్వసించక అబద్దమాడుతున్నదని భావించి ఆమెను చంపబోగా అదృశ్యరూపుడుగా ఉన్న స్వామి ప్రత్యక్షమై అమెదెంత మాత్రమూ తప్పులేదని ఆమె ధరించిన మాలలే తనకత్యంత ఇష్టమని తెలియజేసి అందరి సమక్ష్షంలో శ్రీరంగనాథస్వామి గోదాదేవిని వివాహమాడాడు.

మానవ స్త్రీ సాక్షాత్తు దేవున్ని తన భక్తిశ్రద్ధలతో మెప్పించి చివరకు వివాహం ఆడవరకు వదలలేదు. నిష్ట కలిగిన భక్తికి భగవంతుడు తన్మయుడవుతాడు అనడానికి ఈ వృత్తాంతం మనకు చాలు. నాటి నుండి గోదాదేవిని ఆండాళ్‌గా పిలుస్తారు. ఆండాళ్‌ స్వామి వారిని కీర్తించిన కీర్తనలే పాశురాలు.

ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి. అవివాహితులు మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు.

ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయాని కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్రలేచి కాల కృత్యాలను పూర్తి చేసుకుని, తలస్నానం చేసి నిత్య పూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు చెబుతున్నాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.

ధనుర్మాసంలో వివాహాలు జరిపించరు ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయడం శుభమని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చగక్రవర్తి శర్మ తెలిపారు.

వైష్ణవాలయాలను దర్శించడం శుభం

ధనుర్మాసంలో స్వామివారిని ఆవుపాలు, కొబ్బరినీరు, పంచామృతాలతో అఖిషేకిస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈ నెలరోజులపాటూ ఈ వ్రతాన్ని చేయలేనివారు 15 రోజుగాలు గానీ, 8 రోజులు గానీ, 6 రోజులు గానీ, 4 రోజులు గానీ లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారు సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి.

తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాల్లో ఉదయంపూట అర్చనలు చేస్తారు. నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఈ నెల రోజులూ హరిదాసు కీర్తనలతో, జంగమ దేవరలతో, గంగిరెద్దులను అడించేవారితోనూ సందడిగా ఉంటుంది.

ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాల ముగ్గుతో కనులవిందుగా ఉంటాయి. ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతుల సంబరాలతో పల్లెలు సంక్రాంతి పండుగ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner