శనివారం నాడు ఈ వస్తువులను కొంటే దురదృష్టం వెంటాడుతుందట జాగ్రత్త
శనివారం నాడు ఏయే వస్తువులు కొనకూడదో ఇక్కడ తెలుసుకుందాం. శనివారం శని దేవుడికి అంకితమైన రోజు. అందువల్ల ఆ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల శని అశుభ దృష్టి పడుతుందని హిందువుల విశ్వాసం.
శనివారం శని దేవుడికి అంకితమైన రోజు అయినందున ఆ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల శని అశుభ దృష్టి పడుతుందని హిందువుల నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన మత విశ్వాసాలు వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా అన్ని మతాలలోనూ అదృష్టం, దురదృష్టానికి సంబంధించిన ఆచారాలను ప్రజలు విశ్వసిస్తున్నారు. అలా హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కొన్ని నమ్మకాలు పూర్వీకుల నుంచి వస్తున్నాయి. శనివారం కొన్ని రకాల వస్తువులనుకుంటే దురదృష్టం వెంటాడుతుందని భావిస్తారు. శనివారం అనేది హిందూ మతం ప్రకారం శనిగ్రహంతో ముడిపడి ఉన్న రోజు. అనేక సంస్కృతులలో ఈ రోజును అశుభ దినంగానే భావిస్తారు. ఆ రోజున కొన్ని రకాల వస్తువులు కొంటే దురదృష్టం వెంటే వస్తుందని నమ్ముతారు. ఆయా నమ్మకాల ప్రకారం శనివారం నాడు ఏ వస్తువులు కొనకాడదో ఇక్కడ తెలుసుకుందాం.
నల్ల బూట్లు
ఉద్యోగానికి వెళ్లే పురుషులందరికీ నల్లటి బూట్లు తప్పనిసరి. అయితే వాటిని శనివారాల్లో మాత్రం కొనకూడదని పెద్దలు చెబుతారు. పాదరక్షలు అనేవి ఒక వ్యక్తి జీవితంలోని ప్రయాణానికి, అతను వెళ్లే మార్గానికి ప్రతీక. శనివారం నాడు బూట్లు కొనడం వల్ల ప్రతికూల పరిస్థితులు జీవితంలో ఏర్పడే అవకాశం ఉందని ఎంతోమంది నమ్మకం. అలాగే కొంతమంది శనివారం నాడు నల్లటి దుస్తులను, నల్లటి బూట్లను ధరించరు కూడా. హిందూ ధర్మం ప్రకారం నలుపు రంగు దుస్తులు ధరించడం అనేది సంతాపాన్ని సూచిస్తుంది. సంతోషకరమైన సంఘటనలు జరిగినప్పుడు, వేడుకల సమయంలో నలుపు రంగును ధరించరు. ఇది దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. దుఃఖానికి, దురదృష్టానికి ఈ నలుపు రంగు సూచిక అని నమ్ముతారు. అందుకే శనివారం రోజు నల్లని దుస్తులు కొనడం కూడా చాలా ప్రమాదమని చెబుతారు.
ఇనుము
శనివారం రోజు ఇనుము, ఇనుముతో చేసిన వస్తువులు కొనుగోలు చేయరాదని పెద్దలు చెబుతారు. ఇవి దురదృష్టాన్ని వెంట తెస్తాయని చెబుతారు. శని ప్రీత్యర్థం ఇనుము దానం చేయాలని సూచిస్తారు.
కత్తులు, కత్తెర్లు
ఇంట్లో కత్తులు, కత్తెర అవసరం చాలా ఉంటుంది. అయితే ఇలాంటి పదునైన వస్తువులను శనివారం కొనడం చాలా ప్రమాదకరమని పెద్దల నమ్మకం. ఇలా శనివారాల్లో పదునైన వస్తువులు కొంటే...వారి జీవితంలో గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుందని అంటారు. శనివారం కత్తి కొంటే కుటుంబంలో వివాదాలు జరగడం లేదా ప్రమాదాల బారిన పడడం, గాయాలు తగలడం వంటివి జరిగే అవకాశం ఉందని ఒక నమ్మకం ఉంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించాలంటే శనివారం పదునైన వస్తువులు కొనుగోలు చేయకూడదు.
నూనె
శనివారం దేవాలయాలకు వెళ్లి నూనెను దానం చేయమని చెబుతారు. అయితే శనివారం పూట నూనె కొనడం మాత్రం నిషేధం. ఇలా చేస్తే ఆరోగ్యం చెడిపోవడం, ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం జరగచ్చని ఎంతోమంది నమ్మకం. శనివారం నూనె కొంటే ఆ ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యం పాలవుతారని అంటారు. అలాగే ఇందనం కూడా కొనుగోలు చేయరాదని చెబుతారు.
పెన్ను కోసం ఇంక్
ఒకప్పుడు ఇంకు పోసుకొని వాడే పెన్నులే ఉండేవి. ఇప్పుడు రిఫిల్ పెన్నులు వచ్చాయి. కాబట్టి ఈ నమ్మకాన్ని ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం శనివారం రోజున సిరా (ఇంకు) కొనుగోలు చేయడం అశుభమని నమ్మేవారు. ఇది నష్టానికి దారితీస్తుందని అనేవారు. నీలిరంగు సిరాతో శనివారం పూట ముఖ్యమైన పత్రాలపై లేదా ఒప్పందాలపై సంతకం చేయకూడదని కూడా సిఫారసు చేస్తారు.
నల్ల నువ్వులు, ఉప్పు
అలాగే శనివారం నల్ల నువ్వులు కొనుగోలు చేస్తే ఇంట్లో సమస్యలు ఎదురవుతాయని చెబుతారు. వీటిని కూడా కొనుగోలు చేయకూడదని చెబుతారు. నిజానికి శనివారం శని ఆలయంలో దానం చేయవలసిన వాటిలో నల్ల నువ్వులు కూడా ఒకటి. అలాగే శనివారం ఉప్పు కూడా కొనరాదన్నది పెద్దలు చెప్పే సూచన.
చీపురు
శనివారం చీపురు కొనరాదని, చీపురు కొంటే పేదరికంలోకి జారుకుంటారని విశ్వాసం.
ఈ నమ్మకాలు ఇప్పటికీ ఎంతోమంది ఇళ్లల్లో కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రజల్లో నాటుకుపోయిన నమ్మకాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము. పైన చెప్పినవన్నీ కచ్చితంగా అనుసరించాల్సిన పద్ధతులని మేము చెప్పడం లేదు. అనుసరించాలా వద్దా అన్నది మీ వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.