Annavaram Satyanarayana Swamy : అన్నవరం సత్యనారాయణస్వామి మహత్మ్యం.. వ్రతం ప్రాముఖ్యత ఇదే..
Annavaram Satyanarayana Swamy Temple : సంపద, విద్య, శ్రేయస్సు కోసం, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో విజయం సాధించడం కోసం భక్తులు.. శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తారు. అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయానికి.. అక్కడ చేసే వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంది. మరి దీని వెనుక కథ ఏమిటి? స్వామి వారి మహత్మ్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Annavaram Satyanarayana Swamy Temple : “వ్రత్యతే అనేన ఇతి వ్రతం" అని అమరకోశం మనకు తెలియజేస్తోంది. వ్రత్యతే' అంటే నియమముతో కూడిన అని అర్థం వస్తుంది. వ్రతంలో దీక్ష అనేది ప్రాధాన్యంగా ఉంటుంది. భారతదేశంలో సనాతన ధర్మంలో విశేషంగా.. కలియుగంలో సత్యనారాయణ వ్రతం మిక్కిలి ప్రాశస్త్యం చెందిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సత్యనారాయణ స్వామి పూజ, దర్శనము, వ్రతము కలియుగంలో ఆచరించడం ఉత్తమమని ఆయన వెల్లడించారు.
ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడానికి కలియుగంలో సత్యనారాయణ వ్రతమును మించినటువంటి వ్రతం మరొకటి లేదు. నూతనంగా వివాహం జరిగిన వారికి, నూతన గృహప్రవేశం చేసుకున్న వారికి అలాగే ధర్మబద్దమైనటువంటి కోరికను కోరేటువంటి గృహస్తులు.. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే శుభ ఫలితాలు పొందుతారు. ఏ వ్యక్తి అయిన తన జీవితంలో అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకోవడం, సత్యనారాయణస్వామివారి వ్రతం చేసుకోవడం వలన వారి కష్టములు తొలగి.. కచ్చితముగా శుభఫలితాలు పొందుతారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అన్నవరం అనేది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి ఆలయాన్ని ద్రవిడ శైలిలో నిర్మించారు. శ్రీ సత్యదేవస్వామి కీర్తి, గొప్పతనాన్ని స్కాందపురాణం రేవాఖండములో విస్తృతంగా వర్ణించారు. శ్రీ సత్యదేవ స్వామి సతీమణి శ్రీ అనంత లక్ష్మితో ఒకవైపు, శివుడు మరొకవైపు ఉంటారు. అన్ని దివ్యక్షేత్రాల వలే అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి వారు వెలసిన కొండను తాకుతూ పంపా నది ప్రవహిస్తోంది. ఇది సత్యదేవ స్వామి నిజాయితీకి ప్రతీక. అందువలన స్వామి నిత్యం భక్తులకు దీవెనలను అందిస్తారని చెప్తారు. అందుకే ఎలాంటి తారతమ్యం లేకుండా విష్ణు భక్తులు, శివ భక్తులు, వేలాది మంది యాత్రికులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
ఆలయ చరిత్ర
స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం, ఆయన భార్య మేనక.. శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి.. విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకరు భద్రుడు, ఇంకొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారారు. రత్నకుడు కూడా తపస్సు చేసి.. మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసిన రత్నగిరి, లేదా రత్నాచలం కొండగా మారారు.
గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామరాయణం ఏలుబడిలో.. అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన విష్ణువుకు మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీళ్ల ఇద్దరికీ.. ఏకకాలంలో కలలో కనిపించి.. “రాబోవు శ్రావణ శుక్ల విదియ మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్ఠించి సేవించుము” అని చెప్పి మాయమయ్యారు. మరునాడు ఇరువురు కలసి.. తమకు వచ్చిన కలను చెప్పుకుని.. ఖర నామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికి అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా.. ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి.. స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి.. కాశీ నుంచి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతిమహా వైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా 1891లో ప్రతిష్ఠించారు.
రథం రూపంలో ప్రధాన ఆలయం..
స్వామి వారి పీఠం పంచాయతనంలో అలంకరించి ఉండటంవలన స్వామి వారి కీర్తి ప్రతిష్టలు ఇంకా ఎక్కువగా ప్రతిబింబిచాయి. నాలుగు చక్రాలు కలిగిన రథం వలే ప్రధాన ఆలయం నిర్మించారు. ఈ ఆలయం ఆకృతిని అగ్ని పురాణం ప్రకారం నిర్మించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వారి విగ్రహం సుమారు 13 అడుగుల ఎత్తులో (4 మీటర్లు) స్థూపాకారంలో ఉంది. ప్రధాన ఆలయం ముందు కళ్యాణ మండపం అత్యాధునిక శైలిలో నిర్మించారు. ఆలయం రెండు అంతస్థులుగా ఉంటుంది. కింది అంతస్థులో యంత్రం, స్వామి వారి పీఠం ఉంటుంది. యంత్రం నాలుగు వైపులా నలుగురు దేవతలు గణపతి, సూర్యనారాయణస్వామి, బాలా త్రిపురసుందరి, మహేశ్వరస్వామి పంచాయతనం ఉంటుంది. ఒకటవ అంతస్థులో శ్రీ సత్యనారాయణ స్వామి మూల విరాట్ మధ్యలో ఉంటుంది. శ్రీ అనంత లక్ష్మి అమ్మవారు కుడివైపున, శివుడు ఎడమ వైపున ఉంటారు.
త్రిమూర్తుల రూపంలో స్వామి
విగ్రహాలు అన్నీ అందంగా తీర్చిదిద్ది.. బంగారు కవచములతో అలంకరించి ఉంటాయి. శ్రీ రాముడు శ్రీ సత్యదేవ స్వామికి క్షేత్ర పాలకులుగా ఉన్నారు. భక్తులందరు సంపద, విద్య, శ్రేయస్సు కోసం, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో విజయం సాధించడం కోసం శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి త్రిమూర్తుల రూపంలో (బ్రహ్మ, విష్ణు, శివ) అన్నవరం వద్ద రత్నగిరి కొండల మీద ఉన్నారు. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈ రోజు అయినా ఆచరించవచ్చు. విశేషంగా రవి సంక్రమణ పుణ్యకాలము ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో.. అందులోను ప్రత్యేకంగా శ్రావణ పౌర్ణమి, రావణ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి వంటి సమయములలో చేసే.. సత్యనారాయణ వ్రతమునకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని.. సత్యనారాయణస్వామి వ్రతం కథలో ఉంది.
సంబంధిత కథనం
టాపిక్