అధిక మాసం గురించి ఈ 7 పాయింట్లలో మొత్తం తెలుసుకోండి-adhika masam 2023 everything you need to know in 7 points ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Adhika Masam 2023 Everything You Need To Know In 7 Points

అధిక మాసం గురించి ఈ 7 పాయింట్లలో మొత్తం తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Jul 18, 2023 09:30 AM IST

అధిక మాసం గురించి చాలా మందిలో అనేక సందేహాలు ఉంటాయి. వీటికి సంబంధించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ స్పష్టత ఇచ్చారు.

అధిక మాసంలో శ్రీమహావిష్ణువును పూజించి వారి కృపకు పాత్రులు అవ్వండి
అధిక మాసంలో శ్రీమహావిష్ణువును పూజించి వారి కృపకు పాత్రులు అవ్వండి

అధిక మాసం అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? ఈ మాసంలో చేయాల్సినివి, చేయకూడనివి 7 పాయింట్లలో తెలుసుకోండి. అధిక మాసం నేడు ప్రారంభమైంది. దీనిని అధిక శ్రావణ మాసం, పురుషోత్తమ మాసం అనికూడా అంటారు.

  1. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కాలగణన సూర్యచంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుని ఆధారంగా లెక్కగట్టే కాలమానాన్ని సౌరమానం అంటారు. చంద్రుని ఆధారంగా లెక్కగట్టే సంవత్సర గణనాన్ని చంద్రమానమని అంటారు. చాంద్రమానంలో ఒక నెల అంటే 29.53 రోజులు. చాంద్రమానంలో ఒక సంవత్సరం అంటే 354 రోజులు. సంవత్సరానికి 11 రోజుల అంతరం వస్తుంది. సౌరమానం చాంద్రమానంలో ఈ తేడా ప్రతీ నాలుగు సంవత్సరాలలో 31 రోజులుగా ఉంటుంది. ఈ 31 రోజులే అధిక మాసం.
  2. అధిక మాసంలో శుభకార్యాలు ఆచరించరు. వివాహము, ఉపనయనము, గర్భాదానం, గృహారంభం, గృహప్రవేశం వంటివి చేయకూడదు. పితృ కార్యాలను కూడా అధికమాసాన్ని వదిలేసి నిజమాసంలోనే ఆచరించాలి.
  3. అధిక మాసంలో దైవారాధనలు, వ్రతాలు, పితృ ఆరాధన, అధికమాస పూజ, దానధర్మాలు వంటివి ఆచరించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అధిక మాసం మహావిష్ణువుకు చాలా ప్రత్యేకమైనది. గుమ్మడి కాయ, అరటి పండ్లు, పనస కాయలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. పాలు, బెల్లం దానం చేయాలి. 33 అరిసెలు దానం ఇవ్వడం మంచిది.
  4. సాక్షాత్తూ మహావిష్ణువే అధికమాసానికి పురుషోత్తమ మాసమని పేరు పెట్టినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తిని ఆరాధించడం, ఏకాదశి రోజు ఉపవాస వ్రతాలు చేయడం శ్రేష్ఠం. నదీ స్నానాలు, హోమాలు, దానధర్మాలు ఆచరిస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయని విశ్వాసం. ప్రతిరోజూ స్నానమాచరించిన తరువాత విష్ణుమూర్తికి దీపం వెలిగించి ఓం పురుషోత్తమాయ నమ: అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
  5. అధికమాసంలో శుక్ల పక్షమునందు గానీ, కృష్ణపక్షము నందు గానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో తప్పనిసరిగా పుణ్యకార్యాలు ఆచరించాలి. ఇలా చేస్తే అధిక మాస పుణ్య ఫలము లభిస్తుంది. స్తోత్ర పారాయణాలు, తీర్థయాత్రలు చేయాలి.
  6. 18 జూలై 2023 మంగళవారం నుంచి 16 ఆగస్టు 2023 బుధవారం వరకు అధిక శ్రావణ మాసం ఉంటుంది. ఇక నిజ శ్రావణం 17 ఆగస్టు 2023 గురువారం నుంచి 15 సెప్టెంబరు 2023 వరకు ఉంటుంది.
  7. శ్రావణ సోమవార శివారాధన, మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మీ పూజలు, నాగ పంచమి, పుత్రద ఏకాదశి, జంద్యాల పూర్ణిమ (శ్రావణ పూర్ణిమ) వంటి పండగలన్నీ కూడా నిజ శ్రావణ మాసంలో జరుపుకుంటారు.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, పంచాంగకర్త

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel