Garuda puranam: గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులు చేస్తే మరు జన్మలో ఏ విధంగా పుడతారో తెలుసా?
Garuda puranam: మానవుడి జీవితానికి మోక్షం లభించి మరుజన్మ ఉండకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా ఉండాలంటే ఈ తప్పులు చేయకూడదు. గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులు చేస్తే వచ్చే జన్మలో ఏ విధంగా పుడతారో తెలుసా?
Garuda puranam: అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం ఒకటి. వ్యాసమహర్షి దీనిని రచించాడు. వైష్ణవ సంప్రదాయానికి చెందిన పురాణం ఇది. మహావిష్ణువు తన వాహనమైన గరుడకు ఉపదేశించిన పురాణంగా చెప్తారు. అందుకే దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది.
గరుడ పురాణం పేరు వినేందుకు చాలా మంది భయపడతారు. ఇది ఇంట్లో ఉండటం మంచిది కాదని అంటుంటారు. ఇందులో మానవుడు చేసే పాపాలు, వాటికి నరకంలో విధించే శిక్షలు, పాపాలకు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు అవలంభించాల్సిన వివిధ మార్గాలు అనేవి ఈ పురాణంలో స్పష్టంగా ఉంటాయి. ఇందులో మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి.
ఈ పురాణం ప్రకారం ఈ జన్మలో చేసే కర్మల ఆధారంగా వచ్చే జన్మ లెక్కించబడుతుందని అంటారు. మనం చేసే కొన్ని తప్పులు ఫలితంగా మరుజన్మలో ఎలాంటి జీవితం గడపాల్సి వస్తుంది అనేది గరుడ పురాణం తెలియజేస్తుంది. అందుకే గరుడ పురాణం చదవాలంటే చాలామంది భయపడి పోతారు.
ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణం చదువుతారు. ఎందుకంటే వారి దశదిన కర్మ జరిగే లోపు గరుడ పురాణం చదివితే వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని, మరుజన్మ ఉండదని నమ్ముతారు. మనం చేసే కొన్ని తప్పులు వచ్చే జన్మని నిర్ణయిస్తాయి. మంచి పనులు చేస్తే మంచి జీవితం లభిస్తుంది. అదే చెడు పనులు చేస్తే మాత్రం కష్టతరమైన జీవితం జీవించాల్సి వస్తుంది. గరుడ పురాణం ప్రకారం కొన్ని తప్పులు చేస్తే మరుజన్మలో ఎలా పుడతారో తెలుసుకుందాం.
బ్రాహ్మణ హత్య
పంచ మహా పాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి. వీటికి పాప క్షమాపణ అనేది ఉండదు. వాటి ప్రతిఫలాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే. గరుడ పురాణం ప్రకారం బ్రాహ్మణులను చంపిన వ్యక్తి మరుజన్మలో కుక్క, పంది లేదా గాడిదగా పుడతాడట.
గోహత్య
పంచమహా పాతకాలలో ఇది కూడా ఒకటి. గోహత్య చేసిన వ్యక్తి వచ్చే జన్మలో ఒంటె, ఎలుక లేదా సర్పజాతిలో పుడతాడట.
దొంగతనం
బంగారం దొంగిలించిన వ్యక్తి వచ్చే జన్మలో కుష్టు వ్యాధితో బాధపడే వ్యక్తిగా జన్మిస్తాడని అంటారు. అలాగే ఇతర దొంగతనాలు చేసే వ్యక్తి ఎలుకగా పుడతాడు.
గురువుని అగౌరవపరిస్తే
గురువు దైవంతో సమానం అంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవం పొందే వ్యక్తి గురువు. అటువంటి గురువును అగౌరవపరిచిన వ్యక్తులు చెవులు లేని వాళ్ళుగా చెవిటి వాళ్ళగా పుడతారు.
చెడు అలవాట్లు ఉంటే
మద్యం సేవించడం, వ్యభిచారం చేయడం వంటి చెడు అలవాట్లు కలిగిన వ్యక్తులు వచ్చే జన్మలో పురుగులు, కుక్క లేదా పందిగా పుడతారని గరుడ పురాణం చెబుతోంది.
హింసకు చేసేవాళ్ళు
హింసకు పాల్పడే వాళ్ళని, ఇతరులను హింసించి పైశాచికానందం పొందే వాళ్ళు వచ్చే జన్మలో రాక్షసులుగా పుడతారని గరుడ పురాణం చెబుతోంది.
అబద్ధాలు చెప్తే
అబద్ధాలు చెప్పడం, ఇతరులను నమ్మించి మోసం చేయడం, ఇతరులకు ద్రోహం తలపెట్టే వ్యక్తులు మరుజన్మలో కుక్కగా పుడతారు. లోభంతో ప్రవర్తించే వాళ్ళు వచ్చే జన్మలో పాముగా పుడతారని అంటారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్