1098 మాయం కానుందా!-home ministry proposes to merge 109 in 112 vatsalya service ,national న్యూస్
తెలుగు న్యూస్  /  national  /  1098 మాయం కానుందా!

1098 మాయం కానుందా!

HT Telugu Desk HT Telugu
Apr 17, 2022 06:37 AM IST

చైల్డ్ లైన్ 1098 సేవలపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. కేవలం చిన్నారుల భద్రత, సంరక్షణల కోసం సేవలు అందిస్తోన్న 1098 నంబర్ ను కొనసాగించే విషయంలో పలు ప్రతిపాదనల్ని కేంద్రం పరిశీలిస్తోంది.

<p>కేంద్ర హోం మంత్రిత్వ శాఖ</p>
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (HT_PRINT)

బాలల హక్కులు అంటే గుర్తొచ్చే 1098 ఇకపై కనిపించకపోవచ్చు. బాలల సంరక్షణలో దేశం మొత్తం ప్రస్తుతం ఈ నంబరుపైనే ఆధారపడుతోంది. అయితే కేంద్రం ఇటీవల 1098ను 112 ఎమర్జెన్సీలో విలీనం చేయాలని భావిస్తుండటంతో ఆందోన వ్యక్తమవుతోంది. దేశంలో అతిపెద్ద టోల్ ఫ్రీ సర్వీసుగా సేవలందిస్తోన్న చైల్డ్ లైన్ నంబర్ స్థానంలో 112 ద్వారా సమీకృత సేవల్ని అందించాలని యోచిస్తోంది.

ఆపదలో ఉన్నా, అవసరంలో ఉన్నా, నిరాశ్రయులైనా చిన్నారుల్ని ఆదుకోడానికి తక్షణం గుర్తొచ్చేది 1098 చైల్డ్ లైన్ నంబరు మాత్రమే. ప్రపంచంలోనే అతి పెద్ద ఎమర్జెన్సీ నెట్ వర్క్ లలో చైల్డ్ లైన్ నంబర్ ఒకటి. ఏటా 50లక్షలకు పైగా ఎమర్జెన్సీ కాల్స్ చైల్డ్ లైన్ కాల్ సెంటర్ కు అందుతుంటాయి. ప్రభుత్వం ఈ సర్వీసును 112లో విలీనం చేయాలనే ఆలోచన చేస్తుండటంతో ఛైల్డ్ లైన్ భవిష్యత్తుపై బాలల హక్కుల సంఘాలు, ఎన్జీవోలలో ఆందోళన వ్యక్తమవుతోంది. "మిషన్ వాత్సల్య" పథకంలో భాగంగా చైల్డ్ లైన్ సేవల్ని 112లో భాగం చేయాలనే ప్రతిపాదనల్ని కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. 112 ద్వారా పోలీస్, హెల్త్, మహిళల భద్రతల కోసం ఒకే టోల్ ఫ్రీ నంబర్ నిర్వహించాలని భావిస్తున్నారు. కేంద్ర మహిళా, స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ముసాయిదాల్లో టోల్ ఫ్రీ నంబర్ నిర్వహణపై విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా పేర్కొన్నారు. 1098 నిర్వహణ బాధ్యతల్ని తమ శాఖ నుంచి హోంశాఖకు బదలాయించనున్నట్లు గత ఏడాదే స్మృతి ఇరానీ ప్రకటించారు అయితే 1098 సమర్ధవంతంగా పనిచేస్తుండగా 112 లో విలీనం చేయాల్సిన అవసరమేంటనేది ఎన్జీవోల ప్రశ్న.

ప్రస్తుతం చైల్డ్ లైన్ చిన్నారుల్ని రక్షించడమే కాకుండా, కౌన్సిలింగ్, తప్పిపోయిన వారిని గుర్తించడం, వారి సమస్యలు తెలుసుకోవడం, వేధింపులపై ఫిర్యాదులకు అండగా ఉండటం, ఆశ్రయం కల్పించడం వంటి పనులు కూడా నిర్వహిస్తోంది. కోవిడ్ కాలంలో చిన్నారులకు ఆకలి తీర్చలేకపోతున్నామనే కాల్స్ కూడా చైల్డ్ లైన్ అందుకుంది. చిన్నారుల పోషణ కోసం ఆశ్రయం కల్పించాలనే విజ్ఞప్తులతో ప్రభుత్వాలతో కలిసి వారికి ఆహారం అందించే ఏర్పాట్లు జరిగాయి. చైల్డ్ లైన్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ట్రస్టుకు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి నిధులు అందుతాయి. ఇప్పుడు ఈ పథకాన్ని మిషన్ వాత్సల్యగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1996 జూన్ లో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జెరూ బిల్లుమొరియా ఆధ్వర్యంలో 1098 ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సంస్థకు ఐదు నగరాల్లో ఆరు కాల్ సెంటర్స్ ఉన్నాయి. దేశంలోని 35రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 598జిల్లాల్లో 1074 అనుబంధ యూనిట్లను నిర్వహిస్తోంది. వీటిలో 141 రైల్వే స్టేషన్ హెల్ప్ డెస్క్ లు కూడా ఉన్నాయి.

ఏటా లక్షల్లో కాల్స్

2021-22లో చైల్డ్ లైన్ కాల్ సెంటర్ కు 50లక్షల కాల్స్ వచ్చాయి. వాటిలో 1.04లక్షల కాల్స్ బాలలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోరుతూ వచ్చినవి ఉన్నాయి. 18వేలకు పైగా తప్పిపోయిన చిన్నారుల గురించి, లక్షన్నర కాల్స్ చిన్నారుల సంరక్షణ గురించి, కోవిడ్ సమయంలో లక్షా 60వేల కాల్స్ కోవిడ్ గురించి తెలుసుకునేందుకు 1098 అందుకుంది. విస్తృత సేవలు అందిస్తోన్న 1098ను 112లో విలీనం చేస్తే ఆ ప్రభావం చిన్నారుల సంరక్షణ మీద పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Whats_app_banner

టాపిక్