వంట నూనెల ధరలు తగ్గుతాయన్న కేంద్రం
మంట పుట్టిస్తున్న వంట నూనెల ధరల కట్టడికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఓ వైపు ఇండోనేషియా పామాయిల్ ఎగుమతుల్ని నిలిపివేయడంతో ఆ ప్రభావం దేశీయ అవసరాల మీద పడుతుందనే ఆందోళన నేపథ్యంలో సరిపడా నిల్వలున్నాయని కేంద్రం ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే నూనె గింజల ఉత్పత్తి గణనీయంగా పెరగడం వల్ల ఇబ్బందులు ఉండవని భరోసా ఇస్తోంది.
చుక్కలనంటుతోన్న వంట నూనెల ధరల్ని కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో దేశీయ దిగుమతులపై గణనీయంగా ప్రభావం చూపుతోంది. దీంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ అనంతర కాలంలో అన్ని దేశాలు ఎగుమతి సుంకాలను పెంచేయడం, స్థానికంగా భారీగా సెస్సుల్ని వసూలు చేయడంతో ఆ ప్రభావం దిగుమతులపై గణనీయంగా ఉంటోంది. వంట నూనెల ధరలు మూడు నెలల కాలంలో 50శాతానికి మించి పెరగడంతో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది.
ఇండోనేషియాలో పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించడంతో ఆ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడుతోంది. దీని వల్ల దేశంలో వంట నూనెల బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. మరోవైపు దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి కూడా పెరిగినట్లు ప్రకటించింది. గత ఏడాది 112లక్షల మెట్రిక్ టన్నుల నూనె గింజలు ఉత్పత్తి అయితే, ఈ ఏడాది 126లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఆవగింజల ఉత్పత్తిలోనే 37శాతం వృద్ధి నమోదైంది.
దేశంలో వంట నూనెల నిల్వలు కూడా ఆశాజనకంగా ఉన్నాయనే కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం 21లక్షల మెట్రిక్ టన్నుల వంట నూనెలు దేశీయంగా అందుబాటులో ఉన్నాయి. మరో 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతులు మేలో భారత్ చేరుకుంటాయి. వ్యవసాయ, రైతు సంక్షేమ శాక అంచనాల్లో 2022లో వంట నూనెల ఉత్పత్తి మెరుగుపడినట్లు ప్రకటించారు. రాజస్థాన్‌లో 14లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వంట నూనెల ధరల పెరుగుదలను కేంద్ర ఆహార, పౌర సరఫరాల విభాగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. వ్యవసాయ దిగుబడులతో పాటు వంట నూనెల ఉత్పత్తిదారులు, దిగుమతిదారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తోంది. దేశ వ్యాప్తంగా వంట నూనెల ధరల్ని తగ్గించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
దేశీయ దిగుమతుల్లో పామాయిల్‌లో క్రూడ్, రిఫైండ్ దిగుబడులు 62శాతంగా ఉన్నాయి. ఇండోనేషియా, మలేషియాల నుంచి పామాయిల్ దిగుమతి అవుతోంది. ఇండోనేషియా నిషేధం విధించడంతో ప్రత్యామ్నయాలపై కేంద్రం దృష్టి పెట్టింది. పామాయిల్‌తో పాటు బ్రెజిల్, అర్జంటీనాల నుంచి 22శాతం సోయాబీన్ దిగుమతి చేసుకుంటున్నారు. రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి 15శాతం సన్ ఫ్లవర్ దిగుమతి జరుగుతోంది. ఇండోనేషియాతో పాటు, రష్యా, ఉక్రెయిన్ దిగుమతులపై కూడా గణనీయంగా ప్రభావం ఉన్నా భారత్‌కు పెద్ద ఇబ్బంది ఉండదని కేంద్రం చెబుతోంది.
ప్రపంచంలో అత్యధికంగా వంట నూనె గింజల్ని పండించే దేశాల్లో భారత్ ఒకటి, దేశంలో వ్యవసాయ ఆధారిత ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉండటం వల్ల స్థానికంగా ఇబ్బందులు ఉండవని చెబుతోంది. దేశంలో 37.14 మిలియన్ టన్నుల నూనెగింజల ఉత్పత్తి జరుగుతోందని అవి దేశీయ అవసరాలను తీర్చగలవని చెబుతున్నారు.
రోజువారీ పరిశీలన
వంట నూనెల ధరల పెరుగుదలపై రోజువారి సమీక్షలు నిర్వహిస్తున్నారు. కృత్రిమ కొరతను సృష్టించడం వల్ల ధరలు పెరుగుతున్నాయని, ధరల నియంత్రణ, స్థిరీకరణతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం అన్ని చర్యలు చేపడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం ధరల నియంత్రణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని, నిత్యావసర వస్తువుల చట్ట ప్రకారం ధరలను అదుపులో ఉంచేందుకు , ఎమ్మార్పీలను గణనీయంగా తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది.
టాపిక్