WPI inflation: జూన్‌లో 15.18 శాతానికి తగ్గిన హోల్‌సేల్ ధరల ఆధారిత ఇన్‌ఫ్లేషన్
WPI inflation: జూన్‌లో హోల్ సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 15.18 శాతానికి తగ్గింది.
న్యూఢిల్లీ, జూలై 14: ఆహార వస్తువుల ధరలు పెరిగినప్పటికీ, తయారీ, ఇంధన వస్తువుల ధరలు తగ్గడంతో జూన్‌లో టోకు (హోల్ సేల్) ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 15.18 శాతానికి తగ్గింది.
టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (WPI inflation) గత నెలలో రికార్డు స్థాయిలో 15.88 శాతానికి పెరిగింది. గతేడాది జూన్‌లో 12.07 శాతంగా నమోదైంది.
జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మూడు నెలలుగా పెరుగుతున్న ట్రెండ్‌ను నిలిపివేసింది. అయినప్పటికీ గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన పెరుగుదల.. వరుసగా 15వ నెలలో కూడా రెండంకెల స్థాయిలోనే ఉంది.
జూన్‌లో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 14.39 శాతంగా ఉంది. కూరగాయలు, పండ్లు, బంగాళాదుంపల ధరలు గత ఏడాది కాలంతో పోలిస్తే భారీగా పెరిగాయి.
మే నెలలో ఆహార వస్తువుల టోకు ధరల ద్రవ్యోల్బణం 12.34 శాతంగా ఉంది.
కూరగాయల ధరల పెరుగుదల రేటు 56.75 శాతం కాగా, బంగాళదుంపలు, పండ్లలో ఇది వరుసగా 39.38, 20.33 శాతంగా ఉంది.
ఇంధనం, విద్యుత్తు ద్రవ్యోల్బణం 40.38 శాతంగా ఉండగా, తయారీ ఉత్పత్తులు, నూనె గింజలలో ఇది వరుసగా 9.19 శాతం, 2.74 శాతంగా ఉంది.
జూన్‌లో ముడి పెట్రోలియం, సహజ వాయువు ద్రవ్యోల్బణం 77.29 శాతంగా ఉంది.
ద్రవ్య విధానాన్ని రూపొందించడానికి రిజర్వ్ బ్యాంక్ ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తుంది. వడ్డీని నిర్ణయించే ద్రవ్య విధాన కమిటీ తదుపరి సమావేశం ఆగస్టు 2-4 తేదీలలో జరుగుతుంది.
రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా ఆరో నెలలో రిజర్వ్ బ్యాంక్ కంఫర్ట్ లెవెల్ కంటే ఎగువన ఉంది. జూన్‌లో 7.01 శాతంగా ఉంది.
జూన్ త్రైమాసికం (క్యూ1)లో ద్రవ్యోల్బణం 7.5 శాతంగానూ, సెప్టెంబర్ త్రైమాసికంలో (క్యూ2) 7.4 శాతంగానూ, డిసెంబరు త్రైమాసికంలో (క్యూ3) 6.2 శాతానికి, ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం (క్యూ4)లో 5.8 శాతానికి తగ్గుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.
అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ గత రెండు నెలల్లో కీలక వడ్డీ రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది.
రిజర్వ్ బ్యాంక్ కూడా 2022-23కి ద్రవ్యోల్బణం అంచనాను 100 బేసిస్ పాయింట్లు పెంచి 6.7 శాతంగా అంచనా వేసింది.
టాపిక్