ప్రాంతీయ నాయకులపై బీజేపీ చిన్నచూపు-why regional leaders are not emerging within the bjp s ranks ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Why Regional Leaders Are Not Emerging Within The Bjp S Ranks

ప్రాంతీయ నాయకులపై బీజేపీ చిన్నచూపు

HT Telugu Desk HT Telugu
Oct 31, 2023 01:18 PM IST

Opinion: ‘బీజేపీకి ప్యాన్‌ ఇండియా నాయకుడు ఉంటే చాలా? రాష్ట్రాల్లో బలమైన నాయకులు అవసరం లేదా?’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ జి.మురళీకృష్ణ రాజకీయ విశ్లేషణ.

రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వంపై విశ్లేషణ
రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వంపై విశ్లేషణ (PTI/HT)

బొమ్మా... బొరుసు! నరేంద్రమోదీ... అమిత్‌ షా!! బీజేపీలో ఈ ఒక్క నాణమే చెల్లుతోంది. దేశంలో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఈ రెండు పేర్లే వినపడుతున్నాయి. ఇప్పుడు ప్యాన్‌ ఇండియా సినిమాల ట్రెండు నడుస్తున్నట్టే రాజకీయాల్లోనూ బీజేపీ ప్యాన్‌ ఇండియా నాయకత్వ ట్రెండును తీసుకురావాలని చూస్తోంది! హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఈ ఫార్ములా బెడిసి కొట్టినా, మోదీని బాహుబలిగా చూపిస్తూ, ఆయన చరిష్మాతో దేశం నలుమూలలా ఓటర్లను ఆకర్షించాలని ఆ పార్టీ పలు ప్రణాళికలను రూపొందిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

గతంలో అస్సాం, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రయోగం సత్ఫాలితాలివ్వడంతో దీన్ని మరోసారి ప్రస్తుతం తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రల శాసనసభ ఎన్నికల్లో ప్రయోగిస్తున్నారు. బీజేపీకి ప్యాన్‌ ఇండియా నాయకుడు ఉంటే చాలా? రాష్ట్రాల్లో బలమైన నాయకులు అవసరం లేదా? అనేది డిసెంబర్‌ 3వ వెలువడే ఫలితాల్లో తేటతెల్లమవుతుంది.

అధినాయకత్వమే అంతా

నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లోనూ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ప్రచారం చేస్తోంది. ప్రధాన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రాజస్థాన్‌లో మాజీ ముఖ్యమంత్రి వసుందరా రాజే, ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ నాయకత్వాలకు ఆ పార్టీ అధిష్టానం చెక్‌ పెడుతోంది. ఏ రాష్ట్రంలోనూ ఏ ఒక్క ఒక బలమైన నాయకుడినీ ప్రజల ముందు ఉంచడం లేదు. 2014, 2019 సాధారణ ఎన్నికలతో పాటు ఈ పదేళ్ల కాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఫలించిన మోదీ పాపులారిటీనే వ్యుహాత్మకంగా తెరమీదకు తీసుకొస్తున్నారు. కేవలం మోదీ బొమ్మతోనే ఈ ఎన్నికలల్లో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది కాకుండా కమలం పువ్వును చూసి ఓటేయమని ఓటర్లను కోరుతోంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ బొమ్మతో కాంగ్రెస్‌ అచ్చం ఇలాంటి రాజకీయమే సాగించింది. అప్పుడు కాంగ్రెస్‌ను బీజేపీతో సహా ఇతర ప్రతిపక్షాలు ఏకఛత్రాధిపత్యం పార్టీ అని విమర్శించాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాష్ట్ర నాయకులకు అధిక అధికారాలు ఇస్తూ అభ్యర్థుల ఎంపిక కూడా వారికే వదిలేస్తుంటే అందుకు భిన్నంగా బీజేపీ మాత్రం నాయకులందరినీ మోదీ పాపులరిటీ అనే గుంజకు కట్టేస్తోంది.

నాయకుడికి ఉండే ప్రజాదరణే ఆ పార్టీకి పెద్ద సంపద. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యం నరేంద్ర మోదీ ప్రజాదరణతోనే ముడిపడి ఉందనడంలో సందేహం లేదు. అయితే వివిధ రాష్ట్రల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. బీజేపీకి శక్తివంతమైన పార్టీ నిర్మాణంతో పాటు అంకితభావంతో పని చేసే కార్యకర్తలూ ఉన్నారు. అయితే వారికి రాష్ట్ర స్థాయిలో దిశా నిర్దేశం చేసే నాయకులు లేనిలోటు కొట్టొచ్చినట్టు కనపడుతోంది. నలుగురు నాయకులు నాలుగు దిక్కులు అన్నట్టు ఉండడంతో సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితులను బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలో వైఫల్యం

తెలంగాణలో మొదటి నుంచి బీజేపీ అధిష్టానం పప్పులో కాలు వేస్తోంది. వామపక్ష భావజాలం ఎక్కువగా ఉన్న తెలంగాణ గడ్డపై కమ్యూనల్‌ ఎజెండాతో ముందుకెళ్లడం అంత సులభం కాదు. అయినా, ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేయకుండా హిందువులను తమ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలు చేసి బీజేపీ విఫలమైంది. ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదంతో తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బీజేపీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లాగే తెలంగాణ ఏర్పాటులో తాము కూడా పోషించిన కీలక పాత్రను ప్రజలకు వివరించడంలో విఫలమయ్యింది. ఒక ఓబీసీ దేశ ప్రధానమంత్రిగా ఉన్నా దేశంలో బీసీలకు సరైన న్యాయం జరగలేదనే అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ నాయకుడైన బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు తెలంగాణకు బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తామని అమిత్‌ షా ప్రకటిస్తే ఎవరు నమ్ముతారు?

తెలంగాణలో 80 శాతానికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి బీసీ నాయకుడు అవసరమని భావిస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించారు? ఆయన స్థానంలో కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా ఎందుకు తీసుకొచ్చారో పార్టీ కార్యకర్తలకు సైతం బీజేపీ అధిష్టానం స్పష్టం చేయలేకపోయింది. ఐదు విడతలు ప్రజాసంగ్రామ యాత్ర చేసి, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్న సంజయ్‌ చేత ఆ యాత్రను ఎందుకు మధ్యలోనే ముగింపచేసారో కూడా ఎవరికీ తెలియదు! మునుగోడులో ఓటమి తర్వాత తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారింది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలతో బీజేపీ రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయిందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ఉత్తరాది రాష్ట్రాల్లోనూ

తెలంగాణ వంటి పరిణామాలే ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను, రాజస్థాన్‌లో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేని పక్కనపెట్టారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కూడా పక్కనపెట్టి మోదీ బొమ్మతో గెలవాలని పార్టీ హైకమాండ్‌ భావించి ఆయనకు ప్రత్యామ్నాయంగా పలు నేతలను ముందుకు తేవాలని చూసినా, రాష్ట్రంలో ఆయన బలమైన నేతగా ఎదగడంతో ఆయనను పక్కన పెట్టడానికి జంకుతోంది. మధ్యప్రదేశ్‌లో ప్రచార బాధ్యతలు ఇవ్వలేదని అలకబూనిన ఆ రాష్ట్ర మాజీ సీఎం ఉమాభారతి రాజకీయాలను వీడి హిమాలయాలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక ఎన్నికల్లోనూ బలమైన నేతలను బీజేపీ అధిష్టానం ఇలాగే పక్కనపెట్టి భంగపడింది.

రాజస్తాన్‌లోనూ విఫల ప్రయోగం

రాజస్థాన్‌లో 2003 తర్వాత ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు. ఇక్కడ ప్రభుత్వ మార్పు సంప్రదాయం ఈ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అంశమే. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే ఇరవై ఏళ్లలో మొదటిసారి రాజస్థాన్‌లో అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. కాంగ్రెస్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ పథకాలతో, వ్యూహాలతో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్‌లో ఏడు ప్రధాన ప్రాంతాలైన మేవత్‌, జైపూర్‌, షెఖవటి, మేవర్‌, హడోటి, అజ్మీర్‌, మెర్వరాలో ఎక్కడ చూసినా సీఎం అశోక్‌ గెహ్లోత్‌ బ్యానర్లే దర్శనమిస్తున్నాయి. గెహ్లోత్‌ అమలు చేస్తున్న పథకాలతో పాటు అనేక విషయాల్లో కాంగ్రెస్‌ బీజేపీ కంటే మెరుగైన స్థానంలో ఉంది. బీజేపీ నాయకులు చేస్తున్న పరివర్తన్‌ యాత్రలకు జనం నుంచి ఆశించినంత స్పందన రావడం లేదు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా బీజేపీ ఎత్తుకున్న ‘నహి సహేగా రాజస్థాన్‌’ (రాజస్థాన్‌ సహించదు) నినాదం కూడా ప్రజల్లోకి విజయవంతంగా వెళ్లడంలేదు.

జాట్లు, ఓబీసీలు, ఎస్టీలు, మహిళలల్లో జనాకర్షణ కలిగిన వసుంధర రాజేను పక్కనపెట్టడంతో బీజేపీ కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొని ఉంది. కాంగ్రెస్‌ మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ వారికి చేరువవుతోంది. రాష్ట్ర మహిళలను ఆకట్టుకోవడానికి బీజేపీకి ఉన్న ఒకే ఒక అవకాశం వసుంధర రాజే నాయకత్వం. దీన్ని కూడా బీజేపీ పక్కన పెట్టడంతో రాష్ట్రంలో పార్టీ కేడర్‌ విస్మయానికి లోనవుతున్నారు. రాష్ట్ర పార్టీలో వసుంధర రాజేకు వ్యతిరేకంగా ఉన్న నాయకులకు క్షేత్రస్థాయిలో ప్రజాధారణ లేదు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ సీఎం గెహ్లోత్‌కు సరితూగే పరిస్థితులు లేవు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, తన దక్షిణ కోటా పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎన్ని స్థానాల్లో బీజేపీని గెలిపిస్తారనేది సందేహమే. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ మేఘవాల్‌ ఎస్సీ సామాజికవర్గంలో జనాకర్షణ కలిగిన నాయకుడిగా ఉన్నా వారు తరతరాలుగా కాంగ్రెస్‌కే మద్దతుగా ఉంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఎస్సీలు కాంగ్రెస్‌ పక్షానే ఉండే అవకాశాలున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్‌కు చెక్

ఛత్తీస్‌గఢ్‌ బీజేపీలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. 15 ఏళ్లు నిరాటంకంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ సీఎం రమణ్‌సింగ్‌కి చెక్‌ పెట్టాలని పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఆయనకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అరుణ్‌ సావోతో పాటు పార్టీ సీనియర్‌ నేతలను బ్రిజ్‌ మోహన్‌ అగర్వాల్‌, అజయ్‌ చంద్రశేఖర్‌, ప్రేమ్‌ ప్రకాశ్‌ పాండే, నారాయణ్‌ చందేల్‌, సరోజి పాండేలను బీజేపీ అధిష్టానం ప్రోత్సహిస్తోంది. ఈ పరిణామాలతో రాష్ట్ర బీజేపీలో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నాయకులు పార్టీలో ఆధిపత్య ధోరణితో కొనసాగుతూ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం చేయకుండా, తమ సొంత నాయకుల మీదే పోరాటం చేస్తుండడంతో కాలం కరిగిపోయింది. ఫలితంగా కాంగ్రెస్‌ సీఎం భూపేశ్‌బఘేల్‌కి సరితూగే నాయకుడే బీజేపీలో లేకుండా పోయారు. ఒకవేళ బీజేపీ తమ నాయకత్వ సమస్యను పరిష్కరించుకొని ఉంటే ఛత్తీస్‌గఢ్‌లో వారి విజయం నల్లేరు మీద నడకే అయ్యేది.

పీపుల్స్‌పల్స్‌ బృందం తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసినప్పుడు ఎక్కువ మంది 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఓటేస్తామని చెప్పారు. అదే సమయంలో ప్రధానమంత్రి బొమ్మ చూసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయమని స్పష్టంగా వెల్లడించారు. రాజకీయాల్లో పోటీ వాతావరణం పెరిగిన నేపథ్యంలో సృజనాత్మక వ్యూహాలతో ముందుకు వస్తేనే రాజకీయ పార్టీలకు భవిష్యత్తు ఉంటుంది. ప్రాంతీయంగా బలమైన నాయకులను ఎదగనీయకుండా చేసి, కేవలం మోదీ ప్రజాదరణపైనే ఆధారపడటం ఈ ఎన్నికల్లో బీజేపీని ఒడ్డున పడేయకపోవచ్చు! పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగూ మనదే విజయమనే మితిమీరిన విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం కావొచ్చు!!

- జి.మురళికృష్ణ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email: peoplespulse.hyd@gmail.com

జి.మురళీ కృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, రీసెర్చర్
జి.మురళీ కృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, రీసెర్చర్

డిస్‌క్లెయిమర్: ఈ వ్యాసంలో తెలియపరిచిన విశ్లేషణలు, అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం లేదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి. హెచ్‌టీ తెలుగువి కావు.)

WhatsApp channel