Paytm CEO : పేటీఎం సీఈఓగా.. మళ్లీ విజయ్ శేఖర్‌కే పగ్గాలు
Paytm CEO : పేటీఎం సీఈఓగా విజయ్ శేఖర్ శర్మ తిరిగి నియమితులయ్యారు. ఆయనకి 99.6శాతం షేర్‌హోల్డర్ల మద్దతు లభించింది.
Paytm CEO : పేటీఎం మేనేజింగ్ డైరక్టర్, సీఈఓ బాధ్యతలు మళ్లీ విజయ్ శేఖర్ శర్మకే దక్కాయి. సీఈఓగా విజయ్ శేఖర్‌కు షేర్‌హోల్డర్ల నుంచి 99.67శాతం మద్దతు లభించడం విశేషం.
"పేటీఎం లిస్టింగ్ తర్వాత జరిగిన తొలి ఏజీఎంలో షేర్‌హోల్డర్ల నుంచి విశేష స్పందన లభించింది. షేర్హోల్డర్లకు ధన్యవాదాలు. భారీ మద్దతుతో.. మన ఎండీ- సీఈఓ విజయ్ శేఖర్ శర్మ.. సంస్థని ముందుండి నడిపించనున్నారు. 22వ ఏజీఎంలో పేటీఎం చేసిన తిర్మానాలన్నీ గట్టెక్కాయి," అని పేటీఎం ట్వీట్ చేసింది.
వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ 22వ ఏజీఎం(యాన్యువెల్ జనరల్ మీటింగ్)లో భాగంగా.. సీఈఓ ఎంపికకు ఓటింగ్ జరిగింది. వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్‌లో పేటీఎం భాగంగా ఉంది.
Vijay Shekhar Sharma : "దాదాపు 100శాతం ఓట్లు విజయ్ శేఖర్‌కే దక్కాయి. ఇది సంస్థపై షేర్‌హోల్డర్ల నమ్మకానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. సంస్థపై వారికున్న నమ్మకాన్ని ఇది చూపిస్తోంది. ఈ యాజమాన్యంతోనే కంపెనీ ప్రాఫిట్లోకి వెళుతుందని వారు విశ్వసిస్తున్నారు," అని పేటీఎం సంస్థ.. అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
గతేడాది నవంబర్‌లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది పేటీఎం. అప్పటి నుంచి దాదాపు 60శాతం వాల్యూయేషన్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో పేటీఎం ఆర్థిక వ్యవహారాలు, యాజమాన్యంపై షేర్హోల్డర్లలో అసంతృప్తి నెలకొన్నట్టు వార్తలొచ్చాయి. విజయ్ శేఖర్‌ను సీఈఓగా తప్పిస్తే.. పేటీఎం మెరుగుపడుతుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ శేఖర్ని తిరిగి ఎన్నుకుంటారా? లేదా? అన్న అనుమానాలు మార్కెట్లో నెలకొన్నాయి. తాజా పరిణామాలతో.. ఆ అనుమానాలకు చెక్ పడింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి.. పేటీఎం షేరు విలువ రూ. 771గా ఉంది.
సంబంధిత కథనం