Gujarat AAP MLAs: గుజరాత్‍లో ఆప్‍కు అప్పుడే జంపింగ్‍ల టెన్షన్! ఆసక్తికరంగా ఎమ్మెల్యే కామెంట్స్-tension for aam aadmi party in gujarat aap mla says proud of pm ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Tension For Aam Aadmi Party In Gujarat Aap Mla Says Proud Of Pm

Gujarat AAP MLAs: గుజరాత్‍లో ఆప్‍కు అప్పుడే జంపింగ్‍ల టెన్షన్! ఆసక్తికరంగా ఎమ్మెల్యే కామెంట్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 11, 2022 10:44 PM IST

Gujarat AAP MLAs: గుజరాత్‍లో ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళతారన్న ఊహాగానాలు అధికమయ్యాయి. ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వాటికి మరింత ఊతమిచ్చాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (ANI Photo)

ట్రెండింగ్ వార్తలు

Gujarat AAP MLAs: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆమ్‍ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP) ఆశించిన స్థాయిలో సత్తాచాటలేకపోయింది. మొత్తంగా ఆ పార్టీ తరఫున ఐదుగురు అభ్యర్థులు ఎమ్మేల్యేలుగా గెలిచారు. అయితే, గుజరాత్ ఎన్నికల ద్వారా జాతీయ పార్టీకి కావాల్సిన అర్హతను ఆమ్ఆద్మీ సాధించింది. కానీ, ఆ రాష్ట్రంలో ఆప్‍కు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు జీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో 156 సీట్లను దక్కించుకొని ఘన విజయం సాధించిన బీజేపీ.. రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యే భూపత్ బయానీ (Bhupat Bhayani) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పూర్తి వివరాలు ఇవే..

ప్రజాభిప్రాయం కోరతా..

విసావదర్ నియోజకవర్గం నుంచి ఆమ్ఆద్మీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే భూపత్ భయానీ.. ఆదివారం రోజున బీజేపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందించారు. తాను బీజేపీలో చేరడం లేదని వెల్లడించారు. అయితే వివరణ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. పార్టీ మారాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నానన్నట్టుగా ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఓటర్లతో, మద్దతుదారులతో చర్చిస్తానని అన్నారు.

ఆమ్‍ఆద్మీలో తనకు ఎలాంటి సమస్య లేదని, కానీ 25 సంవత్సరాల పాటు బీజేపీలో ఉన్న తాను ఆప్‍లో ఈ ఏడాదే చేరానని భయానీ చెప్పారు. “మోదీ నాయకత్వంలోనే మనమందరం అభివృద్ధి చెందాం. దాన్ని ఎవరూ కాదని అనలేరు. నేను ఇప్పటికీ మన ప్రధాన మంత్రిని చూసి గర్వపడుతున్నా” అని ఆప్ ఎమ్మెల్యే భూపత్ భయానీ అన్నారు. మొత్తంగా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్టు మాట్లాడారు.

ఐదుగురిలో ముగ్గురు బీజేపీ నుంచే..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ తరఫున చైతర్ వసావా, హేమంత్ ఖవా, ఉమేశ్ మకావనా, సుధీర్ వఘానీ, భూపత్ భయానీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. అందులో ముగ్గురు ఎన్నికల ముందు బీజేపీ నుంచి ఆప్‍కు వచ్చినవారే.

కాగా, గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. బీజేపీ మాత్రం మునుపెన్నడూ లేని విధంగా ఘన విజయం సాధించింది. దీంతో ఆప్ ఎమ్మెల్యేలు.. అధికారం చేపట్టిన కమలం పార్టీ వైపు చూస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ విమర్శలు

గుజరాత్‍లో ఆమ్‍ఆద్మీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలు రావటంతో కాంగ్రెస్ విమర్శలు మొదలుపెట్టింది. ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఓ కాంగ్రెస్ నేత ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనికి కాంగ్రెస్ ప్రముఖ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) స్పందించారు. “నేను ఆశ్చర్యపోవడం లేదు. నేను ఇంతకు ముందు చెప్పినట్టే.. ఆప్ అంటే కాంగ్రెస్‍ సపోర్టును దెబ్బతీసే బీజేపీ బీ టీమ్. నేను కరెక్టేనని మరోసారి రుజువవుతోంది” అని దిగ్విజయ్ సింగ్ రాసుకొచ్చారు.

IPL_Entry_Point