Supreme Court : కుర్తా పైజమా, టీ షర్ట్‌లు వేసుకుని వాదించలేరు.. సుప్రీంకోర్టు కామెంట్స్-supreme court refuses to entertain petition seeking relaxations for advocates dress code in summers know in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court : కుర్తా పైజమా, టీ షర్ట్‌లు వేసుకుని వాదించలేరు.. సుప్రీంకోర్టు కామెంట్స్

Supreme Court : కుర్తా పైజమా, టీ షర్ట్‌లు వేసుకుని వాదించలేరు.. సుప్రీంకోర్టు కామెంట్స్

Anand Sai HT Telugu
Sep 18, 2024 12:36 PM IST

Supreme Court : వేసవి నెలల్లో న్యాయవాదులు నల్లకోట్లు ధరించడం నుండి మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టులలో డ్రెస్ కోడ్ హుందాతనాన్ని సూచిస్తుందని ధర్మాసనం పేర్కొంది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

వేసవి నెలల్లో కోర్టుల్లో నల్లకోట్లు, గౌనులు ధరించకుండా న్యాయవాదులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జెబి పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కోర్టులో హుందాతనంగా ఉండాలని నొక్కి చెప్పింది.

'అంతిమంగా ఇది అలంకారానికి సంబంధించిన విషయం. మీరు సరిగ్గా దుస్తులు ధరించాలి. మీరు కుర్తా-పైజామా లేదా షార్ట్‌లు, టీ-షర్ట్‌లలో వాదించలేరు.' అని బెంచ్ వ్యాఖ్యానించింది.

వేసవిలో తప్పనిసరిగా నల్లకోటు, గౌను వస్త్రధారణ నుండి సడలింపు కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి పిల్ దాఖలు చేశారు. అయితే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర బార్ కౌన్సిల్‌లు, కేంద్రానికి ప్రాతినిధ్యాన్ని సమర్పించేందుకు త్రిపాఠికి కోర్టు అనుమతించింది.

విచారణ సందర్భంగా భారతదేశం అంతటా వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా న్యాయవాదులు వేసవిలో కోట్లు, గౌనులు ధరించకుండా మినహాయించాలని త్రిపాఠి వాదించారు. రాజస్థాన్ వాతావరణానికి బెంగళూరుకు చాలా తేడా ఉందని చెప్పారు. అయితే అలాంటి నిర్ణయాలను ఆయా బార్ కౌన్సిళ్లకే వదిలేయాని సీజేఐ చెప్పారు. పిల్‌ను స్వీకరించడానికి కోర్టు మెుగ్గు చూపలేదు. దీంతో దానిని ఉపసంహరించుకునేందుకు త్రిపాఠి అనుమతి కోరగా మంజూరైంది.

పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయవాదిని సుప్రీంకోర్టు మందలించింది. కోర్టులో హుందాతనాన్ని పాటించాలని, సరైన దుస్తుల్లో రావాలని చెప్పింది. వాస్తవానికి బ్లాక్ కోట్స్, గౌన్లకు మినహాయింపు ఇవ్వాలని, ఇతర రంగులను అనుమతించాలని పిటిషన్‌లో కోరారు. ఇందుకు వాతావరణమే కారణమని పేర్కొన్నారు. ఇప్పటికే గౌన్‌కు మినహాయింపు లభించింది. కుర్తా-పైజామా లేదా షార్ట్స్, టీ-షర్ట్ ధరించి మీరు వాదించలేరని, కొంత మర్యాద కలిగి ఉండటం చాలా ముఖ్యమని కోర్టు చెప్పింది.

టాపిక్