Heat In Monsoon : రానురాను వానాకాలంలో వేసవి పరిస్థితులు.. దేశంలో పెరగనున్న ఎండాకాలం!
Weather News : వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఎప్పుడు వానలు పడుతున్నాయో.. ఎప్పుడు అధిక వేడి ఉంటుందో అర్థంకాని పరిస్థితి. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కానుంది. ఈ మేరకు ఓ అధ్యయనం వెల్లడించింది.
భారతదేశంలోని చాలా జిల్లాలు వర్షాకాలంలో వర్షాలు లేని రోజులలో వేసవి పరిస్థితులను అనుభవిస్తున్నాయని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. రానురాను ఈ పరిస్థితి మరింత ఘోరంగ తయారు కానుంది. వానాకాలంలోనూ వేసవి పరిస్థితులు వస్తాయంటున్నారు నిపుణులు. వర్షాలు పడకుంటే తేమతో కూడిన వేడి పరిస్థితి ఎక్కువ కానున్నాయి. దీనితో జనాలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి కానున్నారు.
తీవ్రమైన హీట్ వేవ్
మేనేజింగ్ మాన్‌సూన్స్ ఇన్ ఎ వార్మింగ్ క్లైమేట్ అనే నివేదిక ప్రకారం భారతదేశంలోని 84 శాతానికి పైగా జిల్లాలు తీవ్రమైన హీట్‌వేవ్‌కు గురవుతున్నాయి. భారతదేశంలోని చాలా జిల్లాలు వర్షాకాలంలో కూడా చాలా తేమతో కూడిన వేడిని చూస్తున్నాయి. అదేవిధంగా దాదాపు 70 శాతం జిల్లాలు తీవ్ర వర్షపాతం తీవ్రతను కూడా అనుభవిస్తున్నాయి.
పెరగనున్న వేసవి కాలం
'భారతదేశంలో వర్షపు రోజులకు మించి రుతుపవన కాలాల్లో వేసవి కాలం పొడిగించబడుతుందని మేం ఊహిస్తున్నాం. మొత్తంమీద జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరులో భారతదేశం పొడిగించిన వేసవి లాంటి పరిస్థితిని చూస్తోందని మేం నమ్ముతున్నాం.' అని అధ్యయనం చెప్పింది.
పెరిగిన హీట్ వేవ్
భారతదేశంలో గత మూడు దశాబ్దాల్లో మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తీవ్రమైన హీట్ వేవ్ 15 రెట్లు పెరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత వాతావరణ విభాగం, మధ్యస్థ శ్రేణి వాతావరణానికి సంబంధించిన యూరోపియన్ సెంటర్ నుండి పొందిన సమాచారం ఆధారంగా గత దశాబ్దంలో చూసుకుంటే.. భారతదేశంలో తీవ్రమైన వేడిని 19 రెట్లు పెరిగిందని పరిశోధన బృందం నిర్ధారించింది.
ఈ అధ్యయనాన్ని పంచుకున్న ఐపీఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబిలిటీ ప్రాక్టీస్ హెడ్ అబినాష్ మొహంతి మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు 0.6 డిగ్రీలు పెరగడం వల్ల విపరీతమైన వేడి, వర్షపాతం ఏర్పడిందని చెప్పారు. ఇది మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితలం వేడెక్కడంతో సంబంధం కలిగి ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే ఎన్నో ఘటనలు
కేరళలో కొండచరియలు విరిగిపడటం ఎడతెగని వర్షాల గురించి కూడా మొహంతి పేర్కొన్నారు. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు వాతావరణంలో మార్పులకు నిదర్శనం అని తెలిపారు. 2036 నాటికి 10 మంది భారతీయులలో 8 మంది విపరీతమైన సంఘటనలకు గురవుతారని అధ్యయనం సూచిస్తుంది.
ఈ నెలలపై ప్రభావం
వేసవి పెరగడం లాంటి పరిస్థితి దేశంలో జున్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు విస్తరిస్తోందని అధ్యయనం చెబుతోంది. సాదాసీదా, కొండ ప్రాంతాలలోని జిల్లాలు ఈ పోకడలను ఎక్కువగా చూసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవి జీవితాలు, జీవనోపాధి, ఆర్థిక రంగాలపై ప్రభావాలను చూపుతాయి.
మనిషి చేసే తప్పులే
దేశంలో 55 శాతానికి పైగా భూ వినియోగం, భూ కవర్ మార్పు హాట్‌స్పాట్ జిల్లాల్లోనే కేంద్రీకృతమైందని కనుగొంది. వాతావరణ నమూనాలలో పెద్ద ఎత్తున మార్పుల వెనుక మానవ కార్యకలాపాలు ప్రధాన కారణం. ప్రకృతికి మానవుడు కలిగించే ఆటంకం కూడా ఇందుకు ఓ కారణంగా చెబుతున్నారు. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ వంటి కొన్ని హాట్‌స్పాట్ రాష్ట్రాలు విపరీతమైన వేడిగాలులు, ఎడతెగని వర్షపాతాలను ఎదుర్కొంటున్నాయి.