Sri Lanka: శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య; దేశ పీఎం పదవి చేపట్టిన తొలి విద్యావేత్త
Harini Amarasuriya: శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణ స్వీకారం చేశారు. హరిణి ఈ ద్వీప దేశానికి 16వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు, శ్రీలంక ప్రధాని పదవి చేపట్టిన మూడో మహిళగా కూడా ఆమె నిలిచారు.
శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య
Harini Amarasuriya: శ్రీలంక తొమ్మిదో అధ్యక్షుడిగా అనురా కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆ దేశ నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణ స్వీకారం చేశారు.
కూటమి నేత
అధ్యక్ష ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘే ఓడిపోయిన తరువాత ప్రధాని పదవికి దినేశ్ గుణవర్ధనే రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానంలో శ్రీలంక ప్రధానిగా అమరసూర్య ఎన్నికయ్యారు. హరిణి అమరసూర్య అధ్యక్షుడు దిసనాయకే నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విక్రమసింఘే మూడో స్థానంలో నిలవగా, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలిచారు. అలాగే, న్యాయ, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, పెట్టుబడుల శాఖలను కూడా అమరసూర్యకు అప్పగించారు.
హరిణి అమరసూర్య ఎవరు?
- హరిణి అమరసూర్య మార్చి 6, 1970 న జన్మించారు. ఇప్పుడు శ్రీలంక 16 వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవిని చేపట్టిన మూడవ మహిళ గా నిలిచారు. గతంలో సిరిమావో బండారునాయకే, చంద్రికా కుమారతుంగ శ్రీలంక ప్రధానులుగా వ్యవహరించారు.
- హరిణి అమరసూర్య 2020 లో ఎన్పీపీ కూటమి తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు.
- హరిణి అమరసూర్య సోషియాలజీలో బిఎ (ఆనర్స్), ఎంఎ ఆంత్రోపాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్డీ (ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం నుండి) చేశారు. వృత్తిరీత్యా ఆమె విశ్వవిద్యాలయ లెక్చరర్ గా ఉన్నారు.
- శ్రీలంక తొమ్మిదవ పార్లమెంటులో (2020-2024) ఆమె 269 రోజులు హాజరై, 120 రోజులు గైర్హాజరయ్యారు.
- అమరసూర్య శ్రీలంకలో ప్రధానమంత్రి అయిన మొదటి విద్యావేత్త, రాజకీయ నేత.