Viral Video: ముంబైలో కొరియన్ యూట్యూబర్‌ను వేధించిన ఆకతాయిలు.. లైవ్ స్ట్రీమ్ చేస్తుండగా..
South Korean YouTuber harassed in Mumbai: ముంబైలో లైవ్ స్ట్రీమ్ చేస్తున్న ఓ సౌత్ కొరియన్ యూట్యూబర్‌ను ఇద్దరు ఆకతాయిలు వేధించారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
South Korean YouTuber harassed in Mumbai: ముంబైకు వచ్చిన ఓ దక్షిణ కొరియా యూట్యూబర్‌ను ఇద్దరు ఆకతాయిలు వేధించారు. నడిరోడ్డుపైనే ఓ వ్యక్తి ఆమె చేయి పట్టుకొని లాగాడు. ముద్దు పెట్టేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఆమె నో.. నో అంటూ వారించినా ఇబ్బంది పెట్టడం కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇవే..
ఇదీ జరిగింది
ముంబైలోని ఓ రద్దీ ప్రాంతంలో దక్షిణ కొరియాకు చెందిన ఓ లేడీ యూట్యూబర్ లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే.. బైక్‍పై ఇద్దరు వచ్చారు. అందులో ఓ వ్యక్తి.. ఆమె చేయి పట్టుకొని లాగాడు. తమతో రావాలంటూ బలవంత పెట్టాడు. ఓ దశలో ముద్దు పెట్టుకోబోయాడు. అయితే ఆ యూట్యూబర్ నో.. నో అంటూ వారించారు. అయినా అతడు బలవంత పెట్టాడు. కొద్ది దూరం పోయాక కూడా ఫాలో చేశారు. లిఫ్ట్ ఇస్తామంటూ ఇబ్బంది పెట్టారు. అయితే ఆ యూట్యూబర్ ఎంతో సహనంతో తను దగ్గర్లోనే ఉంటున్నాని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గొడవ వద్దనుకున్నా: యూట్యూబర్
South Korean YouTuber harassed in Mumbai: ఈ తతంగానికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వేధించిన ఆ ఇద్దరిని తప్పకుండా శిక్షించాల్సిందేనని ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు. ఈ వీడియోకు ఆ కొరియన్ యూట్యూబర్ కూడా స్పందించారు. “నిన్న రాత్రి లైవ్ స్ట్రీమ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి నన్ను వేధించాడు. పరిస్థితి తీవ్రం తరం చేయకూడదని, సమస్య ముగిసిపోయేలా చేసేందుకు నేను ప్రయత్నించా. ఎందుకంటే అతడు స్నేహితుడితో ఉన్నాడు. కొంత మందితో నేను స్నేహపూర్వకంగా ఉండడం, మాట్లాడడం వల్ల ఇది మొదలైందని కొందరు చెప్పారు. స్ట్రీమింగ్ గురించి నేను మళ్లీ ఆలోచించేలా చేసింది” అని ఆ యూట్యూబర్ ట్విట్టర్‌లో స్పందించారు.
ఇద్దరు అరెస్ట్
ఈ వీడియో ఆధారంగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను మొబీన్ చాంద్ మహమ్మద్ షేక్, మహమ్మద్ నకీబ్ సదారియలామ్‍గా పోలీసులు గుర్తించారు. “ఖార్ వెస్ట్ పరిధిలో ఒక కొరియన్ మహిళ (విదేశీ)కు జరిగిన సంఘటనపై ఖార్ పోలీస్ స్టేషన్ సుమోటోగా చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి, సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు” అని ముంబై పోలీస్ విభాగం ట్వీట్ ద్వారా వెల్లడించింది.
టాపిక్